త్రిలోక సౌందర్యరాశికి తగిన వరుడెవరు? విక్రమార్క బేతాళ కథలు!


త్రిలోక సౌందర్యరాశికి తగిన వరుడెవరు? విక్రమార్క బేతాళ కథలు!

విక్రమార్క బేతాళ కథలలో, రాజు కోసం తన కుటుంబాన్ని బలిచ్చిన వీరవరుడూ, తనకు దీర్ఘాయువు ప్రసాదించడం కోసం విగత జీవులైన వీరవరుడి కుటుంబాన్ని చూసి హృదయం ద్రవించి, వారి కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన గొప్ప మహారాజు రూపసేనుడి కథ, గత భాగంలో తెలుసుకున్నాం. ఇక బేతాళుడు చెప్పిన రెండవ కథ, ‘త్రిలోక సుందరి కథ’. ఈ కథ, బేతాళుడు వేసిన చిక్కు ప్రశ్న, దానికి విక్రమాదిత్యుడు చెప్పిన సమాధానం ఏంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/JGh9yzbBaG4 ​]

చంపాపురిని పాలిస్తున్న చంపకేశ మహారాజు, అతి బలవంతుడూ, ధనుర్విద్యాపారంగతుడూ. ఆ మహారాజుకి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు త్రిలోక సుందరి. పేరుకు తగినట్లుగానే, ఆమె అతిలోక సౌందర్య రాశి. చంద్రబింబంలాంటి మోము, లేడి లాంటి కళ్ళు, కొకిలలాంటి కంఠంతో, ఆమె అందం వర్ణణాతీతం. సకల శుభలక్షణాలతో పెరిగిన త్రిలోక సుందరి, యుక్త వయస్సుకు వచ్చింది. చంపకేశ మహారాజు, యువరాణికి వివాహం చేయదలచి, తగిన వరుడి కోసం, అన్ని రాజ్యాలలో స్వయంవరం చాటింపు వేయించాడు. జగదేక సౌందర్యవతి అయిన ఆమెను వివాహం చేసుకోవడానికి, భూలోకంలో ఉన్న యువరాజులు మాత్రమేగాక, స్వర్గం లోకం నుండికూడా, అనేక మంది దేవతలు దిగి వచ్చారు. అయితే, వారందరినీ పరిశీలించి, నలుగురు యువకుల్ని ఎంపిక చేశాడు, చంపకేశ మహారాజు. వారందరూ సమానమైన అర్హతలు కలిగిన వారే. వారి వారి అర్హతలను వినయంగా, రాజుకు విన్నవించుకున్నారు.

వారిలో మొదటివాడైన ఇంద్రకేతుడు, ‘మహారాజా నాపేరు ఇంద్రకేతుడు. నేను సకల వేదాలనీ, వేదార్థాలనీ అధ్యయనం చేశాను. వేదాలే కాదు, శాస్త్రాలనూ, సకల విద్యలనూ అవపోశన పట్టాను. కనుక మీ కుమార్తెకు తగిన వరుణ్ని’, అని అన్నాడు.

రెండవవాడైన ధనపాలుడు, ‘మహారాజా నా పేరు ధనపాలుడు. నేను అధిక ధనధాన్యాలతో తుల తూగుతున్నాను. నాకు అన్ని జీవుల భాషలూ తెలుసు. అంతేకాదు, నేను సకల సద్గుణాలూ కలిగిన వాణ్ణీ, పైగా రూపవంతుణ్ణి కూడా.. కనుక నాకే మీ కుమార్తెనిచ్చి వివాహం చేయండి’ అని అన్నాడు.

మూడవవాడైన ధర్మదత్తుడు, ‘మహాప్రభూ! నాపేరు ధర్మదత్తుడు. నేను ధనుర్విద్యలో అత్యంత నైపుణ్యం కలిగిన వాణ్ణి. అన్ని రకాల యుద్ధ విద్యలూ, నాకు తెలుసు. కనుక నేనే అన్నివిధాల మీ కుమార్తెను చేపట్టడానికి అర్హుడిని’ అని అన్నాడు.

ఇక నాల్గవవాడైన కళావిదుడు, ‘చంపకేశ మహారాజా! నా పేరు కళావిదుడు. పేరుకు తగినట్లుగా, నేను అన్ని కళల్లో ఎంతో ప్రావీణ్యం పొందిన వాడిని. రోజుకు అయిదు రత్నాలను సంపాదిస్తాను. అవి ఎంతో విలువైనవి. ఆ అయిదు రత్నాలలో ఒక రత్నాన్ని, పుణ్య కర్మల కోసం, మరో రత్నాన్ని యజ్ఞయాగాది క్రతువులు చేయడానికీ, మూడవ దానిని నాకోసం, నాలుగవ దానిని నా భార్య కోసం వినియోగిస్తాను. చివరిగా అయిదవ రత్నాన్ని, భోజనం కోసం వెచ్చిస్తాను. పైగా నేను గుణవంతుణ్ణి, రూపవంతుణ్ణి. అందుకే మీరు తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయడం, ధర్మం’ అని అన్నాడు.

స్వయంగా ఆ నలుగురూ చెప్పిన అర్హతల్ని విన్న చంపకేశుడికి, నలుగురూ తగిన వారే అనిపించారు. ఎవరిని ఎన్నుకున్నావని కుమార్తె వైపు చూశాడు మహారాజు. యువరాణి వారి అర్హతలను విన్నది. కానీ, ఏ సమాధానం చెప్పకుండా, సిగ్గుతో తలవంచుకుని నిలబడింది. 

విక్రమార్క మహారాజా! మీరు విన్న ఈ కథలో, నలుగురు యువకులలో, త్రిలోక సుందరికి అర్హుడైన వరుడు ఎవరు? అని బేతాళుడు ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా విక్రమార్కుడు, ‘విప్రవరా! మొదటగా తన అర్హతల్ని వివరించి చెప్పిన ఇంద్రదత్తుడనే వాడు, వేదాధ్యయనం చేశానని చెప్పాడు. కాబట్టి, అతడు బ్రాహ్మణుడైవుంటాడు. ఇక ధనపాలుడు, ధనధాన్యాలను అధికంగా కలిగి ఉన్నాననీ, బహు భాషలు తెలుసుననీ చెప్పాడు.. కనుక, అతడు వైశ్యుడై ఉంటాడు. సకల కళాకోవిదుడననీ, రత్నాలను సంపాదిస్తాననీ చెప్పినవాడు, శూద్రవర్ణానికి చెందిన వాడు. ఇక ధర్మదత్తుడనే వాడు ధనుర్విద్యలోనే గాక, వివిధ శస్త్రాస్త్రాలను ప్రయోగించగల సామర్థ్యం, యుద్ధ విద్యలో నైపుణ్యం, అపారంగా ఉన్నాయని చెప్పినందున, అతడు క్షత్రియుడు. ఈ నలుగురిలో క్షత్రియుడైన ధర్మదత్తుడే, త్రిలోక సుందరికి తగిన వరుడు. ఎందుకంటే, త్రిలోక సుందరి క్షత్రియ కన్య కనుక, ఆమెను క్షత్రియుడికిచ్చి వివాహం చేయడమే, ధర్మం. ఏ యుగంలోనైనా, ఈ ధర్మాన్నే పాటించాలి’ అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు.

ఇక మన తదుపరి వీడియోలో, బేతాళుడి మూడవ ప్రశ్న, మూడవ కథ అయిన ‘హరిస్వామి కథ’ను గురించి తెలుసుకుందాం..

Link: https://www.youtube.com/post/Ugx_3d0AywlRThys7up4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes