సైంధవ వధ – ద్రౌపది విషయంలో వావివరుసలు మరచిన దుర్యోధనుడి బావమరిది పరిస్థితి!


సైంధవ వధ – ద్రౌపది విషయంలో వావివరుసలు మరచిన దుర్యోధనుడి బావమరిది పరిస్థితి!

మహాభారతం ఒక గొప్ప గ్రంధం మాత్రమే కాదు.. మానవులందరికీ మార్గదర్శకం కూడా. అందులోని ప్రతీ పాత్ర, ప్రస్తుత సమాజంలోని మనుష్యుల జీవితాలను ప్రతిబింబించేలా ఉంటుంది. అందుకే, నాటి గాధ, నేటికీ, ప్రాముఖ్యతను సంతరించుకుని, మహాభారత ఇతిహాస రచన, గ్రంథరాజంగా భాసిల్లుతోంది. భారతంలో, వీరాదివీరులెందరో ఉన్నా, ఎవరికి వారే సాటి. అటువంటి ప్రముఖులలో, సింధు దేశపు రాజు జయద్రధుడు కూడా ఒకడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/j5edtokAkqE ​]

గాంధారికి జన్మించిన ఏకైక కుమార్తె, కురు పాండవుల ముద్దుల సోదరి ‘దుస్సుల’ భర్తే, ఈ జయద్రధుడు. మహాపరాక్రమవంతుడైనా, తన దుర్మార్గపు బుద్ధితో నీచంగా ప్రవర్తించి, తన మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు. పాండవుల విషయంలో తాను చేసిన తప్పేంటి? కురుక్షేత్రంలో అభిమన్యుడి మరణానికి, జయద్రధుడే కారణమా? రాజ్యాన్ని వదిలి, తపస్సులో నిమగ్నమైన తన తండ్రి మరణం, జయద్రధుడి వల్లనే సంభవించిందా? అతని మరణం తరువాత, ఆ రాజ్యం ఏమైంది - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

సింధు దేశపు రాజు, వృద్ధక్షత్రుడు. అతనికి లేకలేక కలిగిన సంతానమే, జయద్రధుడు. అతడు పిల్లవాడుగా ఉన్పప్పుడు ఒకనాడు ఆకాశవాణి, "జయద్రధుడు వీరుడిగా, శూరుడిగా పేరు పొందినా, చివరకు తల నరకబడి, మరణిస్తాడు" అని పలికింది. ఆ మాట విన్న తండ్రి వృద్ధక్షత్రుడు ఆవేదనతో, ఆగ్రహంతో, “ఎవరైతే నా కొడుకు తలని నేలపై పడేస్తారో, వారి తల నూరు ముక్కలవుతుంది” అని శపించాడు. ఆ తరువాత కొంతకాలానికి, జయద్రధుడికి పట్టాభిషేకం చేయించి, తపోవనానికి వెళ్ళిపోయాడు, వృద్ధక్షత్రుడు. జయద్రధుడు సింధు దేశానికి రాజు కావడం చేత, సైంధవుడనే పేరుతో, ప్రసిద్ధి చెందాడు. వ్యాసుడి అనుగ్రహం వలన, గాంధారికి వందమంది కౌరవులతో పాటు, ఒక కుమార్తె దుస్సుల కూడా, జన్మించింది. కౌరవుల ఆడబిడ్డను పెళ్లి చేసుకుని, జయద్రధుడు, హస్తినకు అల్లుడయ్యాడు. అయితే, సైంధవుడికి మరో ఇద్దరు భార్యలున్నారు.

గాంధార రాజ్యం, కాంభోజ రాజ్యానికి చెందిన యువరాణులను, వివాహాం చేసుకున్నాడు. స్త్రీ లోలుడైన సైంధవుడు, సాళ్వరాజు కుమార్తెను పెళ్ళాడడానికి, తన సైన్యం, మంత్రి కోటికాస్యుడితో, అరణ్యమార్గం గుండా బయలుదేరాడు. ఆ సమయంలో అరణ్యవాసంలో ఉన్న పాండవులు, ద్రౌపదిని, తృణబిందు, ధౌమ్య రుషుల ఆశ్రమంలో ఉంచి, వేటకు వెళ్ళారు. మహా సౌందర్యవతి అయిన ద్రౌపదిని, పూలు కోస్తుండగా చూసి సైంధవుడు, ఆమెపై మోహాన్ని పెంచుకున్నాడు. తన వివరాలు తెలుసుకుని రమ్మని కోటికాస్యుడిని పంపి, ఆమె పాండవుల ధర్మపత్ని ద్రౌపది అని తెలుసుకున్నాడు. వరుసకు సోదరి అవుతుందని తెలిసి కూడా, ద్రౌపది దగ్గరకు వెళ్లి, తనపై ఉన్న కోరికను వివరించి, పెళ్ళి చేసుకుంటానని అడిగాడు. దాంతో ఆగ్రహించిన ద్రౌపది, ‘వావివరుసలు మరచి, అన్నవరసైన నీవు ఈ విధంగా మాట్లాడడం తగదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపో’ అని హెచ్చరించింది. కానీ, నీచబుద్ధి కల సైంధవుడు, ద్రౌపదిని బలవంతంగా తన రథంలో ఎక్కించుకుని, అపహరించాడు. ద్రౌపది పరిచారిక ధాత్రేయిక వల్ల, పాండవులకి జరిగిన విషయం తెలిసింది.

వెంటనే భీమార్జునులు, సైంధవుణ్ని వెంబడించి, యుద్ధం చేసి, ఓడించారు. ద్రౌపదిని వెనక్కి తెచ్చుకోవడంతో సరిపెట్టకుండా, సింధూ, సౌవీరా, శిబి సైన్యాలను ఓడించి, సైంధవుణ్ని బంధించి తెచ్చి, ధర్మరాజు ముందు పడేశారు. భీముడు కోపంతో సైంధవుణ్ని చంపబోతే, ధర్మరాజు అడ్డుకున్నాడు. నీ పట్ల అమానుషంగా ప్రవర్తించిన సైంధవుడికి ఏ శిక్ష వేయమంటావని ధర్మరాజు అడుగగా, అందుకు ద్రౌపది పెద్ద మనస్సుతో, ‘ఎంతైనా, మన ఇంటి ఆడపడచు భర్త. తన పసుపు కుంకుమలను దూరం చేయడం మంచిది కాదు. కేశ ఖండన, శిర:ఖండనతో సమానం’ అని చెప్పి, సైంధవుడిని వదిలేయమంది. పాండవులు చేసిన అవమానం, సైంధవుడిని అగ్నిలా కాల్చింది. వారిపై పగ తీర్చుకోవడం కోసం, గంగానది ఒడ్డున, శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమవ్వగా, పాండవులను ఓడించేలా వరమిమ్మని కోరాడు, సైంధవుడు.

‘‘వారు ధర్మ రక్షకులు. అలా కుదరదు. నా పాశుపతాస్త్రం ఉంది కనుక, అర్జునుణ్ణి నీవెలాగూ ఓడించలేవు. అర్జునుడు లేని సమయంలో, మిగిలిన నలుగురినీ, ఒక్కరోజు మాత్రం ఓడించగలవు'' అన్నాడు పరమేశ్వరుడు. అహంకారంతో, ఆ అవకాశం చాలనుకున్నాడు సైంధవుడు. మహాభారత యుద్ధంలో, భీష్ముడు పతనమై, పాండవులు వీర విహారం చేస్తున్న సమయంలో, దుర్యోధనుడి కోరిక మేరకు, సేనాపతి అయిన ద్రోణుడు, పద్మవ్యూహం పన్నాడు. పద్మవ్యూహ విద్య, పాండవులలో అర్జునుడికి తప్ప, మిగతా ఎవ్వరకీ రాదన్న విషయం, కౌరవులకు తెలుసు. అందుకే, అర్జునుడిని ప్రక్క దోవ పట్టించి, పద్మవ్యూహాన్ని అమలు చేశారు. కౌరవులను ఏ విధంగా అడ్డుకోవాలని పాండవ సైన్యం ఆలోచిస్తుండగా, అభిమన్యుడు, తనకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసనీ, బయటకు రావడం తెలియదనీ, వారికి వివరించాడు.

దాంతో మిగిలిన పాండవులు, తాము వెంట ఉండి, అభిమన్యుడిని కాపాడతామని, పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అర్జునుడు మినహా మిగిలిన వారందరూ, పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సైంధవుడు, తనకున్న వరంతో పాండవులకు అడ్డు పడి, అభిమన్యుడికి సహాయం అందకుండా, ఒంటిరిని చేశాడు. అభిమన్యుడు ఎంతో వీరోచితంగా పోరాడినా, ఏకాకి కావడం చేత, ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మరణానికి సైంధవుడే కారణమని తెలుసుకున్న అర్జునుడు, మరుసటి రోజు సూర్యస్తమయంలోపు అతనిని అంతం చేస్తాననీ, లేదంటే, అస్త్రశస్త్రాలన్నీ వదిలేస్తాననీ, ప్రతినబూనాడు. అర్జునుడి శపథంతో భయపడ్డ సైంధవుడు, యుద్ధం చేయనన్నాడు. అందుకు దుర్యోధనుడు తనకు కాపలాగా, ద్రోణ, కర్ణ, శల్య, శకుని, అశ్వత్థామ, కృపాచార్యులను నియమించాడు. సైంధవుడిని సంహరించడానికి వచ్చిన పాండవులను అడ్డుకున్నారు, దుర్యోధనుడి సైన్యం. అర్జునుడు చింతిస్తూ, సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుండగా, జగన్నాటక సుత్రధారి అయిన శ్రీ కృష్ణుడు, తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా ఉంచి, సూర్యాస్తమయం అయిపోయిందనే భావనను కలిగించాడు.

సూర్యాస్తమయం జరిగిందని, కౌరవసైన్యం అంతా, తాము పన్నిన వ్యూహం నుండి సడలిపోయారు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక, సూర్యాస్తమయం అయిపోయిందిగనుక, అస్త్ర సన్యాసం చెయ్యాలని ఆలోచిస్తుండగా, శ్రీకృష్ణుడు అసలు విషయం చెప్పి, తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగించాడు. దాంతో, ఒంటరైన సైంధవుడితో యుద్ధం చేసి, తనదగ్గరున్న పాశుపతాస్త్రం ప్రయోగించాడు, అర్జునుడు. ఆ పాశుపతాస్త్రం, సైంధవుడి శిరఛ్చేధం చేయగా, ఆ శిరస్సు నేలపై పడకుండా, ఆ అస్త్ర సహాయంతోనే, వనంలో తపస్సు చేసుకుంటున్న సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడి చేతులలో పడేటట్లు చేయమని, శ్రీ కృష్ణుడు సూచించాడు. తన తండ్రి శాపం ప్రకారం, సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో, వారి శిరస్సు నూరు చెక్కలవుతుంది. అందుకే, కృష్ణుని ఆజ్ఞ మేరకు, ఆ తలని పాశుపతాస్త్రంతో, తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుడి ఒడిలో పడేలా చేశాడు. దాంతో, అకస్మాత్తుగా ఉలిక్కిపడి, వృద్ధక్షత్రుడు, తలని నేలమీద పడేయడంతో, అతని శాపం, అతనికే తగిలి, తన తల నూరు ముక్కలయింది.

ఇక సైంధవుడి మరణం తరువాత, దుస్సల కుమారుడు సురధుడు, సింధు దేశానికి రాజయ్యాడు. కురుక్షేత్రంలో గెలిచి, హస్తినాపుర సింహాసనాన్ని చేజిక్కించుకున్న ధర్మరాజు, అశ్వమేధయాగాన్ని తలపెట్టాడు. అందులో భాగంగా, యాగాశ్వం సింధురాజ్యం వైపు పరుగులు తీసింది. ఆ అశ్వాన్ని కాపాడేందుకు, దాని వెనుకనే, అర్జునుడు బయలుదేరాడు. యాగాశ్వం తమ రాజ్యం వైపుగానే వస్తోందని తెలిసిన సురధుడు, అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతో, ప్రాణత్యాగం చేసుకున్నాడు. కానీ, సురధుని కుమారుడు మాత్రం, అర్జునుని ఎదుర్కొనేందుకు సిద్ధపడడంతో, తన భర్తనీ, కుమారుడినీ కొల్పోయిన దుస్సల, తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి, తన మనవడిని కాపాడమంటూ, అర్జునుడిని వేడుకుంది. దుస్సల కోరిక మేరకు, సింధు రాజ్యాన్ని విడిచిపెట్టి వెనుదిరిగాడు, అర్జునుడు. ఈ గాథ, ద్వాపరయుగం నాటిది. కానీ, ఇప్పటికీ ఒక మంచి పనికి ఎవరైనా అడ్డుపడితే, ‘సైంధవుడిలా అడ్డుపడ్డాడ'ని అంటూంటాం. అటువంటి అపకీర్తిని శాశ్వతంగా మూటగట్టుకున్నాడు, వీరుడైన సైంధవుడు.

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes