తిరుప్పావై గోదాదేవి 18వ పాశురం!


తిరుప్పావై గోదాదేవి 30 పాశురాలలో..

పద్దెనిమిదవ రోజు అనగా 02.01.2021 శనివారము..

18వ రోజు - అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించడం..

ఆండాళ్ తిరువడిగలే శరణం

గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు. అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు. తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో.

పాశురము:

    ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్

    నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!

    కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్;

    వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి

    ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్;

    పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ,

    చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప

    వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్,

తాత్పర్యము:

నంద గోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్ధించినను వారు తెరువకపోవుటచేత, మదజలము స్రవించుచున్న ఏనుగువంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములుగల నందగోపుని యొక్క కోడలా! ఓ నప్పిన్న పిరాట్టీ! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మా! కోళ్లు వచ్చి కూయుచున్నవి.

జాజి పందిళ్లమీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా! నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునేయుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే! కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా!' అని గోపాంగనలు నీళాదేవి నీ పాశురంలో మేల్కొల్పుచున్నారు.

అవతారిక:

శ్రీ నందగోపులను, శ్రీ యశోదాదేవిని, శ్రీకృష్ణుని, శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగ పూర్తియగునట్లు చేయుడని వేడిరి. ఐననూ లేవకుండుట జూచి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్నపిరాట్టిని (నీలాదేవిని) నందగోపుని కోడలును మేల్కొలుపుచున్నారు.

పురుషకారముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది. వాయసము, విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది. సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణఖ సంహరింపబడింది. పెరుమాళ్ళను విడచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు. విభీషణుడు ఇద్దరినీ ఆశ్రయించి తరించాడు. అందువల్ల పురుషకారమైన నీళాదేవిని ప్రార్ధించి, మేల్కొల్పి ద్వారమును తెరువుమని ప్రార్ధించుచున్నారు. శ్రీకృష్ణుని దర్శింపజేయుమని వేడుకొంటున్నది మన గోదాదేవి.

(సావేరిరాగము - ఏకతాళము)

ప.. మదగజ బలశాలి, శత్రు మద మణచే ధీశాలి

      నందగోవునికి కోడల! నప్పిన్నా! మేలుకో!

అ.ప. గంధిల కుంతల తరుణీ! కోళ్ళు కూయుచున్నవదే

          మధుర కూజితములు సేయు పిక గణముల గనవటే!

చ. నీ పతి శ్రీకృష్ణుని తిరు నామములను పాడిపాడి

      మా పాటల విభుని మేలుకొలుపగ నిట వచ్చినాము

      ఈ పదముల సంతసించి శ్రీ కంకణములు మ్రోయగ

      నీ పద్మకరాల గడియల నికనైనను తీయరావె!

      మదగజ బలశాలి, శత్రు మద మణచే ధీశాలి

      నందగోపునికి, కోడల! నప్పిన్నా! మేలుకో.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..

Link: https://www.youtube.com/post/Ugxmyp76cyqZhw_izNl4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes