స్నేహ బంధం! Definition Of A True Friend


స్నేహ బంధం!

సృష్టిలో మధురమైనది స్నేహం. తియ్యని స్నేహం ప్రేమకు ఆలవాలం, సంతృప్తికి నిలయం. కాఠిన్యానికి తావివ్వనిది స్నేహం. స్వార్థానికి చోటులేనిది స్నేహం. కపటం, నాటకం, దౌష్ట్యం, ద్రోహం, అబద్ధం, అపకారం లాంటివాటిని దరిచేరనీయనిది స్నేహం. సద్భావానికీ, సద్బుద్ధికీ స్థావరమది. త్యాగానికి ప్రతిరూపమది. స్నేహానికి ఎల్లలు లేవు, అవధులు లేవు, పరిమితులు లేవు.. స్నేహమొక స్రవంతి. అది ఆశలను చిగురింపజేస్తుంది. ఆశయాలను తలపింపజేస్తుంది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి : https://youtu.be/v5BseWhhnPM ]

జీవితంలో మంచి స్నేహితుడు దొరకడం కష్టం. ఒకసారి దొరికాక, చేజార్చుకోకుండా ఉండగలగడమే, మనం స్నేహానికిచ్చే నిజమైన విలువ. సజ్జనులతో చేసే స్నేహం, శుక్లపక్ష చంద్రుడి లాంటిది. దుర్జన స్నేహం, కృష్ణపక్షంలోని చంద్రుడిలా, క్షీణిస్తుంటుంది. అందుకే, యుక్తాయుక్త వివేచనతో స్నేహబంధం ఏర్పరచుకోవాలని, ఆర్యాసప్తశతికర్త సుందర పాండ్యుడెప్పుడో, ఉపదేశించాడు. చిన్నచిన్న విషయాలకు, మనసు చివుక్కుమనకుండా చూసుకోవాలి. స్వల్ప ప్రయోజనాలూ, స్వప్రయోజనాలకూ, ఆమడదూరంలో ఉండాలి. తగాదాల్లేకుండా జాగ్రత్తపడాలి. వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలి. విమర్శలతో, మనసు వికలం కాకుండా ఉండాలి.

తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లూ కావు. తీయగా మాట్లాడేవాళ్లూ, దగ్గరగా ఉండేవాళ్లూ, కులాసాగా నవ్వుతూ, కబుర్లాడేవాళ్లందరూ స్నేహితులు కారు. మనసునిండా ద్వేషం నింపుకుని, పైకిమాత్రం, సానుకూలంగా, సన్నిహితంగా కనిపించే వారెందరో ఉంటారు మన చుట్టూరా. మన ఎదుట పొగడుతూ, చాటుగా విమర్శించే వారుంటారు. నోటితో మాట్లాడుతూనే, నొసటితో వెక్కిరించేవాళ్ళు కోకొల్లలు. మేకవన్నెపులులు వారు.

సదుపదేశమందించేవారూ, కర్కశమనిపించినా శ్రేయోదాయకంగా మాట్లాడేవారూ, నిజాన్ని నిష్కర్షగా చెప్పేవారూ, నిజమైన స్నేహితులు. పాపపు పనులను చేయనీయకుండా, హితవు పలుకుతూ, సత్కార్యాల్లో పాల్గొనేలా చేస్తూ, రహస్యాలను అతి గోప్యంగా ఉంచుతూ, మంచి గుణాలనందరికీ తెలియజేస్తూ, ఆపద సమయాల్లో ఆదుకుంటూ, అవసరానికి ఆసరాగా ఉంటూ, ఎప్పటికప్పుడు సహాయపడుతూండేవారే సన్మిత్రులని, భర్తృహరి సలక్షణంగా వివరించారు.

రామాయణంలో శ్రీరామచంద్రుడంతటి వాడికి, సుగ్రీవుడూ, హనుమంతుడూ, మిత్రులుగా సహకరించారు. శ్రీకృష్ణుడూ, కుచేలుడూ బాల్యమిత్రులు. కాబట్టే, ఎన్నో ఏళ్ల తరవాత కలుసుకున్నా, కుచేలుణ్ని ఆదరించి, కౌగిలించుకుని, పాదాలు కడిగి, సింహాసనంపై కూర్చోబెట్టుకుని, సగౌరవంగా ఆత్మీయతను పంచాడు శ్రీకృష్ణుడు. కుచేలుడికి అఖండ సంపద చేకూర్చాడు. అదే స్నేహ భాగ్యం.

రారాజు సుయోధనుడు, కర్ణుడితో కుదిరిన స్నేహానికి చిహ్నంగా, అభిమాన పురస్సరంగా, అర్ధసింహాసన గౌరవం అందించాడు. స్నేహం విలువను పెంచాడు. రాజ్య సంరక్షణలో, చంద్రగుప్తుడికి చాణక్యుడూ, శ్రీకృష్ణదేవరాయలకు తిమ్మరుసూ, స్నేహితుల్లా వ్యవహరించారు. స్నేహబంధంలో, కష్టం ఇష్టం అవుతుంది. దుఃఖం, సుఖంగా పరిణమిస్తుంది. ఆపద, సంపదగా గోచరిస్తుంది. స్నేహం అనే రెండక్షరాల్లో, ఒకటి నీవు, మరొకటి నేనుగా ప్రకాశమానం కావాలి. ఒకరికోసం మరొకరుగా జీవించాలి. స్నేహభావం, దినదిన ప్రవర్ధమానం కావాలి. అది నీటిమీది రాతలా కాకుండా, శిలాశాసనంలా శాశ్వతంగా నిలవాలి. ఆ స్నేహబంధమే, మధురాతి మధురం!

Link: https://www.youtube.com/post/UgzeRHxtR3DYjBrXSX54AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes