పదమూడవ రోజు అనగా 28.12.2020 సోమవారము..
13వ రోజు - తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు..
ఆండాళ్ తిరువడిగలే శరణం
ఇవాళ ధనుర్మాసం 13 వ దినం. తిరుప్పావై 13 వ పాశురం. ఇవాళ గోదా దేవి.. మరో గోప కన్య వద్దకు వెళ్ళి నిద్ర లేపుతుంది. వీరంతా నిన్న శ్రీరాముని కల్యాణ గుణాలను పాడుకుంటూ వెడతారు. ఈ గోప కన్య కృష్ణ భక్తురాలు కాబట్టి ఆమెను లేపడానికని కృష్ణ నామ సంకీర్తనం చేస్తే ఆమె మాత్రం కృష్ణుడి సాంగత్యం వలన కలిగిన మధుర భావనలతోనే తెలియాడుతున్నది . ఇంకా ఆమెను లేపాలంటే కింకర్తవ్యం అని అలోచించి కొందరు కృష్ణ నామ సంకీర్తనం చేయడం ద్వారా ఆమెను నిద్రలేపవచ్చని కృష్ణ నామం పాడడం ఆరంభించారు. అలా గోపకన్యలంతా రెండు సమూహాలుగా రాముడే గొప్పవాడని ఒకరు కాదు కాదు లీలామయ రూపుడైన కృష్ణుడే గొప్పవాడని కొందరు వాదన చేయడం ఆరంభిస్తారు. అపుడు సర్వం తెలిసిన గోప వృద్ధురాలు ఒకతె ముందుకు వచ్చి.. ఆపండి మీ వాదులు ఇక.. ఇద్దరూ ఒకరే .. రామ కృష్ణులిద్దరూ విభవాద్యావతారములే కాబట్టి మీరు వాదులు మాని చక్కగా అందరు కలసి మెలసి ఉండాలి సుమా అంటూ సయోధ్య చేకూర్చగా అందరూ కలసి మళ్ళీ గోప కన్యను నిద్ర లేపడానికి ఉద్యుక్తులై లేవమ్మా మనం సిరి నోము చేయడానికి ఆ యమునకు వెళ్లి స్నానం చేయాలి అంటూ నిద్ర లేపుతారు.
పాశురము:
పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్క ళమ్బుక్కార్,
వెళ్ళియెళు న్దువియాళముఱజ్గిత్తు,
పుళ్ళుమ్ శిలుమ్బివ గాణ్ పోదరి క్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్,
కళ్ళమ్ తవిర్ న్ధు కలన్దేలో రేమ్బావాయ్.
తాత్పర్యం:
కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరునుసంకేతస్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను.
ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు.
కృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! ఇంకను పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతము సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును' అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.
అవతారిక:
ఈ వ్రతంలో చేరటానికై ఏడుగురు గోపికలను మేల్కొలిపారు. ఇక ఎనిమిదవ గోపికను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు. ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కల్గినది. తన నేత్ర సౌందర్యాన్న నుభవించటానికై శ్రీ కృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో వుండి ఉదాసీన వైఖరిననుసరిస్తున్న గోపిక. ఆ భావంతో నిద్రిస్తున్న యీమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొలుపుతున్నారు.
క్రిందటి (మాలికలో) ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. కాని ఊరివారు వ్రేపల్లెలో కృష్ణ కీర్తనమేగాని శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికిని యిక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు. పెద్దలు క్షీరసాగరంలో శయనించివున్న శ్రీమన్నారాయణుడు అవసరార్ధము అనేక అవతారాలనెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని చెప్పారు.
నామ రూపాలు వేరైనా తత్త్వం ఒక్కటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికలను మేల్కొలిపారు.
(చారకేశి రాగము - ఆదితాళము)
ప.. లేవే! ఓ చిన్నదాన! లేవే! చాలింక నిదుర!
లేవే! తామరసాక్షి! లే! మా కాశ్చర్యమాయె!
అ..ప.. లేవే! పడకను వీడవె! రావె! తీర్థమాడగ
వేవేగ లేచిరావె! సమయము మించి పోవునె!
చ.. నోటిని జీలిచి బకాసురు జంపిన
పటు బలశాలి శ్రీకృష్ణుని కీర్తిని
నోట బాడుచు నోము నోచేటి కన్యలు - ఆ
చోటు చేరిరె! వేగ నిద్దుర లేవనె!
చ.. శుక్రుండుదయ మందె నస్తమించెను గురుడు
పక్షుల కలవరము లవిగో వినబడవొ నీకు?
శ్రీకృష్ణుని తలచు కపటమ్ము వీడి యిపుడు
ఆ కృష్ణ విరహ తాపము దీర నీరాడ
లేవే! ఓ చిన్నదాన! లేవే! చాలింక నిదుర!
కొందరు గోపకన్యలు గోకుల విహారి కృష్ణుడే గొప్పయని చెబుతారు
వినవే చెలియా కృష్ణ మహిమలను
మధురాపురి సదనుని మధుసూదను లీలలు
కొంగరూపుడైన బకుని గూల్చి ధర
శాంతి నెల కొల్పిన సద్గుణ శౌరి లీలలు
మరి కొందరు గోపికలు రాముడే గొప్పవాడని చెబుతారు
వినవే సఖియా ఇనకుల తిలకుని లీలలు
సీతాపహారి మాయావి దశకంఠుని గూల్చిన
మహిమోపేత మహోన్నత దివ్యుని
శిష్ట జనపాల దైత్య సంహార సీతారాముని లీల
గోప వృద్ధురాలు ఇరువురు ఒకరే యని ఇలా సమాధానం చెబుతుంది.
తగదింక వాదులు ఆపరే చెలులారా
ముష్టికా శూర చాణూర మల్ల మర్దన
రావణ కుంభ కర్ణాది దైత్య విరాముడు
ధీర మునిజన విహారుడు ఒకరే తెలియగ
తగవు తీరిన గోప కన్యలు సరే అని ఇంక వ్రతము చేసేందుకు వెళ్ళాలి ఇంకా కపట నిద్ర మాని లేవమ్మా యమునకు పోదాము అంటూ అని గోపకన్యను నిద్ర లేపుతారు.
కమల పత్రాక్షే దివ్యాభరణ భూషితే
ఇకనైనా లేవవే హరి సేవకు జాగు సేయకను
పక్షులు పాడేను చెలులందరు కూడెను
వేవేగ రావమ్మ నీరాడ పోదము సఖియా
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..
Link: https://www.youtube.com/post/UgzPIousQGXSm_ukkZx4AaABCQ
Post a Comment