ఆంజనేయుడి జన్మస్థల రహస్యం! Birth Place of Lord Hanuman


ఆంజనేయుడి జన్మస్థల రహస్యం!

మన ఇతిహాసాలలో పేర్కోనబడిన సప్త చిరంజీవులలో ఒకరు, పరమ భక్తాగ్రేసరుడైన ఆంజనేయస్వామి. శివాంశ సంభూతుడిగా జన్మించిన పవన పుత్ర హనుమాన్, శ్రీరామ పరివారంలో అగ్రగణ్యుడు. హనుమంతుడు, రామభక్తులందరికీ వందనీయుడూ, స్తవనీయుడు. సీతమ్మ శోకం పోగొట్టి, లక్ష్మణుని ప్రాణం నిలిపి, శ్రీరాముణ్ణి మహా విపత్తునుండి తప్పించి, లోకానికి శ్రీరామరాజ్య సౌభాగ్యాన్ని అందించిన మహామేధావి, ఆంజనేయుడు. శ్రీరామునికి నిస్వార్థంగా సేవ చేసిన ఏకైక భక్తశేఖరునిగా ప్రసిద్ధి చెంది, అందరి చేత పూజలందుకుంటున్నాడు హనుమంతుడు. మన పురాణాలలో ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న అతి ముఖ్యడైన హనుమంతుని జననం అందరికీ తెలిసినా, జన్మస్థలం మాత్రం నేటికీ మిస్టరీనే. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోబడుతున్నవి నాసిక్ త్రయంబకేశ్వర్ మార్గంలో ఉన్న అంజనేరి, తిరుమల గిరుల్లో ఒకటైన అంజనాద్రి. ఆంజనేయుడు పుట్టిన ప్రాంతంపై, భక్తుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడు? భక్తులలో నెలకొన్న సందిగ్ధతకు కారణమేంటి? హనుమంతుని జన్మస్థలంగా చెప్పబడుతోన్న ఆ ప్రాంతాల విశిష్ఠతలేంటి? అనే విషయాలు, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/F6Uq1K-n5t4 ]

ఆంజనేయుడిని బజరంగబలీ, మారుతీ, అంజనీ సుతుడూ, హనుమంతుడు అని, అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే, అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి, పవన కుమారుడనీ, అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీ నందనుడని కూడా పిలుస్తారు. ఆయన జన్మస్థలం, కొంతమంది మహారాష్ట్రలోని నాసిక్ అంటే, మరికొందరు హర్యానా, ఇంకొందరు ఝార్ఖండ్‌ అని చెబుతున్నారు. అయితే, కొంతమంది అభిప్రాయం ప్రకారం, తిరుమల గిరుల్లోనే ఆంజనేయుడు జన్మించాడని వాదిస్తున్నారు. తిరుమలలో ప్రసిద్ధి చెందిన జాబాలి తీర్ధమే, హనుమంతుని జన్మస్థలంగా కొందరు నమ్ముతున్నారు. ఆంధ్ర పరాశర మహర్షిగా ప్రశంసలందుకున్న ‘శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి’గారి పరిశోధనల ప్రకారం, తిరుమల కొండలలో ఒకటిగా ప్రఖ్యాతి చెందిన, అంజనాద్రిలోని జాబాలి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో, ఆంజనేయ స్వామి జన్మించాడని నిర్థారించారు. పాపనాశనం వెళ్లే మార్గంలో, ఆకాశగంగకు సమీపంలో వుంది, ఈ ఆశ్రమం. ఇదే స్వామి జన్మస్థలం అని వారి నమ్మకం. ఈ కొండకు ఆంజనేయుడి తల్లి అంజనాదేవి పేరు మీదుగా, అంజనాద్రి అనే పేరు వచ్చిందనీ, ఇదే ఆంజనేయుని జన్మస్థలమనీ, పండితులు కూడా చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర తిరుమల క్షేత్రంలోని జాబాలి తీర్థంలో, పవనసుతుడు జన్మించినట్లు, కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి. అంజనాదేవి, ఆంజనేయుడికి ఇక్కడ జన్మనిచ్చిన కారణంగానే, ఈ ప్రాంతం అంజనాద్రిగా ఖ్యాతికెక్కిందని, ఐతిహ్యం. ఇక్కడి అటవీ ప్రాంతంలో, పురాతన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. స్థానికులతో పాటు, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా, ఇక్కడున్న హనుమంతుడి దర్శనం చేసుకుంటారు. అంజనేయస్వామి, ఆంధ్రుడని కొంతమంది భక్తుల విశ్వాసం. అందుకే, దక్షిణ భారతదేశంలోనే, ఆంజనేయుడనే పేరు అధికంగా వినిపిస్తూ ఉంటుంది. ఉత్తర భారతంలో, హనుమంతుడిగా ప్రసిద్ధికెక్కాడు. అయితే, కొంతమంది వాదన ప్రకారం, మహారాష్ట్రలోని ‘నాసిక్ – త్రయంబకేశ్వర్’ మార్గంలో  వున్న "అంజనేరి" పర్వతం, హనుమంతుని జన్మస్థలంగా చెప్పబడుతోంది. త్రయంబకేశ్వర్ కి సుమారు 5 కిలో మీటర్ల దూరంలో, ఈ అంజనేరి అనే కొండ ఉంది. సుమారు మూడు-నాలుగు కిలోమీటర్ల మేర మెట్లమార్గం గుండా వెళ్లాలి. మహారాష్ట్రలోని  నాసిక్  పట్టణం,  యాత్రాస్థలాలకి  ఎంతో  ప్రసిద్ధిగాంచింది.  పవిత్ర గోదావరి పుట్టిన ప్రదేశం త్రయంబకేశ్వర్, నాసిక్ కి దగ్గరలోనే వుంది. ఆంజనేయ స్వామి పుట్టిన  ప్రదేశం "అంజనేరి" అని, కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయుడు తన చిన్నతనమంతా ఇక్కడే గడిపాడని, స్థల పురాణం చెబుతోంది. 

పడమటి కనుమల్లో, సముద్ర మట్టానికి 4,264 అడుగుల ఎత్తులో వున్న కొండమీద, అంజనేరి అనే కోట వుంది. మూడు కొండలు ఎక్కి దిగి వెళ్తే, అంజనేయుడు జన్మించిన ప్రదేశం, అంజనేరి కోట కనిపిస్తుంది. ఇక్కడొక చిన్న ఆలయం ఉంది. అందులో అంజనాదేవి ఒడిలో, బాల అంజనేయ స్వామి ఉన్నట్లుగా, ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆంజనేయుడి జన్మస్థలం ఇదే అనడానికి, కొంతమంది భక్తులు ఈ ఆలయాన్నే ఆధారంగా భావిస్తారు. ఈ ప్రాంతం చేరుకోవడం, చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. హనుమాన్ చాలీసా చదువుతూ, కొండలను ఎక్కుతారు భక్తులు. ఈ అంజనేరి కొండకు వెళ్ళే దారిలో, మైదానాలూ, జలపాతాలూ, సన్నని దారులూ, చిన్న చిన్న మెట్లు కనిపిస్తాయి. జలపాతాలు మెట్ల పైనుంచి కూడా ప్రవహిస్తుంటాయి. ఈ కొండపైన ఒక సరస్సు కూడా వుంది. అయితే, ఈ అంజనేరి కొండకు వెళ్లే దారిలో, ఒక వింత జలపాతం కనువిందు చేస్తుంటుంది. ఇది కింద నుంచి పైకి వెళ్లే రివర్స్ వాటర్ ఫాల్. ఇది దేశ వ్యాప్తంగా, ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అంజనేరిని చేరుకోవడానికి, కోసుగా, నిలువుగా వుండే రెండు కొండ శిఖరాలను అధిరోహించాలి. వాటిని Navera, Naveri అంటారు.

ఇక్కడ 108  జైన గుహలూ, జైన ఆలయాలూ వున్నాయి. ఈ గుహల్లో జైన సంప్రదాయానికి చెందిన అందమైన శిల్పాలు  చెక్కబడి ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే, సీతాదేవి గుహ కూడా  వుంది. కొండ ఎక్కి అలసిపోయిన వారు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా వుంటుంది, ఈ గుహ. అంజనేరి కోటకు వెళ్లే మార్గంలో, అంజనేరి అనబడే ఒక కుగ్రామం వొస్తుంది. అంజనేరి పర్వతం పాదాల దగ్గర, హనుమంతుడి మందిరం వుంది. అందులో పెద్ద హనుమంతుడి విగ్రహం, ధ్యాన ముద్రలో కొలువై వుంది. పర్వతం పైకి చేరుకోలేని వారు, క్రిందనుంచే స్వామి వారిని దర్శించు కుంటారు. ఈ ప్రాంతమే, ఆంజనేయుడు పుట్టిన జన్మస్థలంగా, అక్కడి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా, ఆంజనేయుని జన్మస్థలాలుగా చెప్పబడుతున్న ఈ ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలుగా మాత్రమే కాక, ప్రకృతి సోయగాలతో అలరారుతూ, భక్తులను ఆకట్టుకుంటున్నాయనడంలో, ఎటువంటి అతిశయోక్తీ లేదు.

Link: https://www.youtube.com/post/UgxlcQtzV0FxvNB7RIB4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes