తెలుగు సంవత్సరాలలో ఎనిమిదో నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం. కార్తీక మాసం సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది.
నకార్తీకే సమో మాసం, న కృతేన సమం యుగం |
నవేద సద్రసం శాస్త్రమ్, నతీర్థ గంగాయ సమం ||
అని స్కంద పురుణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.
ధార్మక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రం వేళల లొ దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు గాలికి ఆరిన దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగకంటే పుణ్యప్రదమైన తీర్థాలు లేవని పురాణంలో పేర్కొన్నారు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైన మాసం. శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషరగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.
అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చు అని అంటారు. పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.
శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.
కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది. ఈ మాసంలో ఉత్థానైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.
కార్తీక దీపంలో రెండు వత్తులు కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.
అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తుంటారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసికి పూజచేయడం, తులసి కళ్యాణం విశేషంగా చెపుతారు. మాఘేవా, మాధవేమాసిం కార్తీకేవా శుభేదినే అని సత్యనారయణ వ్రతకథలో ఉంటుంది.
మాఘమాసంలో గానీ, చైత్ర మాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతము ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాణ స్వామిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తక దామోదర స్వరూపమైన మాసం. ఈ మాసంలో పౌర్ణమినాడు సత్యనారాయణ వ్రతం ఆచరిండం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.
వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి. అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారు.
సర్వేజనా శుఖినోభవంతు.
Post a Comment