కైకమ్మ తన భర్త ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, రాముడిని అడవికి పంపింది. దశరథుడు మరణించాక, భరతుడు వచ్చి జరిగిన ఉపద్రవం తెలుసుకున్నాడు. 'నీరు త్రాగిన మట్టి పాత్రని మరొక్కసారి తిరిగి వాడని వాడు రాముడు.. ఇక నీవు రాజ్యాన్ని పద్నాలుగు సంవత్సరాలు పాలించాక, నీవు పాలించిన రాజ్యాన్ని ఎన్నటికీ తిరిగి తీసుకోడు' అని కైకమ్మ భరతుడితో చెప్పింది. అందుకు భరతుడు, 'నేను స్వప్నంలో కూడా రాజ్యాన్ని స్వీకరిస్తానని ఊహించుకోకు, అట్లా చేస్తే నేను రామ సోదరుడిని ఎట్లా అవుతాను? నేను రాముడి దాసుడిగానే ఉంటాను' అని ప్రతిజ్ఞచేశాడు.
[ రామాయాణంలో చాలామందికి తెలియని 5 గాథలు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/dEbHl4Yey3U ]
కైకమ్మ చేసిన పనికి పాపం భరతుడిని తిట్టని వారు లేరు. ఆపై కౌసల్యమ్మ వద్దకి భరతుడు వచ్చినప్పుడు, 'రాజ్యాన్ని నిష్కంఠకంగా అనుభవించడానికి మంచి ఉపాయం చేశావు' అని అనేసరికి, భరతుడు ఎంతో శోకించాడు.. ఎన్నో శాపనార్థాలు పెట్టుకున్నాడు. తనని తాను దూషించుకుని, స్పృహతప్పి పడిపోయాడు. అప్పుడు కౌసల్యమ్మకు నమ్మకం కలిగి, భరతుడిని ఓదార్చింది. అప్పుడు వశిష్టులవారు వచ్చి, కొన్ని మాటలు అన్నాడు. పాపం ఏ తప్పూ చేయకున్నా, అందరూ విసుక్కున్న వారే.. భరతుడు రాముడినే రాజును చేయాలని అడవికి వచ్చాడు. ఎందరో ఎన్నో రకాలుగా దూషించారు.
ఆటవికుడైన గుహుడు, 'ఏ పాపం చేయని రామునికి, ఎం చేద్దాం అని ఇంత సైన్యం పట్టుకుని వచ్చావు?' అని అడిగాడు. భరద్వాజుడు కూడా అట్లానే అడిగాడు. ఒక్క సారి కుప్ప కూలి రోదించాడు. తన నైజాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. మాటకు మాటా సమాధానం ఇవ్వలేదు. భరద్వాజుడు తన తపస్సంపద అంతా వాడి, ఒక పెద్ద విలాసవంతమైన నగరం సృజించాడు. అక్కడ ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి, భరతుడిని సింహాసనంపై కూర్చోమని చెప్పాడు. అందుకు భరతుడు వెళ్ళి, సింహాసనంపై రాముడు కూర్చున్నాడని భావిస్తూ, వింజామర ఊపుతూ ఉండిపోయాడు. అప్పుడు భరద్వాజ మహర్షికి, తన తపస్సు సార్థకం అయిందనీ, ఒక మంచి భక్తుని కోసం వాడాను అని అనుకున్నాడు.
అట్లా అనేక చోట్ల భరతుడు తన ప్రవర్తన చేత నిరూపించుకున్నాడు. కానీ, తాను మాటకు మాటా అని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. తన ప్రవర్తన చేతా, తన నడవడిక చేతా, గుర్తించగలిగేట్టు నిరూపించుకున్నాడు. రావణ వధ అనంతరం, దేవతలతో పాటు దశరథుడు కూడా వచ్చి, రాముడిని కోరిక కోరుకో అని అడిగినప్పుడు, 'భరతుడిని కొడుకుగా భావించను అన్నావు, ఆ మాట వెనుకకు తీసుకో' అని అడిగాడు. 'అది భరతుని దోషం కాదు, కైకమ్మది కూడా కాదు.. ఇదంతా దేవతలు చేయించిన పని అని ఇప్పుడు తెలిసింది' అని అన్నాడు. మనిషిపై నింద వస్తే, నడవడికతో నిరూపించుకోవాలి కానీ, దెబ్బలాడ కూడదు.
రాముడిని రాజ్యానికి తిరిగి రమ్మన్నాడు భరతుడు. అందుకు ఒప్పుకోలేదు రాముడు. 'నీవు రాకుంటే నీ ప్రాతినిద్యం వహించే ఎవరైనా ఒకరు ఉండాలి, నేను పాలించడం జరగదు' అని చెప్పాడు. అందుకు బంగారు పాదుకలని తెప్పించి రామచంద్రుడు నిలబడితే, ఇవి లోకాన్ని రక్షించేవి అని సంకల్పం చేసి, రాముడు ఇచ్చాడు. పాదుకలే పాలిస్తాయని అప్పుడు భరతుడు తీసుకుని రాజ్య పాలన చేశాడు. నందిగ్రామంలో ఉండి, రాముని వలె వనవాసంలో ఉన్నట్లే, కందమూలాలను తింటూ, నియమాలను పాటిస్తూ, పాలించాడు. అన్న మీద ఉన్న ప్రేమచే పాటించాడు. ధర్మానికి కట్టుబడి ఉండటం ఎలానో నిరూపించుకున్నాడు. రామ పాదుకలను ముందుంచి, తన కార్యక్రమాలని చేశాడు.
మానవునిగా అవకాశం ఇచ్చిన దైవాన్ని మరచి ప్రవర్తించ కూడదనే విషయం, మనకు భరతుడిని చూస్తే తెలుస్తుంది. దైవానికి దాసునిగా బ్రతకాలని తెలిపాడు. దాస భావం, ధర్మం విషయంలో ఇట్లా ఉండాలి..
Link: https://www.youtube.com/post/UgyEMF9LWwG_u5OALc54AaABCQ
Post a Comment