కార్తీక పురాణం! (చతుర్దశాధ్యాయము - పద్నాలుగవ రోజు పారాయణము)


ఆ బోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము):

మరల వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.

ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానముచేయుట, మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు.

వారికి కోటి యాగముల చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృ దేవతలును తమ వంశమం దెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక, కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో, అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడానరకమునకుగురిచేయును. కాన ప్రతిసంవత్సరం కార్తీక మాసమున తనశక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆరాత్రియంతయు జాగరముండి మరునాడు తమశక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములననుభవింతురు.

కార్తీకమాసములో విసర్జింపవలసినవి:

ఈ మాసమందు పరాన్న భక్షన చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు. తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారమునాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహా పాపియై జన్మ జన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

శ్లో|| గంగే యమునే చైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధింకురు!!

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయం కాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను.

కార్తీక మాస శివపూజాకల్పము:

1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి

2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి

3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్నసింహాసనం సమర్పయామి

4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి

5. ఓం లోకేశ్వరానమః - ఆర్ఘ్యం సమర్పయామి

6. ఓం వృషభవాహనాయనమః - స్నానం సమర్పయామి

7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి

8. ఓం జగన్నాథాయనమః - యజ్ఞోపవీతం సమర్పయామి

9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి

10. ఓం సంపూర్ణ గుణాయనమః - పుష్పం సమర్పయామి

11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్‌ సమర్పయామి

12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి

13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి

14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి

15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి

16. ఓం శంకరాయనమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

17. ఓం భవాయనమః - ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి

ఈప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తనశక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారధన చేసిన ఎడల, వారికీ, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండికూడా యీ వ్రతము నాచరించనివారు వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోకతముగా ఆచరించిన యెడల పదిహేను జన్మలయొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి 'చతుర్దశాధ్యాయము - పద్నాలుగవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgzaYRd_QXryDQKJm7R4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes