అందరిలో దేవుడు!


అందరిలో దేవుడు!

ఒక గురువుగారికి చాలా మంది శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడూ  'భగవంతుడు ఇక్కడ ఉన్నాడనీ, అక్కడ లేడనీ లేదు. ఆయన అంతటా ఉంటాడు. అందరిలోనూ ఉంటాడు. అన్నింటిలోనూ ఉంటాడు' అని బోధించేవాడు..

[ కొత్త జీవితం! = https://youtu.be/VA4Ieaa6wbE ]

ఒకనాడు  శిష్యుడొకడు పనిమీద నగరంలోని సంతకు వెళ్లాడు. అక్కడ, ఒక ఏనుగుకు మదమెక్కి, అదుపుతప్పి పరుగెత్తటం మొదలెట్టింది. అది ఎటుపడితే అటు పరుగులు తీస్తుంటే దానిపైనున్న మావటివాడు 'తప్పుకోండి! తప్పుకోండి! ఏనుగుకు మదమెక్కింది! తప్పుకోండి! పరుగుతీయండి!' అని అరుస్తున్నాడు నిస్సహాయంగా..

అది చూసిన శిష్యుడికి గురువుగారి బోధన గుర్తుకు వచ్చింది. అతను అనుకున్నాడు - 'భగవంతుడు నాలోను ఉన్నాడు. ఈ ఏనుగులోనూ ఉన్నాడు. భగవంతుడు భగవంతునికి కీడు ఎందుకు చేస్తాడు?' అని..

అలా అనుకుని, అతను అడ్డుతొలగకుండా, మార్గ మధ్యంలోనే నిల్చుండిపోయాడు. మావటివాడికి పిచ్చెక్కినంత పనైంది. 'అయ్యో! పక్కకు పోండి సామీ, ఏనుగుకు బాగాలేదు, మీకు ప్రమాదం' అని మొత్తుకుంటూనే ఉన్నాడు. 

కానీ శిష్యుడు ఒక్క అంగుళంకూడా కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు. ఆ మదపుటేనుగు శిష్యుడిని చేరుకోగానే, తొండంతో అతన్ని ఎత్తి, చుట్టూ తిప్పి, బలంగా పక్కనే ఉన్న మురికి కాలువలోకి విసిరేసింది.

చావుతప్పి కన్ను లొట్టబోయిన శిష్యుడు, గాయాలతో, రక్తం ఓడుతూ, అలాగే చాలాసేపు పడి ఉండాల్సి వచ్చింది.

గాయాల బాధకంటే `భగవంతుడు తనను ఇలా చేశాడు' అనే ఆలోచన అతనిని ఎక్కువ పీడించింది.

కబురు అందుకుని, గురువుగారు, తోటివారు వచ్చి, అతనికి సాయం చేసి, ఆశ్రమానికి తీసుకుని పోతూండగా, అతను గురువుగారితో అన్నాడు - 'భగవంతుడు అన్నింటా ఉన్నాడన్నారు మీరు! చూడండి, ఏనుగు నన్ను ఏం చేసిందో!' అని..

'భగవంతుడు అన్నింటా ఉన్నాడనటంలో సందేహం లేదు నాయనా! ఏనుగులో ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. అయితే, మావటిలోనూ భగవంతుడు ఉన్నాడు.. ఆ భగవంతుడు 'అడ్డుతొలుగు' అని నీకు చెప్తూనే ఉన్నాడు. ఆయన మాట ఎందుకు వినలేదు నువ్వు?' అన్నారు గురువు గారు..

ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం ।

సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్ఛతి ।।

భావం:

ఎలాగైతే ఆకాశం నుండి వర్షరూపంలో జాలువారిన నీరు చివరికి సముద్రంలో కలుస్తుందో.. అలాగే, ఏ దేవుడికి నమస్కరించినా, అది చివరికి ఆ కేశవునికే చెందుతుంది..

Link: https://www.youtube.com/post/UgzhLf6ymrUA_8K0pNV4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes