భగవంతుడితో అనుబంధం ఎలా ఉండాలి? How should we be attached to god!


భగవంతుడితో అనుబంధం ఎలా ఉండాలి?

ఆ తండ్రితో, మనలో చాలామందికి వ్యాపార బంధమే తప్ప, ప్రేమానుబంధం లేదు.. సాధారణంగా మన మొక్కులన్నీ, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే సాగుతుంటాయి. ‘నా ఫలానా కోరిక తీరిస్తే, నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను.. ఫలానా కానుకలిస్తాను.. ఫలానా పూజలు చేయిస్తాను..’ మనలో చాలామంది చేసే దైవ వ్యవహారాలు ఇలాగే ఉంటాయి..

[ సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి? శుక్ర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/2UA7CE0A80E ]

నవవిధ భక్తులనే తొమ్మిదిరకాల అనుబంధానికి, భగవంతుడి దగ్గర ఆస్కారం ఉంది. వాటిలో ఏ ఒక్క అనుబంధం దృఢంగా ఉన్నా, ఆయన మనల్ని వదలడు.. అలా కాకపోతే, మనకు ఆయన దొరకడు. భగవంతుడు సర్వేశ్వరుడనే విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు.. మనం చేసే యాంత్రిక పూజలూ, వాటంతటవే అక్కరకు రావు.. దైవాన్ని తండ్రిగా ఆరాధిస్తే, మనం ఒక మంచి బిడ్డగా జీవించాలి.. ఆయన్ను ఏ రూపంలో ఆరాధించినా, ఈ పద్ధతి పాటించాలి.. శ్రీరామ పాదసేవకుడిగా ఉన్న ఆంజనేయుడు, 'భక్తుడిగానూ, దేవుడిగానూ' పూజలందు కుంటున్నాడు.

మధుర సంకీర్తనలతో అన్నమయ్యా, త్యాగయ్యలు, దైవాన్ని మెప్పించి, తమ సన్నిధికి రప్పించుకున్నారు.. తులసీదాసు తన ‘రామచరిత మానస్‌’ ద్వారా, శ్రీరాముడి మనస్సును దోచాడు. మూఢ భక్తితో, కన్నప్ప తన రెండు కళ్లనూ శివుడికి సమర్పించి, దివ్య సాక్షాత్కారం పొందాడు. తన శరీరంలోని భాగాలనే రుద్రవీణగా చేసి, రావణబ్రహ్మ ముక్కంటిని మెప్పించాడు..

సుదీర్ఘమైన కాల ప్రవాహంలో, ఎందరో భక్తులు పూజా పుష్పాల్లా తేలియాడి, పరమాత్మలో లయించి పోయారు. వారు ఇప్పుడు లేకపోయినా, వారి గాథలు శిలాక్షరాల్లా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ గాథలన్నీ, భగవంతుడితో మన అనుబంధం ఎలా ఉండాలో చెబుతాయి. నిత్యమూ లక్షల సంఖ్యలో ప్రజలు దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు. భగవంతుడికి వారు ఏమి ఇస్తున్నారు? ఏమి తీసుకెళ్తున్నారు? కోరికల జాబితా ఇస్తున్నారు.. తమ కోరికలు తప్పక నెరవేరతాయనే గట్టి నమ్మకాన్ని వెంట తీసుకువెళ్తున్నారు.. దీన్ని దైవంతో అనుబంధమని ఎలా చెప్పగలం? ప్రాపంచిక బంధాలనే సంకెళ్లతో, మనం భగవంతుడి ఎదుట నిలబడుతున్నాం. భక్తి పూర్వకంగానే అనుకుంటూ, కనులు మూసి చేతులు జోడిస్తున్నాం.. మనసు మెల్లిగా కోరికల జాబితా విప్పుతుంటుంది.. దేవుడు మాట మాటకూ, ప్రతి భక్తుడి బూటక భక్తికీ నవ్వలేక, శిలాదరహాసం చేస్తుంటాడు. ఆ మందహాస మర్మం, మన మనోనేత్రం తెరుచుకొనిదే మనకు అర్థంకాదు..

ఈ భ్రమా భరిత భక్తినాటకం నుంచి మనం బయటపడాలి. నిలువు దోపిడి ఇచ్చినట్లు, మనసునంతా ఖాళీ చేసి, ఆయన పాదాలముందు గుమ్మరించాలి. కోరికలన్నీ శూన్యం చేసుకున్నట్లు, నీలాలు లేని తలతో నిలబడినట్లు, ఆయన ఎదుట నిస్సహాయుడిగా, ‘నీవే దిక్కు తండ్రీ’ అన్నట్లు, చేతులు జోడించి నిలబడిపోవాలి. మనం దైవానుగ్రహం కోసం ఎంతగా నిరీక్షిస్తామో, భగవంతుడు మంచి భక్తుడి కోసం, అలాగే ఎదురుచూస్తాడు.. పరిపక్వత చెందిన మనస్సే ఫలంగా, కోరికలు లేని సమర్పణా భావాలు సుగంధ పుష్పాలుగా, సర్వలోక క్షేమమే మహత్వాకాంక్షగా, నిర్మల నివేదనగా సమర్పించాలి.. అలా, అతికొద్దిమంది మాత్రమే చేయగలరు. ఆ కొద్దిమందిలో మనం ఎందుకుండ కూడదు? తిరుమలలో ఒక గదినుంచి మరో గదికి వెళ్తూ, చివరికి స్వామి దివ్య సన్నిధికి చేరుకుంటాం.. మన మనస్సు అనుక్షణమూ, అన్నమయ్య ఆర్తిని అనుభవిస్తూ, దైవంతో అనుబంధానికి తపించాలి.. వెన్న తినే వేలుపు ఆయన.. వెంటనే మన ఆర్తికి కరిగిపోతాడు.. తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినట్లు భావించి, ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు.. అదే అసలైన అనుబంధం..

Link: https://www.youtube.com/post/UgzYHCTe6U7eW3tIq8B4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes