కాల భైరవాష్టమి! Kala Bhairava Ashtami


కాల భైరవాష్టమి! 23/12/2020..

శ్రీ కాలభైరవస్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని, కాలభైరవాష్టమిగా సంభావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథను, శివపురాణం చెబుతోంది.

[ బ్రహ్మ అయిదవ తలను గోటితో గిల్లేసిన ‘కాలభైరవుని ఆవిర్భావం’ = ఈ వీడియో చూడండి: https://youtu.be/4O0axDLxgE4 ]

ఒకసారి శివ బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా, వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు 'నేను సృష్టికర్తను.. పరబ్రహ్మ స్వరూపుడను.. నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి' అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.

దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక, హుంకరించాడు. ఆ హుంకారం నుంచి, ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే, శ్రీ కాలభైరవ రూపం.

[ తప్పక తెలుసుకోవలసిన కాల భైర‌వుని ఆవిర్భావం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/E_-ldokW73M ]

హుంకారంతో జన్మించిన కాలభైరవుడు, తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞమేరకు, కారభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో, మధ్యనున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో, బ్రహ్మదేవుని గర్వం అణగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.

నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల, నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి, తీర్థయాత్రలు చేయి..' అని శివుడు సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు, బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం, బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి, క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా, తనకు సోకిన పాతకం విడవనందున, మహావిష్ణువు వద్దకు వెళ్లి, ఆయన్ను ప్రార్థించాడు.

అందుకాయన, 'కాలభైరవా! నీవు శివుని పుత్రుడవు. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి, జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా, ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే, నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది' అని మహావిష్ణువు సలహా ఇచ్చాడు.

దీనితో కాలభైరవుడు, కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని, కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే, నేటి కాశీలోని 'కపాల మోక్ష తీర్థం'.

తర్వాత కాలభైరవుని చూసి శివుడు, 'కాలభైరవా! నీవు ఇక్కడే కొలువుదీరి, క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే, నాకు పూజలు జరుగుతాయి.' అని శివుడు పలికాడు. శ్రీ కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి, క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్నాడు. కాశీ క్షేత్రాన్ని దర్శించినవారు, శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా, కాశీ నుంచి వచ్చిన వారు, కాశీ సమారాధన చేయడం, ఆచారం అయింది.

కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు, కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు, వడలను చేసి, వాటితో మాలను తయారు చేసి, పూజానంతరం, శునకమునకు పసుపుకుంకుమలు పెట్టి, ఆ మాలను దాని మెడలో వేసి, నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు, శ్రీ కాల భైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం.

ఈ కాల భైరవుని జన్మదినమైన కాల భైరవాష్టమి నాడు, శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం, లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని, గణపతిని పూజించిన తరువాత, షోడశోపచారాలతోనూ , అష్టోత్తరాలతోనూ, శ్రీ కాల భైరవ స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం చేస్తారు.

ఈ మార్గశిర అష్టమి, కాల భైరవ జన్మదినాన్ని పురస్కరించుకుని, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తారు. ఇలా కార భైరవాష్టమి నాడు, శ్రీ కాల భైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల, సకల పుణ్య ఫలాలూ కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల, స్వప్న భయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయి.

ఓం కాల భైరవాయ నమః!

Link: https://www.youtube.com/post/UgxRKdNIfFSJ88-l_pp4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes