శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! 5 Mothers of Lord Krishna!


కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, 

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం |

సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ,

గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి ||

[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/AbSSImIw2-4 ]

శ్రీకృష్ణుడంటే హిందూమతానికీ, హిందూధర్మానికీ అంతరాత్మ లాంటివాడు. కృష్ణుడు, రాముడు గుర్తుకురాకుండా, హిందూమతం గుర్తుకురాదనే చెప్పవచ్చు. అంతేకాదు, నవభారత నిర్మాణానికి మూలపురుషుడుగా, శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కధానాయకుడు. పెదవులపై వేణువూ, మెడపై పసుపూ, తలపై నెమలి ఫించంతో కనిపిస్తూ, సర్వకళలనూ తనలో మిళితం చేసుకుని, సర్వ మానవాళి శ్రేయస్సుకై, శ్రీ హరి ఎత్తిన అవతారమే శ్రీ కృష్ణావతారం. నీలమేఘశ్యాముడు, ఈ భూమిపై ఉన్నంత కాలం, మానవ సంక్షేమం కోసమే తన జీవనం కొనసాగించాడు. అంతే కాకుండా, సహయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకున్నాడు. విష్ణువు 8వ అవతారంగా వచ్చిన శ్రీ కృష్ణుడు, ప్రతీ ఒక్కరి కష్టాలనూ కడతేర్చే భగవద్గీత అనే దివ్య జ్ఞానాన్ని మనకందించాడు. చిన్నతనంలో, గోకులంలో చేసిన ఆయన లీలలకు, ఎంతో మంది ఆకర్షితులయ్యారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం, అష్టమి తిథిన, రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీ కృష్ణుడికి, వసుదేవుని భార్య అయిన దేవకి కన్న తల్లిగా, నందుని భార్య యశోదమ్మ పెంచిన తల్లిగా, అందరికీ తెలుసు. కానీ, కన్నయ్యకు మొత్తం ఐదుగురు తల్లులు ఉన్నారు. దేవకీ, యశోద కాకుండా మరో ముగ్గురుని, ఆ కృష్ణ భగవానుడు తనకు మాతృసమానులుగా భావించాడు. మరి శ్రీ కృష్ణుడి తల్లులైన ఆ మిగతా ముగ్గురి గురించి కూడా, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

1. దేవకి

వసుదేవుడి సతీమణి అయిన దేవకి, శ్రీ కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లి. మధురలో ఆమె సోదరుడు కంసుడు, చెరసాలలో బంధించిన నేపథ్యంలో, శ్రావణ మాసంలో, కృష్ణ పక్షం, అష్టమి తిథిన, కంసుడి కారగారంలోనే, కన్నయ్యకు జన్మనిచ్చింది, దేవకీ మాత. దేవకి, మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె. ఆమెకు సోదరుడైన కంసుడు, దేవకిని అల్లారుముద్దుగా చూసుకుని, ప్రేమగా ఆదరించాడు. కానీ, దేవకికి వసుదేవునితో పెళ్లై వెళ్లబోతుండగా, ఆకాశవాణి పలుకులతో ఆగ్రాహావేశుడయ్యాడు. దేవకి అష్టమి సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని, దేవకినీ, ఆమె భర్త వసుదేవుడినీ, చెరసాలలో బంధించాడు. దేవకిని, దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని కూడా కొందరు భావిస్తారు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకున్న కారణంగా, శ్రీ కృష్ణుడిని, దేవకీ నందనుడూ, వాసుదేవుడూ అని పిలుస్తారు.

2. యశోద

కృష్ణయ్యకు జన్మనివ్వకపోయినా, కంటికి రెప్పలా చూసుకుంది, యశోద. గోకులంలోని గ్రామ పెద్దయిన నందుడికి భార్య యశోద. కంసుడి బారి నుండి తప్పించడానికి, తండ్రి వసుదేవుడు, వీరింట కన్నయ్యను విడిచివెళ్ళాడు. తన అల్లరి పనులతో, ముద్దు ముద్దు మాటలతో, చేష్టలతో, యశోద చెంతనే పెరిగాడు కృష్ణుడు. మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు, తన నోట చతుర్దశ భువనభాండాలను చూపి, ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేశాడు చిన్ని కృష్ణయ్య. భాగవతం ప్రకారం, యశోదకు కలిగి అదృష్టం, ముక్తీ, ఆ బ్రహ్మా, మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు. చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి, అతడిని మందలిస్తూనే, ఎంతో ప్రేమగా చూసుకున్న యశోదమ్మ, కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.

3. రోహణి

వసుదేవుడు, దేవకి కంటే ముందు రోహణిని వివాహం చేసుకున్నాడు. బలరాముడూ, సుభద్రా, ఏకాంగి దేవీ, వీరి సంతానం. దేవకీ-వసుదేవుల ఏడవ సంతానాన్ని, రోహణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా, ఆమెకు బలరాముడు జన్మించాడు. రోహిణి, తన కుమార్తే, కుమారుడితో కలిసి, యశోద దగ్గర నివసించేది. శ్రీ కృష్ణుడి ముత్తాత మారిషుడూ, ఆయన సవతి తల్లి అయిన రోహిణీ, నాగ జాతికి చెందిన వారని, కొంతమంది అభిప్రాయం. అంతేకాకుండా, హస్తినాపురానికి రాజైన శాంతనవుడి సోదరుడు బాహిలిక కుమార్తె రోహిణి అని, మరికొంత మంది వాదన.

4. సుముఖి దేవి

సాందీపని ముని భార్య అయిన సుముఖీ దేవికి కూడా, తల్లి హోదా ఇచ్చాడు, శ్రీ కృష్ణుడు. ఎందుకంటే, కృష్ణుడూ, బలరాముడూ, సుదాముడూ, సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే, సుముఖి దేవి, కృష్ణుడిని తన కుమారుడుగా ఉండమని, గురు దక్షిణ అడిగింది. అందుకు కారణం, శంఖాసురుడి అధీనంలో ఉన్న ఆమెను, అతడి చెర నుంచి విడిపించినందుకు, మాధవుడిని పుత్ర సమానుడిగా భావించింది. కన్నయ్యకు గురమాతైన సుముఖీ దేవి, ‘నీ తల్లి నీకు ఎప్పుడూ దూరమవ్వద’ని ఆశీర్వదించింది. అందుకే, కృష్ణుడు తనువు చాలించేవరకూ, ఆయన తల్లైన దేవకి కూడా జీవించే ఉంది.

5. పూతన

శ్రీ కృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకు, కంసుడు పూతన అనే రాక్షసిని పంపాడు. పాలు త్రాగే వయస్సులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వచ్చి, తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని, చిన్ని కృష్ణుడిని చంపాలని చూసింది. అయితే, పసిరూపంలో ఉన్న కన్నయ్య, ఆ విషయాన్ని ముందే గ్రహించి, రొమ్ముల ద్వారా పాలతో పాటు, రక్తాన్ని పీల్చి ఆమెను హతమార్చాడు. పూతన మరణం తర్వాత, ఆమెకు అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో, ఆమె శరీరం, గంధపు చెక్కలా సువాసన వెదజల్లడం ప్రారంభించింది. ఆ సువాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీని గురించిన వివరణ, భాగవతంలో సమగ్రంగా పేర్కొనబడింది. రాక్షసైన పూతన చనుబాలు త్రాగిన కృష్ణుడు, ఆమెకు కూడా తల్లి హోదా ఇచ్చినట్లు వివరించబడి ఉంది.

ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమా, అమ్మ కంటే గొప్ప భద్రతా ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. మాతృ దేవో భవ!

Link: https://www.youtube.com/post/Ugx5Tq2zcPEj2y7mSYh4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes