హంస రాయబారము - నల దమయంతిల ప్రేమకథ! 1
మన పురాణ ఇతిహాసాలలో, అజరామరమైన ఎన్నో ప్రేమకథలున్నాయి. శివపార్వతులూ, లక్ష్మీ నారయణుల ప్రేమాయణ కావ్యాలు, మనకు సుపరిచితాలే. పంచమ వేదంగా భాసిల్లే మహాభారతంలో కూడా, ప్రేమకథలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అటువంటి అద్భుత ప్రేమకథలలో ఒకటి, నలమహారాజుది. పాక శాస్త్రంలోనూ, అశ్వ విద్యలోనూ గొప్ప ప్రావీణ్యతను పొంది, ముల్లోకాలలో ఘనుడిగా పేరుగడించినవాడు, నలుడు. పరాక్రమవంతుడైన నలుడి ప్రేమాయణం, ఒక రసరమ్య కావ్యం. ఇంద్రుడూ, దిక్పాలకులూ, కలిపురుషుడి వంటి దేవతలను సైతం మోహానికి గురిచేయగల సౌందర్యరాశి దమయంతి, నలుడి ప్రేమలో ఎలా పడింది? ఆమె స్వయంవరానికి వచ్చిన దేవతలను కాదని, నలుడిని ఎలా వివాహమాడింది - అనేటటువంటి ఆశ్చర్యపరిచే ప్రేమ కథను ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/aZ0FtPkx4L0 ]
వీరసేనుడి కుమారుడైన నలుడు, తన పరాక్రమంతో నిషిధదేశాన్ని ప్రజారంజకంగా పాలించేవాడు. పొరుగు రాజ్యమైన విదర్భ దేశాన్ని, భీముడనే రాజు పాలించేవాడు. అయితే, భీముడికి చాలా కాలం సంతానం కలుగలేదు. దమనుడనే మునిచ్చిన వరము వలన, భీముడికి దమయంతి అనే కూతురూ, దముడూ, దమనుడూ, దాంతుడూ అనే కుమారులూ కలిగారు. దమయంతి అపర సౌందర్యరాశీ, గుణవంతురాలు. నిషిధ దేశాన్ని పాలించే నలుని గుణగణాలను గురించి విన్నది, దమయంతి. నలుడు కూడా దమయంతి గురించీ, ఆమె సౌందర్యం గురించీ విని ఉన్నాడు. ఆ క్రమంలో, ఇరువురి నడుమా ప్రేమ అంకురించింది.
ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా, హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చట పడిన నలుడు, వాటిలో ఒక దానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక, ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. నలుడు బంధించిన హంస, మానవభాషలో మాట్లాడింది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి, నీ గురించీ, నీ అందచందాల గురించీ, గుణగణాల గురించీ చెప్పి, నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను. దయచేసి నన్ను విడిచిపెట్టు." అని పలికింది. ఆ హంస మాటలకు నలుడు ఆనందపడి, దానిని విడిచి పెట్టాడు.
ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస, విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను గమనించింది, దమయంతి. ముచ్చటగా ఉన్న ఆ హంసను చెలికత్తెల సాయంతో పట్టుకుందామె. అప్పుడా హంస దమయంతితో, "ఓ దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడూ, సంపన్నుడూ, సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే, నీకు రాణింపు" అని పలికింది. అందుకు దమయంతి మురిసి పోయి, "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో, అలాగే నలునికి నా గురించీ చెప్పు" అని, ఆ హంసను తిరిగి నలుడి దగ్గరకు పంపింది. నల దమయంతుల ప్రణయ విషయం, ఆమె చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు, కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు.
ఆహ్వానాన్నందుకున్న రాజులంతా, స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి బయలుదేరాడు. ఇంద్రుడు కూడా దమయంతి స్వయంవరం గురించి తెలుసుకుని, తన దిక్పాలకులతో సహా బయలుదేరాడు. మార్గమధ్యంలో ఇంద్రుడికి నలుడు కనిపించాడు. అప్పుడు ఇంద్రుడు, "నిషధ రాజా! నీవు నాకు దూతగా పని చేయాలి" అని అడిగాడు. అందుకు నలుడు సరేనని, ‘ఇంతకీ మీరెవరు? నేను మీకేమి చేయాలి?’ అని సందేహన్ని వెలిబుచ్చాడు. దాంతో ఇంద్రుడు, తను వచ్చిన పనిని వివరించాడు. "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి విదర్భ దేశ యువరాణి దమయంతికి మా గురించి చెప్పి, ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అని అన్నాడు. ఇంద్రుని మాటలకు నలుడు ఆవేదనతో, "అయ్యా! మీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా!" అని అడిగాడు.
ఇంద్రుడు నలుడి మాటను వినకుండా, "నీవు మాకు మాటిచ్చావు కనుక, ఈ కార్యం నెరవేర్చవలసిందే. ఇది దేవతాకార్యం.. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అని నలుడిని పంపించాడు. వేరే గత్యంతరం లేని నలుడు, దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించి, ఆమె సౌందర్యాన్నిచూసి ముగ్ధుడైపోయాడు. అతను అలా నిలబడి ఉండగా, దమయంతీ, ఆమె చెలికత్తెలూ, నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి, "మహాత్మా.. మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని ప్రశ్నించింది. ఆమె మనోహర సౌందర్యం తనకు కలిగించిన మైకం నుండి బయటపడి, దమయంతితో, "నా పేరు నలుడు. నేను దేవ దూతగా వచ్చాను. ఇంద్రుడిని మీరు వరించ వలసిందిగా కోరి, నన్ను రాయబారిగా పంపారు" అని పలికాడు. ఆ మాటలకు దమయంతి మనస్సు కష్టపడింది. "అయ్యా! నేను మానవకాంతను. నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, మిమ్ములనే నా భర్తగా తలచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు, మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నా భర్త.. కనుక నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కానీ, ఇతరులను వరించను" అని దమయంతి ప్రార్థించింది.
అందుకు నలుడు, తనకు కలిగిన ఆ దుస్థితికి దు:ఖిస్తూ, "దమయంతీ! దేవతలు ఐశ్వర్యవంతులూ, జరా మరణాలు లేని వారూ. వారిని కాదని, జరా మరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం, న్యాయమా?" అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. "మీరు ఇంద్రుని రాయబారిగా వచ్చారు. కానీ, నేను మిమ్ములనే కోరుకుంటున్నాను. అందరి ముందూ, నేను దేవతలను ప్రార్ధించి, మిమ్మల్ని వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అని తన ఆలోచనను చెప్పింది, దమయంతి. ఇక నలుడు తిరిగి ఇంద్రునికి వద్దకు వచ్చి, దమయంతి అభిప్రాయాన్ని తెలియజేశాడు. దమయంతి నిర్ణయాన్ని విన్న ఇంద్రుడూ, దిక్పాలకులూ, దమయంతికి నలుడిపై ఉన్న ప్రేమను తెలుసుకోవాలనుకుని, వారందరూ నలుడి రూపాన్ని ధరించి, స్వయంవరానికి వెళ్ళారు. స్వయంవర మండపంలో, ఒకేసారి ఆరుగురు నలులు కనిపించారు. వర మాలతో వచ్చిన దమయంతి ఆశ్చర్యపోయింది. తను మనస్సులో, "దేవతలారా! నేను నలుని భార్యగానే జీవించాలని ఆశపడుతున్నాను. కనుక నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. మీ నిజరూపాలతో ప్రత్యక్షమవ్వండి" అని ప్రార్థించింది. దమయంతి ప్రార్థనను విన్న వారు, ఆమెను కరుణించి, తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు దమయంతి వారిని పలు విధాల స్తుతించి, వారందరి సమక్షంలో, నలుడిని వివాహమాడింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి, వారిని అనుగ్రహించారు.
దమయంతి స్వయంవరాన్ని తిలకించి దేవలోకం వెళుతున్న దేవతలకు, కలి పురుషుడు కనిపించాడు. ఇంద్రుడు, కలి పురుషుణ్ణి చూసి పలుకరించి, "ఎక్కడికి పోతున్నావు?" అని కుశల ప్రశ్న వేశారు. కలి వారికి నమస్కారం చేసి, "భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను" అని తను వెళుతున్న కార్యాన్ని వివరించాడు. అ మాటలకు దేవతలు నవ్వి, "దమయంతి స్వయంవరం ముగిసింది. ఆమె తన ప్రియ సఖుడైన నిషిధ రాజు నలుడుని వివాహమాడింది. మేము కూడా ఆ స్వయంవరానికి వెళ్ళి, వారిని ఆశీర్వదించి, తిరుగు ప్రయాణమయ్యాము" అని జరిగిన సంఘటనను వివరించారు. దమయంతిపై మనస్సు పడి, తనను వివాహమాడడానికి వచ్చిన కలి, కోపంతో రగిలిపోయాడు. దమయంతిని తనకు కాకుండా చేసిన నలుడిని రాజ్యభ్రష్టుని చేసి, వారిరువురికీ వియోగం కల్పించడానికి పూనుకున్నాడు.
మరి కలి నలుడిపై తన ప్రభావాన్ని ఏ విధంగా చూపాడు? నల దమయంతిల ప్రేమకథ ఎటువంటి మలుపులు తిరిగింది - వంటి విషయాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..
ధర్మో రక్షతి రక్షితః!
Post a Comment