పిప్పలాదుడెవరు? - శని దోష ప్రభావం పోవడానికీ పిప్పలాదుడికీ సంబంధం ఏంటి?
లోక కలాణ్యం కోసం, ఎందరో రుషులూ, మునులూ, ఎన్నో త్యాగాలు చేశారు. వారిలో ప్రముఖుడు, దధీచి మహర్షి. రాక్షస సంహారం కోసం, తన శరీరాన్ని తృణ ప్రాయంగా వదిలి, తన ఎముకలను వజ్రాయధంగా మలచడానికి దేవతలకు అందించిన మహానుభావుడు. అతని కూమారుడైన పిప్పలాదుడు, చిన్న వయస్సులోనే తల్లి దండ్రులను కోల్పోయి, బ్రాహ్మవేత్తగా మారి, ప్రశ్నోపనిషత్తు గ్రంధానికి కేంద్రమయ్యాడు. బ్రహ్మవిద్యలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది, ఈ ప్రశ్నోపనిషత్తు. తల్లి దండ్రులు లేని పిప్పలాదుడు ఎలా జీవించాడు? బ్రహ్మవేత్తగా ఎలా మారాడు? శని దోష ప్రభావం పోవడానికీ, పిప్పలాదుడికీ ఉన్న సంబంధం ఏంటి - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/cn5oshLgfcA ]
పిప్పలాదుడి తండ్రి అయిన దధీచి మహర్షి గురించిన సమాచారం తెలుసుకోవడానికి, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరచిన వీడియో లింక్ చూడండి..
[ దధీచి మహర్షి చరిత్ర! (Story of Dadhichi): https://youtu.be/DlfdeuIRzqA ]
పిప్పలాద మహర్షి చరిత్ర, పద్మ పురాణంలోనూ, శివపురాణం లోనూ ఉంది. పిప్పలాదుడు, బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. ఈయన దయాళువు, త్యాగశీలి. దేవతల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దధీచీ, సువర్చలల కుమారుడు. దధీచి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన ఎముకలను దేవతలకు దానము చేస్తే, వాటితో ఇంద్రుడు వజ్రాయుధాన్నీ, బ్రహ్మ చక్రమునూ తయారు చేసుకుని, అసురులపై యుద్ధము చేశారు. దధీచి ప్రాణత్యాగము చేసేనాటికి, అయన భార్య సువర్చల గర్భవతి. ఆమె గర్భంలో కుమారుడున్నాడు. భర్త వియోగాన్ని తట్టుకోలేక, ఆమె సహగమనం చేద్దామని అనుకుంది. యోగాగ్నితో, తను కూడా అగ్ని ప్రవేశం చేయాలని, నిశ్చయించుకుంది. కొంతమంది ముని పుంగవులు ఆమెను వారించి, "ఇప్పుడు నీవు గర్భవతివి! శిశువుకు జన్మనిచ్చిన తర్వాత నీవు సహగమనం చెయ్యి" అని అన్నారు. అందుకామె, తన భర్త పోయిన తర్వాత, ఈ లోకంలో జీవించలేనని, ఖడ్గంతో తన గర్భాన్ని తానే చీల్చుకుంది. బాలుడిని సమీపంలో ఉన్న పిప్పలి వృక్షం, అంటే, రావి చెట్టు వద్ద ఉంచి, దేవతలు వద్దని వారించినా, సహగమనము చేసి, భర్తను చేరింది. పిప్పలి వృక్షం ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచింది. దాని సంరక్షణలో పెరిగాడు కాబట్టి, ఆ బిడ్డడికి పిప్పలాదుడనే పేరు వచ్చింది. దేవతలెవరూ అతడిని గురించి పట్టించుకోలేదు. పిప్పలి వృక్షం, ఆ పిల్లవాడికి అమృతం కోసమని, చంద్రుణ్ణి ప్రార్ధించింది. ఆ విధంగా, చంద్రుడి ద్వారా దొరికిన అమృతంతో, ఆ బాలుడు పెరిగాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు, అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ, ఆ చెట్టు పండ్లు తింటూ, అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు త్రాగుతూ, కాలం గడపసాగాడు.
ఆ పిల్లవాడి దుస్థితిని చూసి బాధపడిన నారద మహర్షి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని, పిప్పలాదుడికి ఉపదేశించాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఆ క్షణం నుండి, పిప్పలాదుడు ఆ మంత్రాన్ని కఠోర దీక్షతో జపిస్తూ, మహర్షిగా మారిపోయాడు. ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి, అతను సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ, అభినందిచాడు. అప్పుడు పిప్పలాదుడు, బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని, నారద మహర్షిని అడుగగా, శనిదేవుడే అందుకు కారణమంటూ చెప్పుకొచ్చాడు నారదుడు. దాంతో పిప్పలాదుడు ఆగ్రహావేశాలతో, శనిదేవుడిని గ్రహమండలం నుంచి క్రిందికి లాగి, బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరించాడు. ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకుని, పిప్పలాదుడికి నచ్చజెప్పారు. అతను శాంతించి, శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలోకి ప్రవేశపెట్టాడు. అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు, శనివారం రోజున ఎవరైతే ‘పిప్పలాద మహర్షి’ నామాన్ని స్మరిస్తారో, వాళ్లకు శని సంబంధమైన దోషాలూ, బాధలూ ఉండవని, వరాన్ని అనుగ్రహించాడు. అందుకే, శని దోషంతో బాధపడేవాళ్లు, పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన, ఆశించిన ఫలితం కనిపిస్తుంది.
శనిగ్రహ దోష నివారణకు పిప్పలాద ప్రోక్త శని స్తోత్రము..
కోణస్థః పింగళో బభ్రుః కృష్ణోరౌద్రాంతకో యమః
సౌరి: శ్శనైశ్చరో మందః పిప్పలాదేవ సంస్తుతః |
ఏతాని ధశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్
శనైశ్చర కృతాపీడా నకదాచిద్భవిష్యతి ||
తరువాత కొంతకాలానికి, తన తల్లిదండ్రులు మరణించడానికి కారణం దేవతలని తెలుసుకున్నాడు, పిప్పలాదుడు. తన స్థితికీ, తన తల్లిదండ్రుల స్థితికీ కారకులైన దేవతలను కఠినంగా శిక్షించాలని నిశ్చయించుకుని, చంద్రుడిని పిలిచి అభిప్రాయం అడిగాడు. అప్పుడాయన, "నీ కోరికను ఎవరూ కాదనలేరు. నీవు గోదావరీ తీరానికి వెళ్లి, అక్కడ ఈశ్వరుని గురించి తపస్సుచెయ్యి. ఆయన అనుగ్రహంతో నీ కార్యం సంపూర్ణం అవుతుంది" అని బోధించాడు. కొన్ని సంవత్సరాల పాటు కఠోర దీక్ష చేసిన తరువాత, ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. "శాంతి, జ్ఞానం, మోక్షం, విద్య, వైరాగ్యం, ఇవన్నీ ఇప్పుడు నేను పట్టించుకునే స్థితిలో లేను. హృదయం దహించుకుపోతోంది. నా తల్లిదండ్రులు జ్ఞప్తికి వస్తున్నారు. నా ఈడు పిల్లలందరూ, అమ్మానాన్నా అని పిలుస్తుంటే, నాకా భాగ్యం లేదు. నేను దిక్కులేని వాడిలాగా, చెట్టుక్రింద పెరిగాను. దేవతలు అనుగ్రహించి వరాలు ఇస్తారు, తపస్సు చేసేవాళ్ళని రక్షిస్తారంటారు కదా! దీనికి విరుద్ధంగా నా విషయంలో ప్రవర్తించిన వారు, క్షంతవ్యులు కారు. అందుకే వాళ్ళను శిక్షించదలుచుకున్నాను. దానికై నాకు కావలసినంత శక్తిని ఇవ్వండి" అని అడిగాడు. అందుకు శివుడు, "దేవతలను సంహరించడం లోక కల్యాణం కాదు.. నీ తల్లిదండ్రులను చూడలేకపోయావనే కదా, నువ్వు దుఃఖపడేది? ఆ దుఃఖం నీకు ఉండదు. నువ్వనుకున్న సమయంలో పితృలోకాలకు వెళ్లి, నీ తల్లిదండ్రుల దర్శనం చేసుకునిరా. వాళ్లతో సంభాషణ కూడా చెయ్యవచ్చు. నీకు వాళ్ళ దర్శనం దొరకగానే, నీ దుఃఖం పోతుంది" అని చెప్పాడు. పితృలోకాలకు వెళ్లి, తల్లిదండ్రుల దర్శనం చేసుకున్న పిప్పలాదుడు, వారి శరీరాలు పోయాయి కానీ, వారు క్షేమంగా, ఆరోగ్యంగా, దివ్యశరీరాలతో వున్నారని శాంతపడ్డాడు. మళ్ళీ భూలోకానికి వచ్చి, తపస్సు చేసుకున్నాడు. కొంతకాలానికి పిప్పలాదునికి, వివాహము చేసుకోవాలని అనిపించి, అనవణ్య రాజు దగ్గరకు వెళ్లి, అయన కూతురు పద్మనిచ్చి వివాహము చేయమని అడిగాడు. అనవణ్య రాజు విష్ణు భక్తుడు. ఇంద్ర పదవిని కూడా వదిలేసిన వ్యక్తి. మొదట్లో రాజుకు, తన కూతురును మునికి ఇవ్వటం ఇష్టపడ లేదు. కానీ, పిప్పలాదుడి గురించి పూర్తిగా తెలుసుకున్నాక, తన అభిప్రాయాన్ని మార్చుకుని, తన కూతురు పద్మను పిప్పలాదునికి ఇచ్చి, వివాహము చేశాడు. పద్మ అందగత్తె మాత్రమే కాదు. మహా పతివ్రత కూడా.
ఒకసారి పద్మ పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి, ధర్మదేవత మారు వేషములో, అందమైన యువరాజుగా వచ్చి, "మునితో ఏమి సుఖ పడతావు. నన్ను వివాహమాడితే, స్వర్గ సుఖాలనుభవించవచ్చు" అని అన్నాడు. అది విన్న పద్మ ఆగ్రహించి, నీ నాశనం తథ్యం అని శపించబోతుండగా, ధర్మదేవత నిజరూపములోకి వచ్చి, నిన్ను పరీక్షించటానికి మారు వేషంలో వచ్చాను. శాంతించు తల్లీ, అని వేడుకుంది. కానీ, తన శాపమును అనుభవించక తప్పదనీ, కలియుగములో ఒంటిపాదముతో ఉండి, తిరిగి కృతయుగము వచ్చేనాటికి, మళ్ళీ నాలుగు పాదాలతో ఉంటావని హెచ్చరించింది, పద్మ. పిప్పలాదుడికీ, పద్మకూ ఐదుగురు కుమారులు జన్మించారు. పిప్పలాదుడు తపస్సు చేసుకుంటూ, తన దగ్గరకు వచ్చిన వారి ధర్మ సందేహాలను తీరుస్తూ, కాలము గడుపుతుండేవాడు. ఒకనాడు కబంధుడు, భార్గవుడు, అశ్వలాయనుడు, సూర్యాయనుడు, సత్యకాముడు, సుకేశుడి వంటి మునులు ఆయన దర్శనార్ధము వచ్చి, వారి సందేహాలను నివృత్తి చేయమని అడిగారు. వారు సృష్టి క్రమాన్ని గురించి మూడు ప్రశ్నలూ, నిత్యమైన పరమాత్మ సంబంధమైన విషయాల మీద మూడు ప్రశ్నలూ వేశారు. ఈ ఆరు ప్రశ్నలకూ పిప్పలాదుడిచ్చిన సమాధానములే, ప్రశ్నోపనిషత్తుగా ఖ్యాతి చెందింది.
మొదటగా కబంధుడు, ఈ ప్రాణి కోటి ఎక్కడి నుండి వచ్చింది? అంటే, ఈ సృష్టి ఎలా జరింగిందని, ప్రశ్నించాడు. అందుకు పిప్పలాదుడు, "ప్రజాపతి తపస్సు చేసి, రయి, ప్రాణం అనే రెండింటినీ సృష్టించాడు. రయి అంటే చంద్రుడు, లేక అన్నం.. అంటే పదార్థమనీ, ప్రాణం అంటే సూర్యుడు లేక అగ్ని అనీ, ఇందులో ప్రాణం భోక్త, రయి భోజ్యమనీ వివరించాడు. మొదటిది స్థూలం, రెండవది సూక్ష్మం. వీటి సంయోగమే, సృష్టి" అని వివరించాడు.
ఇక రెండవ ప్రశ్నగా, ఈ శరీరాన్ని చైతన్య పరిచే దేవత ఎవరు? అని భార్గవుడు అడుగగా, ‘ఈ శరీరం, కర్మ కారణంగా, పంచభూతాత్మకమై ఏర్పడుతుంది. శరీరం, ఇంద్రియాలూ, అన్నీ జడమైనవి. వీటన్నింటిలోనూ, అంతర్వాహినిగా ప్రాణం ఉండి, వాటిని నడిపిస్తూ ఉంద’ని వివరించాడు. పరమాత్మ ఉత్కృష్టుడనీ, ఆయన మొదటి సృష్టి సమిష్టి రూపమైన హిరణ్యగర్భుడు, ప్రజాపతి, లేక ఈశ్వరుడు. ఆయనే ఈ వ్యష్టిరూపమైన సృష్టిని చేశాడనీ, ఆయనే ప్రాణంగా, అన్నింటిలోనూ ఉంటున్నాడనీ, వివరించాడు పిప్పలాదుడు.
అశ్వలాయనుడు, ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది? ఎలా పనిచేస్తుందని మూడవ ప్రశ్న వేయగా, ‘పరమాత్మ ఛాయారూపమే ప్రాణమనీ, అది ప్రాణం, సమానం, అపానం, వ్యానం, ఉదానాలనే అయిదుగా విభజించుకుని, శరీరంలో ఆయాస్థానాలలో ఉండి పనిచేస్తుందనీ’, శరీర విజ్ఞాన శాస్త్రాన్ని వివరించాడు.
శరీరంలో ఏ అవయవాలు నిద్రిస్తున్నాయి? ఏవి నిరంతరం పనిచేస్తున్నాయని, సూర్యాయనుడు నాలుగవ ప్రశ్నను వేశాడు. పిప్పలాదుడు, "జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థాత్రయాన్నీ, వాటిలోని విశేషాలనూ వివరించాడు".
అయిదవ ప్రశ్నగా సత్యకాముడు, జీవితాంతం నిశ్చలంగా, నిర్విరామంగా ప్రణవోపాసన చేస్తే, ఏ లోకాలు లభిస్తాయి? అని అడుగగా.. ‘ఓంకారం అనేది, అకార, ఉకార, మకారాల మేళవింపు. అందులో అకారం మీద మాత్రమే ద్రుష్టి ఉంచి ఉపాసన చేస్తే, సదాచార సంపన్నుల గృహంలో జన్మించి, లౌకిక సుఖాలను అనుభవిస్తారు. ఓంకారంలోని ఉకారాన్ని ఉపాసన చేస్తే, చంద్రలోకం చేరి, అక్కడ సుఖాలనుభవిస్తారు. ఓంకారాన్ని ఉపాసించిన సాధకుడు, సూర్యలోకాన్ని చేరుకుని, మోక్షాన్ని పొందుతాడని బదులిచ్చాడు.
ఇక ఆఖరుగా సుకేశుడు, పదహారు కళలతో వెలుగొందే ఆ పరమ పురుషుడు ఎవరు? అని ప్రశ్నించగా, ‘పదహారు కళలనూ వివరించి, అవి పరమాత్మ వ్యక్త స్వరూపమనీ, అశాశ్వతాలానీ, పరమాత్మ వాటన్నింటికీ అతీతుడనీ చెప్పి, పరమాత్మయొక్క అమ్రుతత్వాన్ని వివరించాడు’ పిప్పలాదుడు. అలా వారందరికీ జ్ఞానాన్ని ఉపదేశించి, గర్భోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు వంటి గ్రంధాలను అందించాడు. అయన ఆలోచనలూ, బోధనలూ, అధర్వణ వేదానికి మూలముగా పరిగణింపబడతాయి. ప్రశ్నోపనిషత్తుకు, శంకరాచార్యుల వారు భాష్య రచన చేశారు. ‘బ్రహ్మోపనిషత్తు’, యజుర్వేదాంతర్గతమై, 25 మంత్రములతో కూడి వుంది. యజ్ఞోపవీత వర్ణనతో మొదలుపెట్టి, పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపించేది, ఈ ఉపనిషత్తు. బ్రహ్మ విద్యయే వరిష్ట. అట్టి బ్రహ్మ ప్రాప్తికి ఉపాయాలన్నీ చెప్పాడు, పిప్పలాదుడు. బ్రహ్మజ్ఞానులలో అగ్రేసరుడు, యోగులలో గొప్పవాడు, మహర్షులలో ఉత్తముడు, పిప్పలాద మహర్షి.
Post a Comment