నేటికీ మహిమలు చూపిస్తున్న గురు రాఘవేంద్ర స్వామి!


ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, పీఠాధిపతిగా ఎదిగిన గురువు, శ్రీ రాఘవేంద్ర స్వామి. ఆయన జీవితం, ఆదర్శ ప్రాయం. వేంకటేశ్వరుని వర ప్రసాదంగా జన్మించిన రాఘవేంద్రులు, ఎన్నో మహిమలూ, అద్భుతాలూ చేశారు. ఆయన అసామాన్య ప్రజ్ఞాపాటవాలూ, మేధో శక్తి, అమోఘం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర, ఆయన మహిమలూ, సమాధి స్థితిని పొందేవరకూ ఆయన చేసిన కృషి గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/R3-1D7fdPts ]

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ |
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ||
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః

1571 లో, కాంచీపురం సమీపంలోని భువనగిరిలో, ఒక నిరుపేద కుటుంబంలో, తిమ్మనభట్టు, గోపికాంబ దంపతులకు జన్మించారు రాఘవేంద్రులవారు. వేంకటేశ్వరుని కృపతో జన్మించిన ఆయనకు, తల్లిదండ్రులు వెంకటనాథుడని నామకరణం చేశారు. ఈయన తాతగారు, శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే, తల్లిదండ్రులు గతించారు. ఆనాటి నుండి, తన బావగారి సంరక్షణలో ఉంటూ, సర్వశాస్త్ర పారంగతులయ్యారు. వెంకటనాథుడికి యుక్త వయస్సులోనే, సరస్వతి అనే మహిళతో, వివాహం జరిగింది. తరువాత వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆనాటి నుండి, వెంకటనాధుడికి కుంటుంబ పోషణ భారంగా మారింది. ఏం తోచని నిస్సహాయ స్థితిలో, భువనగిరిని వదిలి, కుంభకోణానికి చేరుకున్నారు వెంకటనాధుని కుంటుంబం. ఆయనకు తాత్కాలికంగా, సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం లభించింది. వేంకటనాధుని అసామాన్య ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యపోయారు, సుధీంద్ర తీర్థులవారు. ఆయన మేథాశక్తినీ, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్నీ అభినందించకుండా ఉండలేకపోయారు. జ్ఞాన వరిష్టుడైన వెంకటనాధుని వినయ విధేయతలూ, చిత్తశుద్ధీ, గురువైన సుధీంద్ర యతీంద్రులను, బాగా ఆకర్షించాయి. 

వయోభారంతో వున్న సుధీంద్రుల వారు, ఒకనాడు శిష్యుడైన వెంకటనాధుణ్ణి పిలిచి, "వెంకటనాథా! నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడోరేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు, నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి" అని తన మనస్సులోని కోరికను బయటపెట్టారు. అందుకు వెంకటనాధుడు, తనకు భార్యాబిడ్డలున్నారనీ, కుటుంబ పోషణ భారం తనదేననీ, వారిని మధ్యలో వదిలేసి రాలేననీ, గురువుతో చెప్పి వెళ్లిపోయారు. తనకు కష్ట కాలంలో సహయం చేసిన గురువు గారి మాటను కాదని వచ్చేశాసనే బాధతోనే, ఆ రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అప్పుడు కలలో సరస్వతీ దేవి ప్రత్యక్షమై, ‘నాయనా వెంకటనాథా.. నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేథా శక్తితో, సద్గురువువై, దారి తప్పిన జనాలకు దారి చూపు. నీవు నీ గురువు చెప్పినట్టు చెయ్యి' అని చెప్పిందట. వెంటనే నిద్ర నుండి మేల్కొన్న వెంకటనాధుడు, గురువు సన్నిధికి చేరుకున్నాడు. అప్పుడు సుధీంద్ర తీర్థులు ఎంతో సంతోషించి, వెంకటనాథుణ్ణి తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి, పీఠాధిపత్య బాధ్యతలు అప్పగించారు. అప్పుడే, వెంకటనాథుడి పేరును, రాఘవేంద్ర స్వామిగా దీక్షానామం చేశారు. రాఘవేంద్ర స్వామిగా సన్యాస దీక్ష తీసుకునేనాటికి, ఆయన వయస్సు 23 సంవత్సరాలు. ఆ తరువాత 40 ఏళ్ల పాటు, అతి పవిత్ర జీవనం గడిపి, నియమ నిష్టలతో, నిత్యం మూలరాముణ్ణి ఆరాధించేవారు. 

రాఘవేంద్రుడు ఎన్నో మహిమలూ, అద్భుతాలూ చేశారు. ఒకనాడు ఆ ప్రాంత నవాబు, రాఘవేంద్రులను పరీక్షింపదలచి, రెండు బుట్టలతో మాంసం పంపాడు. కానీ, శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా, అందులో పళ్లూ, పువ్వులూ ఉన్నాయి. దాంతో, నవాబు తన తప్పు తెలుసుకుని, రాఘవేంద్ర స్వామిని సత్కరించాడు. ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోసి, తన మహిమను దశదిశలా వ్యాప్తింపజేశారు. ఇలాంటి ఎన్నో మహిమలను, రాఘవేంద్ర స్వామి సోదరి కుమారుడైన నారాయణాచార్యుడు, రాఘవేంద్ర విజయమ్‌ అనే గ్రంథంలో, నిక్షిప్తం చేశారు. రాఘవేంద్రుల వారు, 40 ఏళ్లపాటు పీఠాధిపతిగా కొనసాగిన తరువాత, ఒకనాడు, తన శిష్యుడైన వెంకన్నను పిలిచి, తుంగభద్రా తీరాన, మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి, అందమైన బృందావనం నిర్మించమని కోరాడు. ఆ విధంగానే, చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు వెంకన్న. 1671వ సంవత్సరంలో, శ్రీ రాఘవేంద్రస్వామి, వీణతో సహా సమాధి స్థితినొందారు. ఆయన బృందావన సమాధిని, 1200 సాలగ్రామాలతో మూసివేశారు, శిష్యులు.

రాఘవేంద్ర స్వామిని, విష్ణు భక్తుడైన భక్తప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. సమాధి గతుడైన తర్వాత కూడా, రాఘవేంద్రుల వారు చూపిన మహిమలూ, చేసిన అద్భుతాలూ, కోకొల్లలు. సమాధి నొందిన 700 సంవత్సరాల వరకూ, సూక్ష్మరూపంతో బృందావనంలో ఉండి, భక్తులను అనుగ్రహిస్తానని అయన మాటిచ్చిన విధంగానే, నేటికీ ఆయన మహిమలను ఆస్వాదిస్తున్నారు భక్తులు. ఆయన స్వతంత్ర రచనల్లో, జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం, 'భట్ట సంగ్రహం' భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి, మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని గుభాళింపజేశారు.

ఐతరేయోపనిషత్తు మినహా, తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు. వ్యాసతీర్థుల చంద్రికకు, ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో, పరిమళాచార్యుడిగా వాసికెక్కారు, శ్రీ రాఘవేంద్ర స్వామి. గురు పూర్ణిమ నాడు, మంత్రాలయంలోని రాఘవేంద్రుల వారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆ రోజు దేశ నలుమూలల నుండి, అనేక మంది భక్తులు, రాఘవేంద్రుని బృందావన సమాధిని దర్శించడానికి వస్తుంటారు.

[ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జీవిత రహస్యం! వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://youtu.be/2tXUZIGS2Vc ]

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes