తిరుప్పావై గోదాదేవి 7వ పాశురం!


తిరుప్పావై గోదాదేవి 30 పాశురాలలో..

ఏడవ రోజు అనగా 22.12.2020 మంగళవారము..

7వ రోజు - భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము..

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము:

కీశు కీశెన్ఱెంగుం  ఆనైచ్చాత్తన్  కలందు

పేశిన  పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే

కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు

వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్  మత్తినాల్

ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో

నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి

కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో

తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్

"కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి. "కలందు పేశిన  పేచ్చరవం కేట్టిలైయో"   పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే  అని బాధతో మట్లాడుతున్నాయి.  నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి,  అంటూ అండాళ్ తల్లి   "ఆనైచ్చాత్తన్"  భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.

ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు.  అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు.  ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది.  అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా  సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిస్సు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు. మాళ్ళీ వేద అద్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయిస్సులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ.   భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు.  అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు.  ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు  "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా  అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది.

గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు.

"కాశుం పిఱప్పుం కలకలప్ప  క్కై పేర్ త్తు" గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి,  "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి.  "మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేడా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు.

"నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు.  ఏమిటా నామాలు అంటే "నారాయణ" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన  "మూర్తి" మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.

కేవలం అందమైనవాడేనా!  కాదూ,  మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు.  కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు.

అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది.  "తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి..

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..

Link: https://www.youtube.com/post/UgzXxooSD3KCIiIxS754AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes