శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి సంభవించిన విచిత్ర సంఘటనలు!
అహం సర్వస్య ప్రభవో, మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం, బుధా భావసమన్వితాః ।।
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి : https://youtu.be/-X6UbycGTdI ]
ముళ్ల దారిని పూల బాటగా మలుచుకుని, ఎన్ని ఇబ్బందులెదురైనా, మోముపై చిరునవ్వు చెదరనీయకుండా, తన ప్రక్కనున్న వారికి అండగా నిలుస్తూ, సహాయం అడిగిన వారికి అభయ హస్తం అందిస్తూ, యుగయుగాలకూ ఆదర్శ మూర్తిగా నిలిచాడు, శ్రీ కృష్ణ పరంధాముడు. ఆ లీలా మానుష రూపధారి జీవితం, నర్మ గర్భం అనేది సత్యం. కృష్ణుడి గురించి ఎన్ని ఎన్ని నిగూఢ సత్యాలు తెలుసుకున్నా, ఇంకా వేనవేలు మిగిలే ఉంటాయి. ఆయన చేసిన లీలలూ, ఆయన చూపిన మహిమలూ, అసంఖ్యాకం. ఈ విశాల విశ్వం గురించీ, నర్మ గర్భమైన శ్రీ కృష్ణుని జీవితం గురించీ, పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యమేనని, మన పెద్దలు చెబుతారు. భగవద్గీతలో, శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు.. ‘నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో, నాలోనే విలీనమై, మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్నీ నేనే. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడినీ, ఆశ్రయాన్నీ, బీజాన్నీ, శరణునొసగేవాడినీ, సాక్షినీ, సృష్టి స్థితి లయ కారకుడనూ, సత్‌స్వరూపుడనూ, అమృతుడనూ నేనే’. ముందు చెప్పిన శ్లోకంలో శ్రీ కృష్ణుడు, ‘అహం సర్వస్య ప్రభవో’ అనటంతో ప్రారంభిస్తున్నాడు. అంటే "నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమునూ, మరియు సర్వ కారణ కారణమునూ" అని. అటువంటి అవతారపురుషుడైన శ్రీ కృష్ణ పరమాత్ముడు, కన్నయ్యగా అవతరించిన ఆ నిశి రాత్రిలో చోటుజేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..
శ్రావణమాసం బహుళ పక్షంలో, ప్రజాపతి నక్షత్రమైన రోహిణి నక్షత్రంలో, అర్థరాత్రి వేళ, అష్టమి తిథి నాడు జన్మించాడు, శ్రీ కృష్ణ పరంధాముడు. ఆ భగవానుడు, దేవకి గర్భాన ఎనిమదవ సంతానంగా, మేనమామైన కంసుని చెరసాలలో జన్మించినప్పుడు, అక్కడున్న వారితోపాటు, కాపలాదారులందరూ, యోగ మాయ ప్రభావం కారణంచేత, గాఢ నిద్రలోకి వెళ్లి పోయారు. వసుదేవుడు చిన్ని కృష్ణయ్యను బయటకు తీసుకురావడానికి, చెరసాల తలుపులు కూడా, వాటంతటవే తెరుచుకున్నాయి. ఆ పరమాత్ముడు, రాక్షస సంహారం కోసం, మానవ అవతారమెత్తిన సమయంలో, కుంభ వృష్ఠిగా వర్షం కురిసింది. ఆ వర్షంలోనే, వసుదేవుడు, ఓ బుట్టలో చిన్ని కృష్ణయ్యను పడుకోబెట్టుకుని, మధుర నుంచి, రేపల్లెకు బయలుదేరాడు. భారీ వర్షాల కారణంగా, రేపల్లె దగ్గరున్న యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ, ఉగ్రరూపం దాల్చివుంది.
వసుదేవుడు, బుట్టలో కన్నయ్యను తీసుకుని, యమునా నదీ తీరానికి చేరుకోగానే, అక్కడొక అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు, చిన్ని కృష్ణయ్య పాద స్పర్శకు పులకించి, దారి ఏర్పరచింది. రెండు భాగాలుగా విడిపోయి, యమునా నది మధ్యలో ఏర్పడ్డ మార్గంలో ప్రయాణించి, వసుదేవుడు గోకులాన్ని చేరుకున్నాడు. అప్పటికే, గోకులంలోని నందుడి భార్య యశోద, ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను వసుదేవుడు తీసుకుని, చిన్ని కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి వెళ్లాడు. అయితే, నందుడికి ఈ విషయం అంతా తెలుసు. తన భార్యైన యశోద, కూతురుకి జన్మనిచ్చినప్పుడే.., వసుదేవుడు చిన్ని కృష్ణుడిని తీసుకువస్తున్నాడనీ, ఆ బాలుడిని తన ఇంట ఉంచి, తనకు పుట్టిన పాపను అతనితో పంపించాలనీ, తలుపు దగ్గరే నిలబడి వేచి వున్నాడు. వసుదేవుడు వచ్చిన తరువాత, తన భార్య దగ్గర కన్నయ్యను ఉంచి, తన పాపను అతనితో పంపించాడు. అయితే, తరువాత ఈ సంఘటన ఎవ్వరికీ గుర్తులేదు. యోగమాయ కారణంగా, నందుడు తన కూతురుని వసుదేవునికిచ్చిన సంగతీ, దేవకీ దేవి జన్మనిచ్చిన కన్నయ్య, తన ఇంటికి చేరాడన్న సంగతీ, మరచిపోయాడు.
అలా కన్నయ్య, దేవకి తనయుడి నుంచి, యశోద సుతుడిగా మారాడు. నందుడి ఇంట్లో, చిన్ని కృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరం, వసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా, మధురా నగరంలో ఉన్న కంసుడి చెరసాలకు, చేరుకున్నాడు. దేవకి ప్రక్కకు చేరుకున్న వెంటనే, ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది. దాంతో, అక్కడున్న భటులు, దేవకి తన అష్టమ సంతానానికి జన్మనిచ్చిందన్న విషయాన్ని, కంసునికి చేరవేశారు. విషయం తెలుసుకున్న కంసుడు, హుటా హుటిన అక్కడకు చేరుకుని, దేవకి పొత్తిళ్లలో ఉన్న ఆ పసికందుని చేతుల్లోకి తీసుకుని చంపబోతుండగా, ఆ శిశువు అకస్మాత్తుగా గాలిలో పైకి లేచి, ‘నిన్ను తుదముట్టించే నీ చెల్లెలి అష్టమ గర్భం, వేరోక చోట క్షేమంగా పెరుగుతోంది. నీ మరణం అతని చేతిలో తథ్యం’ అని, తన దైవిక రూపాన్ని ప్రదర్శించి, కంసుడికి తన మరణం గురించి తెలియజేసి, అంతర్ధానమైపోయింది.
అనంతరం, యశోద గర్భాన జన్మించిన ఆ పాపే, దేవతా మూర్తిగా, వింధ్యాచల దేవిగా, వింధ్యాచల పర్వతాలపై వెలసి, భక్తులచేత పూజింపబడుతోంది. కృష్ణయ్య జన్మించిన రాత్రి, అందరూ గాఢ నిద్రలో ఉండడం, చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకోవడం, ఉవ్వెత్తున పారుతున్న యమునా నది, రెండుగా విడిపోయి దారివ్వడం, కన్నయ్య రాక కోసం, గోకులంలో నందుడు ఎదురుచూడడం, యశోద కూతురుని వసుదేవుడు, దేవకి చెంతకు చేర్చడం, ఈ విషయాలన్నింటినీ, వసుదేవుడూ, నందుడూ మరచిపోవడం, ఇవన్నీ ఆ భగవంతుడి లీలలే. ‘కృష్ణ’ అంటే మాయ అనే అర్థం అందరికీ తెలుసు. ఆ కృష్ణపరమాత్ముడు తన లీలలను, పుట్టినప్పటి నుండీ చూపిస్తూనే ఉన్నాడడానికి, ఈ సంఘటనలే సాక్ష్యాలు. కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment