అసంపూర్ణ పట్టణంగా ప్రఖ్యాతి గాంచిన ‘భోజ్ పూర్ శివాలయం వెనుక వున్న రహస్యం!’
కర్మభూమైన మన భారతదేశంలో, శివాలయాలు అడుగడుగునా గోచరిస్తాయి. అయితే, వాటిలో కొన్ని, అతి పెద్ద శివలింగాలతో, భక్తులచే పూజలందుకుంటున్నాయి. చాలా మందికి తెలియని, అతి పెద్ద శివలింగం కలిగిన ఆలయం, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. భోజ్ పూర్ ప్రాంతంలో నిర్మింపబడిన ఈ ఆలయం, మొండిగోడలతో మిగిలిపోయిన, అతి పెద్ద ఆలయంగా ప్రఖ్యాతి గాంచింది. అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆ శివాలయం వెనుక దాగిన గాధేంటి? ఈ ఆలయం నెలకొని ఉన్న ప్రాంత విశేషాలేంటి? అనే విషయాలు ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/t3cFqc6xfJQ ]
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి, 28 కిలో మీటర్ల దూరంలో, బేత్వానది నది ఒడ్డున వున్న గ్రామం, భోజ్ పూర్. 10వ శతాబ్దంలో, ఈ ప్రాంతాన్ని పాలించిన పరమార వంశీయుడైన భోజ రాజు పేరు మీద, ఈ ఊరుకి భోజపూర్ అనే పేరొచ్చింది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, అతి పురాతనమైన పట్టణం కూడా. చాలా మటుకు పురాతన నగరాలు, కాలగమనంలో కనుమరుగవ్వడం, మనం గమనించవచ్చు. కానీ, భోజ్ పూర్ పట్టణం, అందులోని నిర్మాణాలూ, నేటికీ పూర్తికాకుండా, అసంపూర్తిగా ఉండడం గమనార్హం. ఇక్కడున్న ప్రదేశాలలో, ముఖ్యంగా చెప్పుకోవలసినవి, ఆలయాలూ, ఆనకట్టలు. 11 వ శతాబ్దంలో, బేత్వానది ప్రవాహాన్ని మళ్ళించటానికి, ఇక్కడ రెండు ఆనకట్టలు కట్టి, పెద్ద సరస్సును నిర్మించారు. తరువాతి కాలంలో, దాడుల ప్రభావంగా, ఒక ఆనకట్ట పూర్తిగా ధ్వంసమైంది. రెండవదాని శిథిలాలు, నేటికీ మనం చూడవచ్చు. చుట్టూ అందమైన ప్రకృతితో, శిథిలావస్థకు చేరుకున్న ఈ భోజ్‌పూర్ లో చెప్పుకోదగ్గ మరో అంశం, భోజేశ్వర ఆలయం. ఇది భోజరాజు నిర్మింపజేసిన, ప్రఖ్యాతి చెందిన శివాలయం.
18 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల చుట్టుకొలతతో వున్న అతి ఈ పెద్ద శివ లింగం, ఒకే రాతిలో చెక్కబడి ఉంది. ఎత్తైన స్తంభాలతో, అందమైన శిల్పాలతో, పురాతత్వ, చారిత్రక శాస్తవ్రేత్తలను సైతం అబ్బురపరిచే విధంగా ఉంటుంది, ఈ ఆలయం. ప్రస్తుతం ఈ నిర్మాణం, Archaeological Survey of India సంరక్షణలో ఉంది. 106 అడుగుల పొడవు, 77 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తయిన పీఠం మీద, ఈ ఆలయం నిర్మింపబడడంతో, కొన్ని కిలోమీటర్ల దూరం నుండి కూడా, చాలా చక్కగా కనిపిస్తుంది. మాల్వా వంశీకుల ఏలుబడిలో, విశ్వఖ్యాతి పొందిన ఈ ఆలయం, ఆనాటి శిల్పకళా వైభవానికీ, చారిత్రక సత్యానికీ ప్రతీక. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నేటికీ ఆలయ నిర్మాణం పూర్తికాకుండా, అసంపూర్తిగానే మిగిలి ఉంది. ఈ ఆలయం పూర్తి కాకపోవడానికి కారణం, కళ్యాణీ, గుజరాత్ చాళుక్యులూ, కాలాచూరి వంశస్ధులైన లక్ష్మి-కర్ణలతో కలిసి, భోజరాజు రాజ్యంపై దండెత్తగా, వారి మధ్య జరిగిన భీకర పోరులో, భోజరాజు చనిపోయాడు. దాంతో, ఈ ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.
గర్భగుడి నిర్మాణం, 80 శాతం వరకు పూర్తయింది. గర్భగుడికి నాలుగు వైపులా ఉన్న అత్యంత బలిష్ఠమైన పెద్ద స్తంభాలమీద, రాళ్ళతో కప్పు వేశారు. బయట గోడలూ, మిగతా ఆలయం, నేటికీ నిర్మింపబడలేదు. రాతి దూలాలతో నిర్మింపబడ్డ దర్వాజా, 10 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు వుంటుంది. గర్భగుడిలో 7 మీటర్ల ఎత్తున్న ఇసుకరాతి పీఠం మీద, అత్యున్నతమైన శివలింగం దర్శనమిస్తుంది. శివలింగం దగ్గర పూజ చెయ్యటానికి వీలుగా, ఇనుప నిచ్చెన ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం, పై కప్పుమీదనుంచి, ఒక పెద్ద రాయి శివలింగం యొక్క యోనివట్టంమీద పడి, అది రెండుగా పగిలింది. తరువాత కొంత కాలానికి, పానవట్టం మీద పగుళ్లు కనిపించకుండా అతికించి, పై కప్పు కూడా పూర్వపు నమూనాతో తిరిగి నిర్మించారు. వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మింపబడిన ఈ ఆలయానికి, ప్రవేశంలో పెద్ద Arch వున్నది. Arch వున్న ప్రథమ ఆలయం ఇదేనని, కొంతమంది అభిప్రాయం. ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా, గంగా, యమునల విగ్రహాలున్నాయి.
లోపలున్న స్తంభాల మీద, ఉమా మహేశ్వరులూ, లక్ష్మీ నారాయణులూ, బ్రహ్మా, సరస్వతీ, సీతారాముల విగ్రహాలు, చాలా అందంగా మలచబడ్డాయి. ఇక్కడి వారి నమ్మకం ప్రకారం, ఈ ఆలయం వెనుక ఒక ఇతిహాస గాథ దాగి ఉంది. పాండవులు, తమ తల్లి కుంతీదేవి వూజ చేసుకోవటం కోసం, ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు. అక్కడివారి కథనం ప్రకారం, కుంతీదేవి శివ భక్తురాలు. నిత్యం శివాభిషేకాలూ, పూజలూ చేస్తూ వుండేది. పురాణ కాలం నాటి మనుషులు చాలా ఎత్తుగా వుండేవారని, కొన్ని అధారాల ద్వారా అవగతమవుతోంది. అదేవిధంగా, కుంతీ దేవి ఎత్తు కూడా, 25 అడుగులనీ, ఆవిడ గర్భగుడిలో నేలమీద నుంచుని, ఆ విగ్రహానికి అభిషేకం చేసేదనీ, ఆనాటి కాలంలో వారికి తగ్గట్టుగానే, ఈ ఆలయాన్ని నిర్మింపజేశారనీ, కొంతమంది అభిప్రాయం. భోజేశ్వర్ దేవాలయానికి సమీపంలోనే, నిర్మాణం పూర్తికాని జైన దేవాలయం కూడా ఉంది.
ఆరు మీటర్ల ఎత్తైన శాంతినాథ్ విగ్రహానికి ఇరుపక్కలా (పార్శ్వనాథ్ - సూపర్స్‌నాథ్) విగ్రహాలుంటాయి. ఈ దేవాలయం త్రికోణాకృతిలో ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ, చిన్నచిన్న విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రాచీన శిలా శాసనాలు కూడా ఉన్నాయి. కఠిన శిలలను కరిగించి, పోతపోసినట్టుగా, అణువణువున అందం తొణికిసలాడుతోన్న భోజేశ్వర్ దేవాలయానికి ఎదురుగా, పార్వతీదేవి గుహ ఉంది. ఈ గుహ లోపల, 11వ శతాబ్దంలో ఉన్నటువంటి చాలా పురాతన శిల్పాలూ మరియు నిర్మాణ భాగాలూ, మనలను ఆశ్చర్యపరుస్తాయి. సిమెంట్, సున్నం వంటివి వాడకుండా, కేవలం రాళ్లను మాత్రమే పేర్చుకుంటూ కట్టిన అతి పురాతనమైన భోజ్ పూర్ ఆనకట్టలూ, గ్రామంలోని పచ్చని చెట్లూ, కొండల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసివున్న అసంపూర్ణ భోజేశ్వర ఆలయం, అద్భతం అనడంలో సంశయం లేదు.
Link: https://www.youtube.com/post/Ugy-1hmAWABoBR2OSq54AaABCQ
Post a Comment