3500 ఏళ్ల నాటి భారతీయుడు ‘సుశ్రుతుడు’ ఎవరు? Sushruta: Father of Plastic Surgery


3500 ఏళ్ల నాటి భారతీయుడు ‘సుశ్రుతుడు’ ఎవరు?

మన భారతదేశ చరిత్ర, ఎంతో ప్రాచీనమైనదీ, ప్రభావవంతమైనది. ప్రపంచదేశాలు నాగరికత అనే మాటకు ఆమడ దూరంలో ఉన్న సమయంలోనే, మన దేశం అత్యున్నత సంస్కృతితో, ఎన్నో విషయాలలో ముందంజలో ఉంది. భారతదేశంలో వైద్యం అంటే, నాటువైద్యం, మూలికల వైద్యం అనే హేళన భావం, పాశ్చాత్తులతో పాటు, మన స్వదేశీయులలో కూడా పేరుకుపోయింది. కానీ, గడచిన తరానికి తెలియని చరిత్ర, నేడు సాక్షాలతో సహా మన ముందుకు వచ్చి, మనల్ని సగర్వంగా ప్రపంచదేశాలలో నిలబెట్టింది. శస్త్ర చికిత్స అంటే, ఇంగ్లీషు వైద్యం అని భ్రమపడే మనకు, సామాన్య శక పూర్వమే ఎన్నో శస్త్ర చికిత్సలను చేసి, వాటికి సంబంధించి ఎన్నో గ్రంథాలను రచించి, అపర ధన్వంతరిగా పేరుగడించిన మహానీయుడు ‘సుశ్రుతుడు’. ఈ రోజుటి మన వీడియోలో, పాశ్చ్యాత్తులు సైతం శస్త్రవైద్య శిఖామణిగా కీర్తించిన సుశ్రుతుడి గురించీ, ఆయన వైద్య శాస్త్రంలో గడించిన ఘన కీర్తిని గురించీ, మనం మరచినా, విదేశీయులు మరువని ఆయన గొప్పదనం గురించీ, తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nPnhEq_aL9Y ]

శరీరే జర్ఝరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ।
ఔషథం జాహ్నవీ తోయం వైద్యోనారాయణోహరిః ।।

కృశించిపోయే లక్షణం గల వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగాజలమైతే, నారాయణుడే వైద్యుడు. శరీరం ధరించిన జీవుడు తనలోని జన్మాంతర పాప పంకిలాన్ని శుద్ధి చేసుకోవడం, ముఖ్య కర్తవ్యం. అందుకు పవిత్ర గంగాజల స్నానం, శ్రీహరి నామస్మరణ అనే ఈ రెండే సాధనాలు.

ఓం ధన్వంతరయే ఔషధచక్ర నారాయణాయ నమః ।।

ఆయుర్వేదానికి చెందిన శస్త్ర చికిత్సకుడిగా, అధ్యాపకుడిగా, అపర ధన్వంతరిగా పేరుగడించిన సుశ్రుతుడు, సామాన్య శక పూర్వం 6వ శతాబ్దంలో, వారణాసిలో జన్మించాడని కొన్ని గ్రంథాలు చెబుతుంటే,  9-10 వ శతాబ్దాలలో జీవించాడని, మరికొన్ని ఆధారాలు తెలియజేస్తున్నాయి. సుశ్రుతుడి జీవిత కాలంపై, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర భారత దేశంలోని, గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణంలో జన్మించిన సుశ్రుతుడు, విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. ఆయన వద్ద నుండే, వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.

సుశ్రుతుడు ప్రకృతి ఆరాధకుడు. జంతు, వృక్ష ప్రపంచాల మీద సుదీర్ఘమైన దృష్టి సారించి, అనేక అమూల్య అంశాలను వెలువరించాడు. సంవత్సరంలోని భిన్న ఋతువులలో, ఆయా వాతావరణాలకు అనుగుణంగా నడుచుకుని, వ్యాధిరహితంగా, ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించాడు. ఏఏ కాలాలలో ఏ కూరగాయలూ, పండ్లూ తినాలో కూడా వివరించాడు. తృణధాన్యాలూ, పప్పుదినుసుల వాడకం గూరించి సోదాహరణంగా, పలు ఆసక్తికర అంశాలను తెలిపాడు. సుశ్రుతుడు తన గ్రంథ రచన ప్రారంభించక పూర్వమే, ప్రకృతితో అనుసంధానమై, వివిధ ప్రయోగాలు చేశాడు. ఏ ఏ మొక్క మానవునికి ఎన్నివిధాలుగా ఉపయోగపడుతుందో, కూలంకషంగా అధ్యయనం చేశాడు. అంతేకాదు, ఆయన పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే, తన శిష్యులకు బోధించేవాడు. ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి చేయించేవాడు. శస్త్ర చికిత్సకు ప్రాధాన్యతనిస్తూనే, వైద్య చికిత్సలో వాడే మూలికలనూ, క్షార పదార్థాలనూ, లోహాలను కూడా వర్గీకరించి, వివరించేవాడు. దాదాపు 14 రకాల బ్యాండేజీలను, ఆయా గాయాల తీవ్రత, స్థాయిలను బట్టి, వాటిని తయారుచేసే విధానాన్ని కూడా, తన గ్రంథంలో వివరించాడు.

"శుశృత సంహిత" అనే ఆయుర్వేద గ్రంథం, ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని శుశృతుడు సంస్కృతంలో రచించాడు. ఈ "శుశృత సంహిత" లో మొత్తం, 184 అధ్యాయాలున్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు, 1120 గా నిరూపింపబడింది. అలాగే, మానవ శరీర నిర్మాణం తీరుతెన్నుల గురించీ, ప్రతి అవయవ నిర్మాణం గురించీ, విపులంగా చెప్పబడింది. 700 పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలూ, ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి, రోగాన్ని ఎలా తగ్గిస్తుందో, ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేసుకోవాలో, అందులో విపులీకరించబడింది. అంతేకాక, జంతు సంబంధమైన అవయవాల నుండి, 57 ఔషధాలను తయారుచేసే వైద్య విజ్ఞానం ఉంది. ఈ సుశ్రుత సంహితలో, సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం పొందుపరచబడి ఉంది.

ఈ గ్రంథంలో ప్రధానంగా, రెండు భాగాలున్నాయి. మొదటిది పూర్వ తంత్రం కాగా, రెండవది ఉత్తర తంత్రం. ఈ గ్రంథంలో, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన "అష్టాంగ హృదయం" కూడా వివరింపబడింది. అంతేకాక, ఈ గ్రంథంలో, 101 శస్త్ర పరికరాల గురించి కూడా, సుశ్రుతుడు వివరించాడు. ఈ గ్రంథం, అరబిక్ లోనే కాక, లాటిన్, తదితర విదేశీ భాషలలోకి కూడా అనువాదమైంది. వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని, మూడు రకాలుగా విభజించి, వ్యాధికి పూర్వం, వ్యాధి గ్రస్తుడు అయినప్పుడూ, వ్యాధి నయం అయిన తర్వాత, రోగి శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలనీ, ముఖ్యంగా ఆయా రోగులూ, శరీరతత్వాలనూ తెలుసుకుని, వారి శారీరక, మానసిక బలాలనూ, ఓర్పునూ పరిశీలించి, వైద్యం చేయాలని సూచించాడు. గర్భ నిరోధంతో పాటు, గర్భ ధారణకు కూడా అనువైన ఔషధాలనూ, యవ్వనోత్సాహానికి తగిన మందులనూ, తన ‘ములికా వైద్య ప్రకరణం’లో పేర్కొన్నాడు. సుఖప్రసవం కోసం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో, సిజేరియన్ ఆపరేషన్ లను కూడా చేసిన మొట్టమొదటి వైద్యుడు, సుశ్రుతుడు.

విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో, విశేష కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి, మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని యివ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో, తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించటంలో, అందెవేసిన చేయి సుశ్రుతుడిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, శస్త్రచికిత్సకోసం 120 రకాల వైద్య పరికరాలను సుశ్రుతుడు ఉపయోగించేవాడు. ఈయన ఎన్నో వేల సంవత్సరాల క్రితం రూపొందించిన "సందంశ యంత్రాలు", నేడు మన ఆధునిక శస్త్రవైద్యులు ఉపయోగించే spring forceps, dissection and dressing forceps లకు తొలి నమూనాలుగా చెప్పవచ్చు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి, అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా, ఈ గ్రంథ రచన చేశాడు. ఈ రోజున కూడా, వైద్య సమాచారం నిమిత్తం, ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుతుందనడంలో, ఎటువంటి సందేహం లేదు.
సుశ్రుతుడి వైద్యానికి సంబంధించిన ఒక కథ, ఆయన వైద్య విజ్ఞానానికి మచ్చుతునక. అత్యవసరమైన పనిమీద ఒక వ్యక్తి అడవిలో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో, అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి, అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా, తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకుని, సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకుని, తలుపు తట్టాడు. అది సుశ్రుతుడి ఆశ్రమం.

అర్థరాత్రివేళ సుశ్రుతుడు నిద్రనుంచి మేల్కొని తలుపు తీసి చూస్తే, ఆ యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై, రొదిస్తూ కనిపించాడు. అతడి ముక్కు తెగి వుండడాన్ని సుశ్రుతుడు గమనించాడు. ముందుగా అతడికి ధైర్యం చెప్పి, లోపలికి తీసుకు వెళ్ళి, వైద్యం మొదలుపెట్టాడు. నీటితో అతడి గాయాన్ని కడిగి, మూలికా రసం అద్దాడు.  ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. అందుకే అతనికి మత్తునిచ్చే నిమిత్తం, ఒక చిన్న గిన్నెడు సుర అంటే, మద్యాన్నిచ్చాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పో యిన తరువాత, అతి సూక్ష్మమైన కత్తులూ, సూదులతో చికిత్సను ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కును కొలిచి, అతి చిన్నదైన, పదునైన కత్తిని వేడిచేసి, దవడ భాగం నుంచి కొంత మాంసభాగాన్ని తీసుకున్నాడు. దానిని రెండు ముక్కలుగా చేసి, బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటలలో అమర్చాడు. అలా ముక్కు ఆకారాన్ని సరిచేసి, బియ్యపు పిండిని అద్ది, చందనపు పట్టు వేశాడు. దానిమీద బూరుగు దూదిని పెట్టి, ఔషధ నూనెను పోసి, చక్కగా కట్టు కట్టాడు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. రెండు రోజుల్లోనే, అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార, విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏయే మందులు సేవించాలో, తగు జాగ్రత్తలను తెలియజేసి పంపించాడు.

ఆనాటి కాలంలోనే, ప్లాస్టిక్ సర్జరీలూ, సిజేరియన్ లూ, ఎటువంటి శస్త్ర చికిత్సనైనా సునాయాసంగా చేయడమే కాక, ఆ వైద్యాన్ని తరువాత తరాలకు కూడా గ్రంథం రూపంలో అందించిన మహానీయుడు, సుశ్రుతుడు. ఆయన రచించిన గ్రంథాలు కొన్ని ఆ కాలంలోనే, టిబెట్ ప్రాంతానికి తరలివెళ్ళాయి. ఆయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారనీ, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాల చిత్రపటములే కాక, ఆయా పరికరాలలో కొన్ని, పురావస్తు పరిశోధకులకు లభించాయి. సామాన్య శక పూర్వం 8 వ శతాబ్దానికి చెందిన ఆయన గ్రంథం, "అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్రం", ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ, ఆ గ్రంథ అనువాదం, టిబెట్ లో "గుష్టి" అంటే, ‘నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు’ అనే పేరుతో లభిస్తున్నాయి. సుశ్రుతుడూ, చరకుడూ సృజించిన వైద్య విధానాలు, సామాన్య శక పూర్వ కాలంలోనే, అగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని, రూఢి అయింది.

ఇటీవలి కాలంలో కూడా, నూతన మిలీనియం సందర్భంగా, 2000వ సంవత్సరంలో, బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ, ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో సహా, వారి వివరాలను పొందుపరిచారు. ఆ జాబితాలో తొలి చిత్రం, ఆచార్య శుశృతునిది కావడం, గమనార్హం. అంతేకాకుండా, ఆయనను ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం కూడా, గమనార్హం. అంతటి మహనీయుడిని మనం మరచిపోవడం, తగిన గుర్తింపునివ్వకపోవడం, మన చరిత్రకు మాయని మచ్చ మాత్రమే కాదు.. మన భారత దేశానికీ, మనకూ సిగ్గుచేటు కూడా. మన పూర్వీకుల అత్యున్నత మేధోశక్తినీ, వారి విజ్ఞానాన్నీ సగర్వంగా చాటి చెబుదాం.. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం..

జై హింద్..

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes