కార్తీక పురాణం! (పంచదశాధ్యాయము - పదిహేనవ రోజు పారాయణము)


దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట:

అంతట జనకమహారాజుతో వశిష్థమహాముని, 'జనకా! కార్తీకమాహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపు'మని, ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక వినుట, సాయంత్రము దేవతాదర్శనము - చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమున బడి, కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంథ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చినయెడల, విశేష ఫలము పొందగలరు. ఈవిధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చత్రుర్ధశి, పూర్ణిమ రోజులందైనా నిష్టతో పుజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలెను.

ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంత సేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసిన యెడల, లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథకలదు. విను - మని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతి నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు జేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను.

అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దానిరూపము మారి మానవరూపములో నిలబడెను. ధ్యాననిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరిచిచూడగా, ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి " ఓయీ! నీ వెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి? అని ప్రశ్నించగా "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతోనుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని, దానిని నోటకరిచి, ప్రక్కనున్న దీపం చెంత నిలబడి వుండగా, నా అదృష్టముకొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు, వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ యెత్తవలసి వచ్చెనో, దానికిగల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను. 

అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీకుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ, ధనాశా పరుడవై దేవ పూజలు, నిత్య కర్మలు మరచి, నీచుల సహవాసము వలన, నిషిద్ధాన్నము తినుచు, మంచి వారలను, యోగ్యులను నిందించుచు, పరుల చెంత స్వార్ధచింత గలవాడై, ఆడపిల్లను అమ్మువృత్తి చేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక, యితరులకు యివ్వక, ఆ ధనము భూస్థాపితం చేసి, పిసినారివై జీవుంచుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించి నందున, పుణ్యాతుడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి, నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దాన ధర్మాలుచేసి, భగవంతుని ప్రార్థించుకొని, మోక్షము పొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి 'పంచదశాధ్యాయము - పదిహేనవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgxnttOZHYTZNWp9yIV4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes