ఒకటే వస్తువును రెండు రకాలుగా గణితంలో చూపించవచ్చును. దాన్ని time domain లోనూ, అలాగే frequency domain లోనూ.
ఒక domain నుండి మరొక దానిలోకి మార్చితే, దాని స్వరూపం మారుతుంది. అంతే తప్ప, వస్తువు మారదు. ఉదాహరణకు 1 సమయపరంగా చూస్తె 1/s అని frequency పరంగా కనబడుతుంది.. కానీ రెండూ ఒకటే. అంతవరకు ఎందుకు? ఒక పిరమిడ్ ను ఒక వైపు నుండి చూసునప్పుడు త్రికోణంగాను, కిందనుండి చూస్తె చతురశ్రంగాను , ఎంతో ఎత్తు నుండి చూసినప్పుడు ఒక బిందువుగాను కనబడుతుంది. అది చూసే వారి దృష్టిని బట్టి ఎన్నో రకాలుగా కనిపించవచ్చు కానీ అక్కడున్న వస్తువు ఒకటే.
మనకు మన వాంగ్మయం చెబుతున్న “శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః” తత్త్వం ఇదే.
ఆ వున్న ఒకటే శక్తిని మనం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగాను, స్థితి కాకరకత్వాన్ని విష్ణు తత్త్వంలోను, లయం చేసినప్పుడు రుద్రుని గాను పిలుస్తున్నాం, పూజిస్తున్నాం.శక్తికి సాధారణంగా స్త్రీ వాచకంగా వాడడం కద్దు. ఆ శక్తిని మనం మహా మాయగాను, త్రిపురసున్దరిగా, లలితా పరమేశ్వరిగా, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మగా కొలుస్తాము. ఆ శక్తికి, శక్తి కారకత్వానికి అభేదం. ఆమే పరమపురుషుడు, పరమాత్మ అన్నీను. మనలను కరుణించదానికి వివిధ రూపాలలో కనబడుతున్న ఏ పరమ పావన శక్తి వుందో అది ఒక్కటే. అదే అన్నింటికీ మూల కారణం. శక్తి వున్నది ఒక్కటే. అదే వివిధ రూపాలలో రూపాంతరం చెందుతున్నది. శక్తిని ఒకరు పుట్టించలేరు, హరించలేరు. అది రూపాంతరం చెందుతుంది. ఈరోజు మనం చూస్తున్న స్థావర జన్గాత్మకమైన ప్రపంచం ఆ పరమ శక్తి యొక్క రూపం మాత్రమె.
ఇతః పూర్వం ఒకసారి మనవి చేసివున్నాను. ఒక తీగలో విద్యుత్తు శక్తి ప్రవహిస్తుంది. దాన్ని వ్యక్తీకరించడానికి నేను ఒక బుల్బ్ పెడితే కాంతి రూపంలో ప్రకటితమవుతోంది, ఫ్యాన్ పెడితే వాయురూపంలో, ఏ ఉపకరణం పెడితే ఆ ఉపకరణవిశేషంగా అదే శక్తి ప్రకటితమవుతోంది. కానీ వున్న శక్తి ఒకటే. ఆ శక్తి ఉత్పన్నానికి కారణం అణు విద్యుత్తు అవ్వచ్చు, థర్మల్ అవ్వచ్చు, లేక జలశక్తి వలన అవ్వచ్చు. ఒక రకం శక్తిని మనం మరొక రకం శక్తిగా మార్చుకుని వాడుకుంటూ ఉన్నాము. కానీ మనం శక్తిని సృష్టించలేము. శక్తిని కనుగొనగల0. ఈ అనంత సృష్టి ఆ శక్తి స్వరూపమే. ఆ శక్తి మనలను వివిధ రూపాలలో ఆశీర్వదిస్తోంది. ఆ శక్తిని మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతుంది. నారాయణ అనవచ్చు, శివా అనవచ్చు, గణేశా అనవచ్చు లేక దేవి అనవచ్చు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం ఒకటే.
ఆ వేంకటేశుని అత్యద్భుతమైన దివ్యమంగళ విగ్రహం శంఖ చక్ర అభయ వరద హస్తాలతో మనను ఆశీర్వదిస్తూ వుంటారు. స్వామి మన మీద దయతో నిరతం అందరికీ దర్శనం అనుగ్రహిస్తూ మన పాపాలను నాశనం చేస్తూ మనకున్న కష్టాలను దూరం చేస్తూ అనంత ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను, మోక్షగాములకు వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతిని కలిగిస్తూ ఆనందనిలయంలో కనబడతారు. వారి దక్షిణ వామ హస్తాలలో శంఖ చక్రాలు,ఆయన స్వరూపం త్రిమూర్త్మ్యాతకం.
“విష్టోర్ముఖో ద్ధానిలపూరితస్య, యస్య ధ్వనిర్ధానవదర్పహంతా,
తం పాంచజన్యం శశికోటిశుభ్రం, శంఖం సదాహం శరణం ప్రపద్యే”
శంఖం – ఓంకారానికి ప్రతీక. “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ”. పంచాయుధాలలో ప్రముఖమైన శంఖం బ్రహ్మకు ప్రతీక. శంఖం అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. ఓంకార శబ్దాన్ని టైం డొమైన్ transform చేస్తే, శంఖం రూపంలో వుంటుంది.
“స్ఫురత్సహస్రార శిఖాతితీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో: చక్రం సదాహం శరఱం ప్రపద్యే”
చక్రం – కాలానికి లయానికి ప్రతీక. శివుని లయకారుడని అనడం కద్దు. ఆయనే సుదర్శనుడని ప్రగాఢ నమ్మకం. ఆయన పరబ్రహ్మ స్వరూపమైన సాక్షాత్తు విష్ణుడని ఎందరో మహానుభావుల అనుభవం.
వేంకటేశుడు సాక్షాత్తు త్రిమూర్త్మ్యాత్మక స్వరూపుడు. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు అన్నట్టు. అలాగ ఆయన రూపం అదే సత్యాన్ని తెలియ చేస్తున్నట్టు శంఖు చక్రాలతో త్రిమూర్తి స్వరూపాన్ని చూపెడుతోంది.
అలాగే శివుని రూపం రుద్రకవచ ధ్యానంలో :
“శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం వంచవక్ర్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం నాగం పాశం చ ఘంటాం
ప్రళయ హుతవం సాన్కుశం వామభాగే నానాలంకార యుక్తం స్పటిక మణినిభం పార్వతీశం నమామి “
ఆయన ధరించిన ఆయుధాలు కూడా మరి ఇద్దరిని గుర్తు చేసినట్టు వుంటాయి. త్రిశూలం తిరునామానికి, మేషం 12 రాశులలో స్థితి తత్వానికి, అనగా, విష్ణువుని సంకేతిన్చాగా, డమరుకం ప్రణవ నాదానికి, కమండలం బ్రహ్మకు, మొదట వినిపించిన “తపః తపః” అనే తపస్సుకు సంకేతార్ధంగా వుంటుంది.
బ్రహ్మ చేతిలో వేదాలు, ఏ వేదాలు తెలియచేస్తున్న వేదపురుషుడైన విష్ణువో అతడిని సంకేతంగా కమలం ద్వారా కూడా ఆయననే చూపుతూ, కమండలం రూపంలో నిరంతరం ధ్యాన మగ్నుడై, జ్ఞాన స్వరూపమైన శివ తత్వాన్ని తెలియచేస్తున్నాయి.
వారి రూపాలలో కొంత వ్యత్యాసమున్నా వారు మువ్వురూ చూపుతూ వున్నది అభేద తత్వమే. ఈ మూడు తత్వాలను ఒక త్రికోణంలో మూడు ప్రధానబిందువులు అనుకుంటే, వాటి centroid ఆ శక్తి స్వరూపం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అది నారాయణుడు, పరమేశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ, మహామాయ, మహాశక్తి. కావున మనం, మనకు ఏది నచ్చిన తత్వమో, ఆ పేరుతో పూజిద్దాం. వున్నది ఒకటే తత్వమైనప్పుడు, ఏ రూపంతో కొలిచినా జరిగే అనుకూలత ఒకటే. మరొక తత్వాన్ని విమర్శించకుండా, మనకు నచ్చిన రూపాన్ని ఉపాసించి, ఆ పరమాత్మ కరుణను పొందుదాం.
అన్నమయ్య కీర్తనలో ఇలాచెబుతాడు. 'హరి ఇతన్డు, హరుడతండు ఆకారమొక్కటే, హరిహరు లందును అధికులెవ్వరులేరు' ఆ హరిహరరూపమే ఈ వేంకటాద్రిపై వెలసిన వేంకటేశుడు.
మరొక కీర్తనలో..
“తలతురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు...
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని,
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మమని,
తలతురు మిము శైవులు తగిన భక్తులు శివుడనుచు,
అలిరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడునుచు”
అని ఆ వేంకటేశుని తత్వాన్ని విశదీకరించాడు.
“ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు “
కరుణించు కాపాడుము ఓ వెంకటేశ్వరా.!!!
సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు...
Post a Comment