ఈ రోజుటినుంచి, అనగా, 21/09/2021 నుంచి, 'మహాలయ పక్షాలు' ప్రారంభం..
మనది కర్మ భూమి. ఈ కర్మ భూమిలో, అనేక మంది మంచి పనులు చేసి, భగవంతుని అనుగ్రహం పొందారు. అలాంటి కర్మలను మనం చాలా విస్మరిస్తున్నాము. 'పితృ కర్మలు' అనగా, ఆబ్దీకములు (శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలి పెట్టడము, అంటే, చేయకపోవడం వలన, మన యొక్క వంశాన్నీ, మన పిల్లలనీ, మనల్ని కూడా, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.
[ మరణించిన తరువాత కర్ణుడు తిరిగి భూమిపైకి ఎందుకు పంపబడ్డాడు? = https://youtu.be/vfBBesZcTbw ]
నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మానవులు, తమ పితృ దేవతలను ఉద్దేసించి చేసే కర్మ, 'శ్రాద్ధ కర్మ'. శ్రాద్ధ కర్మ అంటే, శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేసించి, శాస్త్రోక్తమైన కాలమందునూ, దేశమందునూ, పక్వాన్నము గానీ (భొక్తలకు భోజనము), యామాన్నము గానీ (బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులూ మొదలగునవి), హిరణ్యము (బంగారము) గానీ, విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయటం, శ్రాద్ధమనబడుతుంది.
పితృ దేవతలను ఉద్దేసించి, మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు, ఏ రూపముగా ఇచ్చినా వారికి చేరతాయి.
మనము శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు, పితృ దేవతలు వాయురూపంలో అతి త్వరగా వచ్చి, భోజనము భుజిస్తారు. అందుచేత, శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేసేటప్పుడు, సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని, కథ ఉంది.
మహాలయపక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత, పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకూ, ఊర్ధ్వరశ్మి నుండి, పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి, శ్రద్దతో అర్పించేదే, శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక, దాని సూక్ష్మాతి సూక్ష అంశం, అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం, చాలా కష్టం. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం, సంతానానికి తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే, పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ, మనోమయ రూపంలో, శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా, వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు.
మహాలయ పక్షం రోజుల్లో, వారసులు వదిలే తర్పణాలు, పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృ దేవతల ఆశీర్వాదం, వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో, ఇతర శుభకార్యాలేవీ ఆరంభం చేయకూడదు.
సర్వేజనాః సుఖినోభవంతు!
Post a Comment