Must Know Science Behind the Cosmic Dance of Lord Shiva!

 



తప్పక తెలుసుకోవలసిన రుద్ర తాండవ ఆంతర్యం! MPL
  Must Know Science Behind the Cosmic Dance of Lord Shiva!
శివుడు తాండవంచేసే స్థలాన్ని రత్నసభ అంటారు. ఆ రత్నసభకి శివుడే అధిపతి కాబట్టి, ఆయనను రత్నసభాపతి అంటారు. ఈ నిత్య శివతాండవానికి, బ్రహ్మ తాళములు, సరస్వతి వీణా, విష్ణువు మృదంగమూ, సూర్యచంద్రులు వేణువులూ, నారద తుంబరులు గానం, ఇతర ప్రమాధగణాలు భేరీ మృదంగ తాహళకళాదులచే, వాద్యసహకారం అందిస్తారు.

శివతాండవ లక్షణాలు ఏడు... 
1. ఆనంద తాండవం
2. సంధ్యా తాండవం
3. ఉమా తాండవం
4. గౌరీ తాండవం
5. కాళికా తాండవం
6. త్రిపుర తాండవం
7. సంహార తాండవం… 

ఇందులో ఉమా తాండవం, గౌరీ తాండవం చేసేటప్పుడు, నటరాజుయొక్క పాదములక్రింద రాక్షసుడుండడు. మిగిలిన 5 తాండవాల్లోనూ శివుని కుడి పాదం క్రింద అసమంజసుడనే రాక్షసుడుంటాడు. ఎత్తిన ఎడమపాదానికి, ఓషధులతోకూడిన మాలధరించి వుంటాడు. ఆ మాలని కుంచితపాదం అంటారు.

శివుడి శేరీరంపైన, మెడలో, భుజాలకూ, ముంజేతులకూ, కటిప్రదేశంలో, పాదద్వయానికీ, శిరస్సునా, వెరసి 9 సర్పాలుంటాయి. ఇవన్నీకూడా, కుండలినీ శక్తికి సంకేతాలైతే

వీటిపేర్లు వరుసక్రమంలో... 
1. అనంతుడు
2. వాసుకీ
3. శేషుడు
4. పద్మనాభుడు
5. కంబళుడు
6. శంఖపాలుడు
7. ధృతరాష్ట్రుడు
8. తక్షకుడు
9. కాళుడు.

ఈ సమస్త చరాచర జగత్తు యావత్తూ, పంచభూతాలూ, సకల జీవరాశీ, చతుర్దశ భువనాలూ,  గ్రహ, నక్షత్రమండలాలన్నీ కూడా వాస్తవానికి అచేతనావస్థలోనే వుంటాయి. ఇవన్నీకూడా శివతాండవంచేత చేతనత్వంకలిగి, కదలికలకు లోనవ్వడానికి కారణహేతువే, శివతాండవంయొక్క ఆంతర్యం.

కాస్మిక్ డాన్స్అని పాశ్చాత్యులు పిలిచే శివుని రుద్రతాండవం గతిశీలక, స్థిరమైన శక్తి ప్రవాహమే. అందులో అయిదు శాశ్వత శక్తులు, అంటే, సృష్టి, స్థితి, లయం, మాయ, విముక్తి ఉంటాయి. శివుడు చేసే రుద్రతాండవం, లయానికి సంబంధించింది. అందులో అగ్ని కీలలూ మెరుపులూ ఉరుములతో, విశ్వమంతా వ్యాపించి, సూర్యునీ చంద్రునీ గ్రహగోళాలను కూడా చెదరగొట్టి, వ్రేలాడే  శిరోజాలతో, నుదుట విభూతితో, త్రిశూలం, మద్దెలతో, ఎడమకాలు పైకెత్తి, అజ్ఞాన రాక్షసునిపై, సమతౌల్యంతో నిలబడి, చేతుల, కాళ్ళపై సర్పాలాడుతూ, అల్లినట్లున్న జటాజూటం అహంకారానికి ప్రతీకగా, శివుడు తాండవ నృత్యం చేస్తాడు. కుడి చేతిపైభాగంలో ఢమరుకం స్త్రీపురుష కీలక సూత్రానికి భాష్యంగా, క్రిందిభాగం అభయ ప్రదానంగా ఉంటుంది. చేతిలోని, లేక శిరసుపై కపాలం, మృత్యువుపై విజయానికి సంకేతం. జటాజూటంలోని గంగ, పవిత్ర జలానికి సంకేతం. శివుని త్రినేత్రం, నిత్యజాగృతికీ విజ్ఞానానికీ సంకేతం. అంతమాత్రమేకాదు, అదుపుతప్పి, ప్రకృతి విలయానికి పాల్పడే వారిని దహించే అగ్నికూడా.

శివతాండవంలో, ఉధృతస్థితి గురించి పైన తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్యం అనే సున్నితమైన నాట్యం గురించి తెలుసుకొందాం. దీనినే, ఆనంద తాండవం, అంటారు. తాండవంలో, సర్వం లయం చెందగానే, లాస్యం, లేక ఆనంద తాండవంలో, సృష్టి జరుగుతుంది. ఈ రెండు రూపాల శివ తాండవం, మనకు  చిదంబరం, నటరాజ దేవాలయంలో కనిపిస్తుంది. చిత్ అనేది అంబరంగా, అంటే, ఆకాశంగా ఉన్నదే చిదంబరం. అంటే, మనస్సూ, లేక బుద్ధీ, ఆకాశంగా కలదన్నమాట. అనగా, ఇది హృదయం లోని చైతన్య కేంద్రానికి ప్రతీక.

శివుడూ లేక బ్రహ్మం, విశ్వ చైతన్యానికి ప్రతీక. శివుని శరీరమంతా ప్రాకుతూ ఉండే సర్పాలు, మానవ శరీరం లోని నాడీ సముదాయాలే. కుండలినీశక్తి కేంద్రాలే, ప్రతిమానవునిలో ఉండేవే. ఈ కుండలినిని మేలుకొల్పటం అంటే, ఏడు శక్తిచక్రాలను ఉద్దీపనం చేయటమే. సాత్విక, రాజస, తామస గుణాలు, ఒకదానితో ఒకటి కలసి, ఈ విశ్వంలో ప్రాణి రూపాలను సృష్టిస్తాయని, భగవద్గీతలో చెప్పబడింది.

దైవీతత్త్వం, తొమ్మిదిభాగాలుగా విభజింపబడుతుంది. కానీ, అందులో ఎనిమిది, అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, బుద్ధి, అహంకారాలను మాత్రమే  మనం అవగతం చేసుకోగలుగుతున్నాం. తొమ్మిదో దైవీశక్తి మాత్రం, సృష్టి వైచిత్రంలో శాశ్వతంగా కప్పి వేయబడింది.

1972లో Fritjof Capra అనే రచయిత, తన ‘The Tao of Physics’ పుస్తకం లో, వేదవిజ్ఞానాన్నీ, ఆధునిక శాస్త్రాన్ని, తులనాత్మకంగా పరిశీలించి, భారతదేశంలో చెప్పబడిన శాస్త్రీయ విజ్ఞానం అంతా, ప్రతీకాత్మకమైనదన్నాడు. ’’ప్రతి ఉపపరమాణువు అంటే, సబ్ అటామిక్ పార్టికల్ శక్తి, నాట్యం చేస్తుంది. తానే శక్తి నాట్యమౌతు౦దికూడా. సృష్టి కార్యంలో ఇది సృష్టి లయల స్థిర, నిరంతర, శాశ్వత  ప్రవాహ విధానం. కనుక, ఆధునిక, భౌతిక శాస్త్ర వేత్తలకు, శివ తాండవం, ఉపపరమాణువు నాట్యమే.

2004లో, జెనీవాలో జరిగిన ’యూరోపియన్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్‘ లో, రెండు మీటర్ల నటరాజ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాండవ నాట్యం చేసే ఈ శివుని విగ్రహం, సృష్టి, లయల వలయానికి ప్రతీక గానేకాక, సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క గతిశక్తికి సంకేతంఅనీ, ఇదే విశ్వసృష్టికి  ఆధారమని, ప్రపంచ శాస్త్రవేత్తలందరూ భావిస్తున్నారు. జై నటరాజ, జైజై నటరాజ. దీనికి ఆధారం రచయిత కే.పి. శశిధరన్ వ్యాసం ‘విస్పరింగ్ మైండ్‘.

కొసమెరుపు...

ప్రతిరోజూ జరిగే సంధ్యాతాండవానికి ముందు కొద్ది క్షణాలకాలం, సాంగ, సకుటుంబ, సపరివార, సశక్తీ, వాహన సమేతంగా, శ్రీశైలక్షేత్రంలో ఆ పరమేశ్వరుడు పాదంమోపుతాడు. శ్రీశైలక్షేత్రదర్శనార్ధం వెళ్ళే  భక్తులేవరైనాసరే, ఆ పరమేశ్వరుడి కృపాకటాక్ష వీక్షణాలు తమపై ప్రసరించాలనుకుంటే, విధిగా, సంధ్యాసమయంలో, శ్రీశైల ఆలయ ప్రాంగణంలో ఉండితీరాలి.

శుభం భూయాత్...

పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ శ్రీవిద్యాగణేశానంద భారతీ స్వామీజీ చెప్పిన అద్భుత విషయాలు...

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes