మోహినీ అవతారంతో విష్ణుమూర్తి అలరారే అత్యద్భుత ఆలయ రహస్యం!


మోహినీ అవతారంతో విష్ణుమూర్తి అలరారే అత్యద్భుత ఆలయ రహస్యం!

శ్రీ మహా విష్ణువు, లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలనెత్తాడు. వాటిలో అత్యంత ప్రముఖమైనది, మోహినీ అవతారం. నారాయణుడు, నారాయణిగా కనువిందు చేసే అద్భుత రూపం, ఎటువంటి వారినైనా, ఎంతట మహామహులనైనా, తన అందంతో మోహింపజేయగల రూపం, మోహిని. విష్ణు మూర్తికి, శక్తి రూపాన్ని ధరించడం అంటే చాలా ఇష్టమట. అందుకే, చాలా సందర్భాలలో, మోహిని అవతారం దాల్చి, లోక రక్షణ గావించాడు. మరి అటువంటి అపురూపమైన మోహిని అవతారంలో సాక్షాత్కరిస్తున్న దేవాలయం గురించి మీకు తెలుసా? శ్రీ మన్నారాయణుడూ, మోహినీ, రెండు రూపాలూ ఒకే శిలలో దాగి ఉన్న ఆ అత్యద్భుత ఆలయ రహస్యం గురించీ, మన పురాణాలలో వివరించబడిన మోహినీ అవతారాల గురించీ, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి = https://youtu.be/2n6HgWmbuo0 ]

క్షీరసాగర మధనానంతరం, విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తి, రాక్షసులను మరులు గొలుపుతూ, వారిని ప్రక్కదొవ పట్టించి, దేవతలకు మాత్రమే అమృతం అందేలా చేశాడు. మోహిని రూపం గురించీ, ఆమె అందచందాల గురించీ, మునులూ, దేవతలూ పొగడుతుండగా, అది విన్న శివుడు, విష్ణువు వద్దకు వెళ్లి, నీవు మోహిని అవతారం ధరించిన సమయంలో, నేను గరళాన్ని శోషించి మత్తులో ఉన్నాను. నా కోసం ఇప్పుడు మరోక సారి మోహిని రూపాన్ని చూపించు, అని అడిగాడు. శివుని కోరిక మేరకు, విష్ణువు మరల మోహినీ అవతారమెత్తి, పార్వతీ దేవి మరొక రూపాన్ని చూపించాడు.  ఒకానొక సమయంలో, మునులందరూ ధర్మాన్ని వదిలి, ఎవరికి వారే గొప్పవారుగా ప్రకటించుకుంటూ, సత్కర్మలను విడిచి పెట్టగా, అప్పుడు విష్ణు మూర్తి మోహిని అవతారమెత్తి, వారిని మోహంలోకి దింపి, సత్యాన్ని బోధించాడు. సూర్యుని నుండి వరంగా పొందిన అజేయమైన మాయా కిరీటంతో విరోచనుడు పేట్రేగిపోయి, స్వర్గాన్ని తన వశం చేసుకుని, అల్లకల్లోలం సృష్టిస్తోన్న సమయంలో, విష్ణువు మోహినిగా వచ్చి, విరోచనుడి నుండి, ఆ మాయా కిరీటాన్ని వశపరుచుకుని, తన సుదర్శన చక్రంతో అతనిని సంహరించాడు. 

ఇక భస్మాసుర కథ అందరికీ తెలిసే ఉంటుంది. శివుని దగ్గర నుండి వరం తీసుకున్న భస్మాసురుడు, ఆ లయకారుణ్ణే సంహరించాలని చూస్తుండగా, విష్ణువు మోహినిగా వచ్చి, ఆ భస్మాసురిడి చేయి, తన తల మీదే పెట్టుకునేలా చేసి, భస్మమయ్యేలా చేశాడు. ఆ తరువాత మోహినిని చూసిన శివుడు, ఆమెను వెంబడిస్తుండగా, ఆమె కొప్పు నుండి ఒక పువ్వు రాలి క్రిందపడింది. ఆ పువ్వు వాసన చూసిన పరమేశ్వరుడికి, మాయ వీడి, మోహిని రూపంలో ఉన్నది విష్ణువని గుర్తించాడు. అదే సమయంలో, శివుని వైపు తిరిగిన విష్ణువు, వెనుక వైపు మోహినిగా, ముందు వైపు విష్ణువుగా అవతరించాడు. ఆ పువ్వు రాలి పడిన ప్రాంతమే, నేటి ర్యాలి. విష్ణువు రెండు రూపాలలో నెలకొన్న ఆ ఆలయమే, జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. ఈ సంఘటనకు ఆధారంగా, మోహినీ- కేశవస్వామి ఆలయానికి ఎదురుగా, ఉమా కమండలేశ్వర స్వామిగా, శివయ్య దర్శనమిస్తున్నాడు. 

ఈ ఆలయంలో మోహిని అవతారంలో ఉన్న విష్ణువు సాలగ్రామ విగ్రహాన్ని చూడటానికి, రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ విగ్రహానికున్న విశిష్టతలూ, ఈ ఆలయానికి ఎదురుగా ఉండే పరమశివుని ప్రత్యేకతలూ తెలుసుకుంటే, శరీరం, మనస్సూ పులకరించి పోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తూర్పు గోదావరి జిల్లా, రావుల పాలానికి అత్యంత దగ్గరగా ఉన్న ఈ ర్యాలీ గ్రామం, ప్రకృతి రమణీయతతో, కోనసీమ అందాలతో, స్వర్గాన్ని తలపిస్తుంటుంది. ఈ గ్రామం, వశిష్ఠ, గౌతమి అనే రెండు గోదావరి ఉప పాయల మధ్య అలరారుతోంది. ఇక్కడ నెలకొన్న జగన్మోహినీ చెన్న కేశవ ఆలయ ఆవిర్భావ చరిత్రకి, మరొక కధ కూడా ప్రాచుర్యంలో ఉంది. 

11వ శతాబ్దంలో, ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అప్పటి కాలంలో, ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి కావడంతో, చోళ రాజులలో ఒకరైన విక్రమ దేవుడు వేటకు వెళ్లి అలసిపోయి, ఈ గుడి ఉన్న ప్రాంతంలోని ఒక పొన్న చెట్టు క్రింద సేద తీరుతుండగా, కలలో మహా విష్ణువు కనపడి, తన విగ్రహం, రధం యొక్క శీల పడిన ప్రాంతంలో ఉందనీ, అక్కడ తనకి గుడి కట్టించమనీ చెప్పాడు. దాంతో రాజు ఆ ప్రాంతాన్ని త్రవ్వించి, విగ్రహాన్ని బయటకు తీయించి, ఆ పొన్న చెట్టుక్రిందే ప్రతిష్ఠింపజేసి, గుడి కట్టించాడు. రధ శీల పడింది కాబట్టి, ఈ ప్రాంతాన్ని ‘ర్యాలి’ అంటారనే కథ కూడా ప్రచారంలో ఉంది. జగన్మోహిని అవతారంతో ఉన్న ఈ విగ్రహం, ఐదడుగుల ఎత్తూ, 3 అడుగుల వెడల్పూ కలిగిన ఏక సాలిగ్రామ శిల. ముందు భాగంలో కేశవస్వామి నాలుగు చేతులలో, శంఖ, చక్ర, గదా, పద్మాలను అలంకరించి, కనువిందు చేస్తాడు. వెనుక భాగంలో ఉన్న మోహిని రూపం, పద్మినీజాతి స్త్రీ అలంకరణతో, కళ్లు చెదిరే అందంతో, జీవ కళ ఉట్టిపడుతుంది. నల్లరాతిపై కూడా ఆమె సిగా, ఆభరణాలూ, గోళ్లూ, తోడ వెనుక భాగాన ఉన్న పుట్టుమచ్చ కూడా చాలా అద్భుతంగా ప్రకటితమవుతుంది. ఈ విగ్రహం చుట్టూ, విష్ణువుకి నీడనిస్తున్నట్లుగా, పొన్న చెట్టూ, దశావతారాలూ, ఆదిశేషువూ, శ్రీదేవీ, భూదేవీ, గరుత్మంతుడూ, నారద మునీంద్రులూ, ఇలా సకల దేవతలూ కొలువై ఉంటారు.

ఈ ఆలయంలో దాగిన మరొక విశేషం ఏమిటంటే, కేశవస్వామి పాదాల నుంచి, నిరంతరం నీరు ఊరుతూనే ఉంటుంది. తీసిన కొద్దీ, నీరు వస్తూనే ఉంటుంది. విష్ణు మూర్తి పాదాల దగ్గర పుట్టిన గంగ, ఈ ఆలయంలో కూడా అదే విధంగా గోచరిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయానికి ఎదురుగా ఈశ్వరుడు, ఉమా కమండలేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు బ్రహ్మ సృష్టించిన లింగంగా, ఈ శివాలయం పేరొందింది. ఈ ఆలయంలో స్వామి వారికి అభిషేకించబడే నీరు బయటకు వెళ్ళడానికిగానీ, లోపలికి వెళ్ళడానికిగానీ, మార్గం లేదు. ఈ శివలింగంపై నీరు పడగానే, హరించుకుపోతుందట. ఇదంతా పరమేశ్వరుని లీలగా భావిస్తారు భక్తులు. అయితే, ఈ ఆలయానికి ‘బదిలీ’ ఆలయమని కూడా, పేరుంది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించినవారు, తప్పకుండా తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతారని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో కొలువైన స్వామి వారి విగ్రహంలోని రెండు రూపాలూ, అత్యద్భుతంగా, అతి సుందరంగా మలచబడ్డాయి. బహుశా ఇటువంటి ఆలయం, ఈ ప్రపంచంలో ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదేమో. ఈ ఆలయంలో ప్రతీ ఏడాదీ, చైత్ర శుద్ధ నవమి నాడు, జగన్మోహినీ కేశవ కళ్యాణం, ఎంతో వైభవంగా జరుపుతారు.

Link: https://www.youtube.com/post/UgxTgIwCb8Cn7Z4V3rp4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes