ఆయన కీర్తన మధురం, ఆయన గానం మధురాతి మధురం. ‘నమో నమో రాఘవా’ అనే కీర్తనను స్వరపరచిన కలియుగ తుంబురుడాయన. 96 కోట్ల శ్రీరామ నామములు జపించిన మరో మారుతి ఆయన. త్రేతాయుగ పురుషుడ్ని, తన కీర్తనామృతాలతో, కలియుగంలో భువికి రప్పించిన గాన గంధర్వుడాయన. ఈ భరత భూమిపై పుట్టిన వాగ్గేయకారులలో మణిమకుటం ఆయన. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు.. అంటూ, తన మదిలో కొలువైన శ్రీరామ రూపాన్ని అందరిచేతా దర్శింపజేసిన మహా రామ భక్తుడు. ఆయనే, కలియుగ సరస్వతీ పుత్రుడు త్యాగరాజ స్వామి. కర్ణాటక సంగీతంతో, రామ నామానికి ప్రత్యేక అందం తెచ్చిన కవి పుంగవులు త్యాగరాజులవారు. ఆ కృతి కర్త పరమపదించిన రోజైన పుష్యబహుళ పంచమి నాడు, ఆరాధనోత్సవాలు నేటికీ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అసలు ఈ త్యాగరాజు ఎవరు? ఆయన మరణించిన రోజున, ఆరాధనోత్సవాలు ఎందుకు జరుపుతున్నారు? చాలా తక్కువ మందికి తెలిసిన ఆయన ఘన చరిత్ర ఏమిటి? అనే విషయాలు, ఈ రోజు తెలుసుకుందాం..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/DulRmWf1OLU ]
త్యాగయ్య, తమిళనాడులోని తిరువయ్యారులో, చైత్ర శుక్ల సప్తమి నాడు, అనగా, 1767 మే 4 న పుట్టినట్లు అధిక శాతం మంది చెబుతుంటే, కొంతమంది మాత్రం, ఆయన 1759 లో పుట్టారని అంటారు. ఆయన కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మల మూడవ సంతానం. ఆయన అసలు పేరు, కాకర్ల త్యాగ బ్రహ్మం. అయితే, వీరి పూర్వీకులు, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన వారని కొంతమంది చెబితే, కాదు, ప్రకాశం జిల్లా వారని, మరికొంత మంది వాదిస్తున్నారు. అయితే, వీరి కుటుంబం, 1600 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ నుంచి, తంజావూరుకు వలస వెళ్లినట్లు, చరిత్ర కారులు చెబుతున్నారు. వైదిక బ్రహ్మణ కుటుంబంలో పుట్టడం, తండ్రి రామ బ్రహ్మంకు రామాయణ, భారత, భాగవతాలపై పూర్తి పట్టుండడం, వేదాలను అవపోసన పట్టడం వలన, త్యాగయ్యకు చిన్నతనం నుంచే, సనాతన ధర్మంపై ఎనలేని మక్కువ కలిగింది. పైగా త్యాగయ్య తల్లి సీతమ్మకి, రాముని పట్ల అమిత భక్తి భావం కలిగి ఉండడం, ఆవిడ గాయని కావడం చేత, రామదాసు కీర్తనలనూ, పురందర దాసు కీర్తనలనూ అభ్యసించడం వల్ల, ఆయనలో చిన్నతనంనుండే, రామ భక్తి బీజం బలంగా పడింది. అయితే, ఆయన మొదట సంగీత పాఠాలు, ప్రముఖ కవీ, సంగీత విద్వాంసుడూ, సంస్కృత పండితుడూ అయిన ‘గిరిరాజ బ్రహ్మం’ గారి వద్ద నేర్చుకున్నారు. ఆయన స్వయానా, త్యాగయ్యకు తాతగారు.
తండ్రి మరణాంతరం, తన వాటాగా వచ్చిన శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను, తన ఇంట్లో కొలువుంచుకుని, వాటిని అమిత భక్తితో పూజించేవారు త్యాగయ్య. నాదోపాసనే, భగవంతుడ్ని ప్రసన్నం చేస్తుందని నమ్మి, అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, పాడిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలలో అధిక శాతం, రాముని గురించి వ్రాసినవే. అవి రామునిపై ఆయనకు గల భక్తి ఎంతటిదో తెలియ పరుస్తాయి. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలలో పాడిన పాటల వల్ల, సాక్ష్యాత్ ఆ భగవంతుని కృప పొందారని ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఒకానొక సమయంలో, త్యాగయ్య ఎంతగానో కొలిచే రామచంద్రుని పూజా విగ్రహాలు కనపడకపోవడంతో, అవి మళ్లీ తన వద్దకు తిరిగి రావాలని, ‘ఎందు దాగినావో’ అని ఆయన ఆలపించిన కీర్తనకు, పోయిన విగ్రహాలు, వాటంతట అవే, మళ్లీ ఆయన వద్దకు వచ్చాయట. మరొకసారి, తిరుపతి వేంకటేశుని దర్శనానికై వెళ్లిన సమయంలో, స్వామి వారికి అడ్డంగా తెరలు వేసి ఉన్నాయట. అప్పుడు ఆ కొండలరాయుని దర్శన భాగ్యం కలగాలని భావించి, ‘తెర తీయుగ రాదా’ అని పాడిన పాటకు, అక్కడున్న తెరలు వాటంతట అవే తొలగిపోయి, సాక్ష్యాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవ సాక్ష్యాత్కారం లభించిందట. ఆయన దర్శనానికి మిక్కిలి ఆనందపడిన త్యాగరాజులవారు వెంటనే, ‘వేంకటేశా నిను సేవింప’ అనే పాటను పాడారు. ఇలా ఎన్నో సంఘటనలు ఆయన జీవితంలో జరిగినట్లు, చరిత్ర కారులు చెబుతున్నారు.
ఆయన పాటల పూలవానలో, ఎంతోమంది భక్తులూ, వాగ్గేయకారులూ, సంగీత కళాకారులూ తడిసి ముద్దై, త్యాగయ్య భక్తులుగా, శిష్యులుగా మారిపోయారు. త్యాగరాజులవారు ఆంధ్ర వాగ్గేయ కారుడిగానే కాకుండా, కర్ణాటక సంగీత త్రయంలో, అతి ముఖ్యుడిగా కీర్తి గడించారు. ఆయన జీవితంలో, 24 వేల రచనలను చేశారు. వాటిలో పంచరత్న కృతులూ, దివ్యనామ సంకీర్తనలూ, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలూ, ముఖ్యమని చెప్పుకోవాలి. అంతేకాదు, ప్రహ్లాద భక్తి విజయమూ, నౌకా చరిత్రమూ అనే సంగీత నాటకములు కూడా రచించారు. ఆయన రచనలలో, పంచరత్న కృతులు, వాగ్గేయకారులకు మరో వేదమని చెప్పవచ్చు. ఎన్ని చేసినా, కట్టె పుట్టిన తర్వాత, కాలక మానదు. అలాగే, ఈ సర్వగుణ సంపన్న సంగీత చక్రవర్తి, పుష్య బహుళ పంచమి, జనవరి 6, 1847 లో స్వర్గస్తులయ్యారు. ఆయన మరణాంతరం, భౌతిక కాయాన్ని, తిరువయ్యారులోని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి, ఆయనకు సమాధి నిర్మించారు. అయితే, 1903 ముందువరకు, త్యాగరాజుల వారి శిష్యులూ, భక్తులూ, ఆయన వర్ధంతిని వాళ్ల ఇళ్లలోనే జరుపుకునే వారు. 1903 లో, త్యాగరాజుల వారి శిష్యులలో ముఖ్యులైన ప్రముఖ సంగీత విద్వాంసులు, ‘ఉమయాల్పురం కృష్ణ భాగవతార్’, ‘సుందర భాగవతార్లు’, వారి గురువు గారి సమాధిని దర్శించడానికి తిరువయ్యారు వచ్చేటప్పటికి, ఆయన స్మారక నిర్మాణం మొత్తం, శిథిలావస్థకు చేరుకుని ఉండింది. తమకు సంగీత జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు గారి స్మారక నిర్మాణాన్ని, ఆ స్థితిలో చూసి చలించి పోయారు. అప్పటికప్పుడు, ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణ చేసి, ఆ ఏడు నుంచీ, ప్రతీ సంవత్సరం, త్యాగరాజులవారి వర్ధంతిని, అక్కడే జరపాలని నిశ్చయించారు.
1904 లో, సంగీతంలోని ఉద్ధండ పండితులంతా, ఆయన వర్ధంతి రోజున, తిరువయ్యారులోని త్యాగరాజుల వారి సమాధి వద్ద, ఆరాధనోత్సవాలు జరపాలని నిశ్చయించుకుని, 1905 నుంచి, ఘనంగా ఆరాధనోత్సవాలు జరపడంతో పాటు, పేదవారికి పెద్ద ఎత్తున అన్నదానం, వేద సంప్రదాయం ప్రకారం పూజలు, ఘనంగా జరపడం మొదలుపెట్టారు. ఆ సంవత్సరం జరిగిన ఉత్సవాలకు, ‘తిలైస్థానం నరసింహ భాగవతార్’, ‘తిలైస్థానం పంజు భాగవతార్’ అనే సోదరులు, నిర్వహకులుగా, ఆర్థిక సలహాదారులుగా ఉన్నారు. అయితే, ఆ మరుసటి సంవత్సరంలో, అన్నదమ్ముల మధ్య వచ్చిన విభేదాల వల్ల, వారిద్దరూ, వేరువేరుగా ఆరాధనోత్సవాలు జరపడం మొదలుపెట్టారు. వీరికి తోడు వచ్చిన వారు, చెరో ప్రక్క చేరి, రెండు వైరి వర్గాలుగా మారారు. పెద్దవాడైన నరసింహ భాగవతార్ నిర్వహించే ఆరాధనను, ‘పెరియకచ్చి’, చిన్నవాడైన పంజు భాగవతార్ నిర్వహించే ఆరాధనను, ‘చిన్న కచ్చి’ అనే పేర్లతో పిలిచేవారు. అది అలా కొన్ని సంవత్సరాల పాటు సాగింది. అప్పట్లో గృహస్తులైన స్త్రీలకు, త్యాగరాజులవారి సమాధి వద్ద నృత్యం చేసే అవకాశం ఉండేది కాదు. కేవలం, దేవదాసీలకు మాత్రమే ఆ అవకాశం ఉండేది. అందువల్ల, త్యాగరాజులవారికి మహాభక్తురాలైన, బెంగుళూరుకు చెందిన నాగరత్నమ్మ అనే దేవదాసీ స్త్రీ, అక్కడ నృత్యం చెయ్యడంతో పాటు, హరికథలు కూడా చెప్పేది. ఆమె వద్ద చాలా సంపద ఉండడం, ఆమె వయస్సుపైబడడం, ఆమెకు సంతానం లేకపోవడం వల్ల, తన వద్దనున్న పూర్తి సంపదనుపయోగించి, 1925 లో ఆలయ నిర్మాణం ప్రారంభించగా, అది 1926 వ సంవత్సరంలో పూర్తయింది.
అయితే, ఆ సమయంలో నాగరత్నమ్మకూ, అక్కడ ముందు నుంచి ఉన్న రెండు వైరి వర్గాల వారికీ గొడవలు రావడం వల్ల, గుడివద్ద ఆరాధనలపై పూర్తి హక్కుల కొరకు, ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆమెకు మద్దతుగా మరో వర్గం వారు చేరడంతో, అక్కడ మూడు వర్గాల పోరు మొదలైంది. అయితే, కోర్టు ఎవరికీ పూర్తి హక్కులివ్వకుండా, మూడు వర్గాల వారినీ, అక్కడ ఆరాధనలు చేసుకోవల్సిందిగా ఆదేశాలిచ్చింది. అప్పటి నుండి, ఏ వర్గానికి ఆ వర్గం వారు, తమకు నచ్చిన త్యాగరాజ కీర్తనలు పాడుకునే వారు. అయితే, 1941 లో, యస్. వై. కృష్ణ స్వామి, అన్ని వర్గాల వారినీ ఏకం చేసి, నేడు జరుగుతున్న ఆరాధనోత్సవ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలోనే, బృందగానానికి వన్నె తెచ్చే త్యాగరాజుల వారి పంచరత్న కీర్తనలను ఆలపించేలా చేశారు. ఆ విధంగా, నేటికీ త్యాగరాజుల వారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరగడమే కాకుండా, పంచరత్న కీర్తనలు పాడడం, సంప్రదాయంగా మారింది. అలా నేడు దేశ విదేశాలకు చెందిన సుప్రసిద్ధ వాగ్గేయకారులూ, సంగీత విద్వాంసులూ, వేల సంఖ్యలో తరలి వచ్చి, త్యాగరాజులవారి కీర్తనలు ఆలపిస్తున్నారు. ఈ ఆరాధనోత్సవాలు, అత్యంత సుందరంగానే కాకుండా, భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క ఘన వైభవాన్ని చాటి చెబుతాయి.
Link: https://www.youtube.com/post/Ugy6OF8QjoVZG5Ixu4R4AaABCQ
Post a Comment