కుండలాల కోసం నాగలోకాన్ని అల్లకల్లోలం చేసిన ఉదంకుడెవరు? Story of Udanka


కుండలాల కోసం నాగలోకాన్ని అల్లకల్లోలం చేసిన ఉదంకుడెవరు?

ద్వారకకు బయలుదేరిన శ్రీ కృష్ణుడు, ఉదంకుడి ఆశ్రమంలో ఆగాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులందరూ హతమైపోయారన్న వార్త తెలుసుకుని, క్షణికావేశాకిని లోనయిన ఉదంకుడు, శ్రీ కృష్ణుడిని శపించబోయాడు. కానీ, సృష్టి ధర్మాన్నీ, శ్రీ కృష్ణుడి నిజ స్వరూపాన్నీ తెలుసుకుని, ఆయనను పరిపరివిధాలా స్తుతించి, తాను ఎప్పుడు తలచుకుంటే, అప్పుడే మేఘాలు వర్షించేలా, శ్రీ కృష్ణుడి దగ్గర వరం పొందాడు. ఈ సంఘటనలన్నింటినీ, మన గత వీడియోలో తెలుసుకున్నాము.. ఇక ఈ రోజుటి మన వీడియోలో, ఉదంకుడికి, శ్రీకృష్ణుడినే శపించగలిగేటంత శక్తి ఎలా వచ్చింది? అసలు ఉదంకుడెవరు? మహాభారతం, ఆదిపర్వంలోని ఈ ఆసక్తికర, చారిత్రక విశేషాలను తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/JG72lgzyygg ]

ఉదంకుడు గౌతముని ముఖ్య శిష్యులలో ఒకడు. విద్యాభ్యాసము పూర్తయిన తరువాత, మిగిలిన శిష్యులందరికీ గౌతముడు, ఎవరికి తగిన వరాలు వారికిచ్చి పంపాడు. కానీ ఉదంకుడికి మాత్రము, ఏ వరమూ ఇవ్వలేదు. ఉదంకుడు ఆశ్రమంలోనే ఉండి, గౌతముడికి భక్తితో శుశ్రూష చేయసాగాడు. ఒకరోజు ఉదంకుడు మిక్కిలి బరువైన కట్టెలమోపు తీసుకు వచ్చి, ఆశ్రమం వద్ద పడవేసే సమయంలో, అతడి జడ ఆ కట్టెల మోపులో చిక్కి, తెగిపోయింది. అతడి జడలోని వెంట్రుక తెల్లగా మెరిసి పోవడము చూసిన ఉదంకుడు, తనకు వయస్సు మీరి పోయిన విషయము గ్రహించి, బాధను ఓర్వలేక, ఏడవసాగాడు. అది చూసిన గౌతముడు, ఉదంకుడి కన్నీళ్ళు భూమి మీద పడకుండా పట్టమని, తన కుమార్తెను పంపాడు. తండ్రి ఆజ్ఞ మీద గౌతముడి పుత్రిక, ఆ కన్నీళ్ళను పట్టడానికి ప్రయత్నించి, అవి సలసల కాగుతుండటము వలన, వాటిని జారవిడిచింది. అది చూసిన గౌతముడు, "ఉదంకా! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. అందుకు ఉదంకుడు "గురువుగారూ! మీరు మిగిలిన శిష్యుల మీద చూపిన దయను, నా మీద చూప లేదు. వారు వెళ్ళి హాయిగా, గృహస్థులై సుఖపడుతున్నారు. నేను మాత్రము, ఇలా ముసలివాడినయ్యాను. ఇక నాకు వివాహము కాదు. అందుకే ఈ ఏడుపు" అని చెప్పాడు. అందుకు గౌతముడు, "ఉదంకా! దిగులుపడకు. నీకు మరలా యవ్వనం ప్రసాదిస్తున్నాను. అంతే కాక, నా కుమార్తెను నీకిచ్చి వివాహము చేస్తాను. నీవిక గృహస్థాశ్రమం స్వీకరించి, సంతోషాన్ననుభవించు" అని అన్నాడు.

గౌతముడు, తన కుమార్తెకు కూడా అప్పటికే వయస్సు మీరి పోయిందని గ్రహించి, ఆమెకు కూడా యవ్వనంతోపాటు నూతన శరీరాన్ని ప్రసాదించి, వారిరువురికీ వివాహము చేశాడు. వివాహానంతరం ఉదంకుడు, "గురువర్యా! మీరు నాకు యవ్వనాన్ని ప్రసాదించి, యవ్వనవతి అయిన కుమార్తెనిచ్చి వివాహము చేశారు. మీ ఋణము ఎలా తీర్చుకోగలను? మీరు నాకు ఏదో ఒక పని చెప్పండి. అది నెరవేర్చి, నా ఋణమును తీర్చుకుంటాను. అదే నా గురుదక్షిణ" అని అన్నాడు. అప్పుడు గౌతముడు, "అదేమిటి ఉదంకా! నీవు నాకు వేరే గురుదక్షిణ ఇవ్వాలా! నీ గురుభక్తీ, మంచి నడవడిక, ఇదే నీ గురుదక్షిణ" అని చెప్పి బయటకు వెళ్ళాడు. అప్పుడు ఉదంకుడు తన గురుపత్ని అహల్య వద్దకు వెళ్ళి, "అమ్మా! తమరైనా చెప్పండి. తమకు నేను ఏ విధంగా గురుదక్షిణ సమర్పించుకోవాలో.." అని అడిగాడు. అందుకు అహల్య, "మీ గురువుగారి మాటే కదా నా మాట. అయినా నువ్వు అడిగావు కనుక, నేను చెప్తున్నాను. నీవు మిత్త్రసహుడనే వాని వద్దకు వెళ్ళి, అతడి భార్య వద్ద ఉన్న కుండలములు తెచ్చి, నాకు ఇవ్వు" అని చెప్పింది. ఉదంకుడు కుండలములు తెచ్చే పని మీద వెళ్ళాడు.

కొంతసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చిన గౌతముడికి ఉదంకుడు కనిపించక పోయేసరికి, భార్యను అడిగాడు. ఉదంకుడిని కుండలములకు పంపిన విషయము చెప్పింది, అహల్య. అప్పుడు గౌతముడు, "మిత్త్రసహుడు రాక్షసుడిగా మారాడు. అతడు శాపవశాన, మనుష మాంసము తింటూన్నాడు. ఈ విషయము ఉదంకుడికి తెలియదు కనుక, ఏమి జరుగనున్నదో" అని గౌతముడు కలవర పడ్డాడు. ఆ మాటలకు అహల్య కలవర పడి, నాకు ఈ విషయం తెలియక, ఉదంకుడిని పంపాను. తనకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడమని, గౌతముడిని వేడుకుంది. ఉదంకుడు ఒక అడవిలో మిత్త్రసహుడిని కలుసుకున్నాడు. ఆ సమయంలో మిత్త్రసహుడు, ఎర్రటి కళ్ళతో, రక్తసిక్త శరీరముతో, భయంకరముగా ఉన్నాడు. అయినా, ఉదంకుడు మిత్త్రసహుడిని చూసి భయపడలేదు. ధైర్యంగా తన ముందు నిలబడిన ఉదంకుడిని చూసిన మిత్త్రసహుడు, "ఎవరు నువ్వు, ఎక్కడకు వెళుతున్నావు? ఈ రోజు ఆహారము దొరకక అవస్థ పడుతున్నాను. సరైన సమయంలో వచ్చిన నిన్ను, ఇక చంపి తినక వదలను" అని అన్నాడు. అందుకు ఉదంకుడు, "రాజా! నేను మాగురువు గారి పనిమీద వెళుతున్నాను. గురుకార్యము మీద వెళ్ళే నన్ను చంపుట మహా పాపము. ఇంతటి అధర్మకార్యానికి ఒడిగడతావా?" అని అడిగాడు. అప్పుడు మిత్త్రసహుడు, "బ్రాహ్మణా! నన్ను దినములో మూడవ ఝామున, మనుష్య మాంసము తినమని, దేవతలు ఆదేశించారు. కనుక నిన్ను తిని, నా ఆకలిని తీర్చుకుంటాను" అని అన్నాడు. అందుకు సరేనన్న ఉదంకుడు, "ముందు నా గురువుగారి కార్యము నెరవేర్చి, తరువాత నీ ఆకలి తీర్చగలను. నన్ను నమ్ము. నేనిది నా కొరకు కోరడము లేదు. నా గురుపత్ని కొరకు అడుగుతున్నాను. కనుక నా కోరిక తప్పక తీరుస్తావని నమ్ముతున్నాను" అని అన్నాడు ఉదంకుడు.

ఆ మాటలకు మిత్త్రసహుడు, "నీ కోరిక ఏమిటి?" అని అడిగగా ఉదంకుడు, "మహాత్మా! నా గురుపత్ని తమరి భార్య కుండలములు కావాలని అడిగింది. అవి మీరు ఇప్పిస్తే, నేను వాటిని గురుపత్నికి సమర్పించి, తిరిగి వచ్చి మీకు ఆహారము కాగలను" అని అన్నాడు. అందుకు మిత్త్రసహుడు, "ఆ కుండలములు నావి కాదు కదా! పరుల సొమ్ము నేను ఎలా ఇవ్వగలను" అని అన్నాడు. అందుకు ఉదంకుడు, "నేను మీ భార్య కుండలములు కోరుతున్నాను. అది పరుల సొమ్ము ఎలా అవుతుంది" అని అడిగాడు. ఆ మాటలకు మిత్త్రసహుడు, "అయితే నువ్వు నా భార్య వద్దకు వెళ్ళి, నేను చెప్పానని చెప్పి, కుండలములు తీసుకో" అని ఆమె నివాసం చూపించాడు. ఆ విధంగానే ఉదంకుడు, మిత్త్రసహుడి భార్య మదయంతి దగ్గరకు వెళ్ళి, "మా గురుపత్ని అహల్య మీ కుండలములు అడిగి తెమ్మని నన్ను పంపింది. మీరు కుండలములు ఇస్తే, నేను వెళతాను" అని అన్నాడు. అందుకు మిత్త్రసహుడి భార్య, "నువ్వు ఉదంకుడివనీ, నా భర్త మిత్త్రసహుడు నిన్ను పంపాడనీ, నన్నెలా నమ్మమంటావు?" అని అడిగింది. దాంతో ఉదంకుడు తిరిగి మిత్త్రసహుడి దగ్గరకు వెళ్ళి, "నీ భార్య నన్ను గుర్తు తీసుకురమ్మని అడిగింది. కనుక నాకు ఏదైనా గుర్తు ఇచ్చి పంపు" అని అన్నాడు. అప్పుడు మిత్త్రసహుడు, "నేను చెప్పే మాటలు జాగ్రత్తగా నా భార్యతో చెపితే, తను నీకు కుండలములు ఇస్తుంది. అని చెప్పి పంపాడు.

ఆ విధంగా, మిత్త్రసహుడు చెప్పిన మాటలను మదయంతికి చెప్పగా, సంతోషంతో తన కుండలాలను ఉదంకుడికి అప్పగించింది. "కుమారా! ఈ కుండలముల కొరకు దేవతలూ, గంధర్వులూ, నాగులూ పొంచి ఉన్నారు. వారు ఈ కుండలములు పొందడానికి, అనేక ఉపాయములు పన్నుతుంటారు. కనుక నీవు జాగ్రత్త వహించాలి. ఈ కుండలములను నీవు నేల మీద పెట్టినా, వీటికి ఎంగిలి సోకినా, దీని శక్తి క్షీణిస్తుంది. నీవు ఈ కుండలములను భక్తితో సేవించి పూజించినట్లయితే, నీకు ఆకలిదప్పులు ఉండవు. నీకు అగ్నివలనగానీ, విషమువలనగానీ, భూత ప్రేత పిశాచములవలనగానీ, భయము ఉండదు. ఈ కుండలములు, పిల్లలకయినా, పెద్దలకయినా, ఎవరికైనా కచ్చితంగా సరిపోతాయి. ఈ కుండలములు బంగారమును కురిపిస్తాయి. అందువలన, వీటిని అత్యంత అప్రమత్తతతో తీసుకు వెళ్ళి, నీ గురుపత్నికి సమర్పించు" అని మదయంతి తగు జాగ్రత్తలు చెప్పి, ఉదంకుడిని ఆశీర్వదించి పంపింది.

మిత్త్రసహుడి భార్య మదయంతి వద్ద కుండలములు తీసుకున్న ఉదంకుడు మిత్త్రసహుడి వద్దకు వచ్చి, తన గుర్తుగా ఇంతకు ముందు మదయంతితో చెప్పమన్న మాటలకు అర్థం మేమిటని ప్రశ్నించాడు. అందుకు మిత్త్రసహుడు, "బ్రాహ్మణ కుమారా! లోకములో క్షత్రియులు బ్రాహ్మణులను పూజిస్తారు. నేను కూడా బ్రాహ్మణులను పూజిస్తాను. నేను బ్రాహ్మణుల పట్ల చేసిన చిన్న అపరాధము, నన్నిలా మానవ మాంస భక్షకుడిగా చేసింది. నేను చేసిన పాపమునకు పరిహారము, బ్రాహ్మణ పూజ ఒక్కటే మార్గము. అది అంతగా పని చేస్తుందని తెలియకున్నా, అంతకంటే వేరు మార్గము లేదు. ఇదే నేను చెప్పిన మాటలకు అర్ధము. బ్రాహ్మణుడవైన నీ కోరికను మన్నించి, నీకు కుండలములను ఇవ్వమని చెప్పాను. అందువలన నా పాపమును కరిగించాలని అనుకున్నాను" అని చెప్పాడు. ఆ విధంగానే, ఊదంకుడి దర్శనము వలన, మిత్త్రసహుడికి పూర్వజన్మ జ్ఞానం, దానము చెయ్యాలన్న బుద్ధీ, వినయమూ కలిగాయి. ఉదంకుడి తపోమహిమ వలన, మిత్త్రసహుడు, దుఃఖ విముక్తుడయ్యాడు. ఉదంకుడు మిత్త్రసహుడిని ఆశీర్వదించి, "రాజా! మంచి మనస్సు కల వారికి, పొరపాటున ఆపద కలిగినా, అవి వెంటనే తొలగిపోతాయి. నీ సుగుణములే, నీ పాపములను పోగొడతాయి. నా గురువు కృప, నీ మీద ప్రసరించింది. ఇక నీకు శుభము జరుగుతుంది" అని చెప్పి, గురుపత్ని వద్దకు తిరుగు ప్రయాణమయ్యాడు.

ఉదంకుడు కుండలములను తీసుకువెళుతుండగా, మార్గ మధ్యంలో ఆకలి వేసింది. కుండలములను జింక చర్మముతో చేసిన సంచిలో పెట్టి, చెట్టు కొమ్మకు తగిలించి, తను చెట్టెక్కి పండ్లు కోసుకుని తింటుండగా, అకస్మాత్తుగా వీచిన గాలికి చెట్టు ఊగడంతో, కొమ్మకు తగిలించిన సంచి కింద పడింది. అక్కడ పొంచి ఉన్న ఒక నాగు పాము, ఆ సంచిని నోటకరచుకుని, వేగంగా పోయి ఒక పుట్టలోకి దూరింది. వెంటనే ఉదంకుడు ఒక కర్రను తీసుకుని, ఆ పుట్టను తవ్వసాగాడు. ఆ తవ్వకానికి భూమి కంపించింది.

ఇంతలో దేవేంద్రుడక్కడకు వచ్చి, "బ్రాహ్మణోత్తమా! అంత చిన్నకర్రతో తవ్వి, పాతాళమును చేరడము సాధ్యమా? ఇక్కడి నుండి పాతాళమునకు వెయ్యి యోజనముల దూరము ఉంది. నీ కుండలములు తస్కరించిన నాగుపాము ఎవరో కాదు. అతడు నాగరాజు అయిన ఇరావంతుడి కుమారుడు." అని చెప్పగా ఉదంకుడు, "దేవా! అతడు పాతాళానికి వెళ్ళినా, నేను అతడిని వెంబడించి వెళ్ళి, కుండలములను తీసుకు వస్తాను" అని అన్నాడు. దేవేంద్రుడికి ఉదంకుడి పట్టుదల నచ్చింది. అందువలన ఉదంకుడి చేతిలోని కొయ్యకు, వజ్రాయుధానికున్న శక్తిని ప్రసాదించాడు. ఉదంకుడు ఆ కర్రతో ఒక్క పోటుపొడవగానే, పాతాళానికి దారి ఏర్పడింది. ఆ దారిగుండా ఉదంకుడు, పాతాళంలో ఉన్న నాగలోకానికి వెళ్ళాడు. పటిష్ఠమైన కోటగోడలూ, ద్వారములూ, అగడ్తలూ ఉన్న నాగలోకాన్ని చూడగానే, ఉదంకుడికి తాను కుండలములు పొందడము అంత సులువైన పనికాదని తెలిసింది. ఇంతలో అతడి ఎదుట అరుణవర్ణములు కలిగిన ఒక గుర్రము కనిపించింది.

నలుపురంగు దేహము, శ్వేతవర్ణ తోక కలిగిన ఆ గుర్రము ఉదంకుడితో "ఉదంకా! నీవెవరో నాకు తెలుసు. నేను, నీవు రోజూ ఆశ్రమంలో పూజించే అగ్నిహోత్రుడిని. కుండలములు ఎక్కడ ఉన్నాయో నీకు చెప్తాను. నీవు నా చెవిలో ఊదు" అని అన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదగానే, ఆ గుర్రము శరీరము నుండి వచ్చిన పొగలు, నాగలోకమంతా వ్యాపించాయి. వాయు భక్షకులైన నాగులకు, ఆ పొగ వలన ఊపిరి ఆడలేదు. నాగులంతా విలవిలా కొట్టుకోసాగారు. కుండలములు దొంగిలించిన ఇరావంతుడి కుమారుడు కూడా, గిలగిలా కొట్టుకోసాగాడు. వేరే మార్గము లేక, నాగరాజు కుండలములు తీసుకు వచ్చి, ఉదంకుడికి ఇచ్చి, శరణు వేడారు. ఉదంకుడు వారిని క్షమించి, వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళి, గురుపత్నికి కుండలములు అందజేశాడు. అప్పుడు గౌతముడు ఉదంకుడిని చూసి, "ఉదంకా! రాక్షస ప్రవృత్తి కలిగిన మిత్త్రసహుడిని ప్రసన్నము చేసుకుని, కుండలములు సంపాదించడమూ, అగ్నిదేవుని ప్రసన్నము చేసుకుని, కుండలములను నాగరాజు నుండి సంపాదించడమూ, నీవే చేయగలవు. ఇది వేరొకరు చేయలేరు" అని శిష్యుడిని పొగిడి, అనేక విద్యలనూ, వరాలనూ ప్రసాదించాడు. గౌతమ మహర్షి శిష్యునిగా, ఉదంకుడు ముల్లోకాలలో ఖ్యాతి గడించాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes