నేను మళ్ళీ ఆలయానికి రాను!
ఒక తండ్రి తన 11 సంవత్సరాల కుమార్తెను తీసుకుని దేవాలయానికి వెళ్ళాడు. భగవంతునికి నమస్కరించి వచ్చి, ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆ అమ్మాయి అన్న మాటలివి.. 'నేను ఇకపై ఆలయానికి రాను'..
[ సన్యాసి ‘లక్ష్యం’ - 4 హత్యలు! = https://youtu.be/nxAY2zJ4tZw ]
'ఎందుకో నేను తెలుసుకోవచ్చా?' అని అడిగాడు తండ్రి..
'భగవంతునికి సేవ చేయడం, మరియు భజనలో సమయం గడపటం కోసం, మనం ఇక్కడకు వస్తున్నాము. కానీ, ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా, వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి, మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి. వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి, నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు' అని చెప్పిన కుమార్తె మాటలకు తండ్రి..
'సరే.. నీ తుది నిర్ణయం తీసుకునే ముందు, నా కోసం చిన్న పని చేసిపెట్టు తల్లీ.. దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని, వీళ్లందరి మధ్యగా, ఆలయం చుట్టూ 2 సార్లు తిరిగిరా.. గ్లాసులో నీరు మాత్రం, క్రింద పడకుండా చూసుకో' అన్న తండ్రి మాటలకు కూతురు అలాగే చేసి వచ్చి, సంతోషంతో నిండుగావున్న గ్లాసును తండ్రికి అందించింది..
అప్పుడా తండ్రి కూతురిని అభినందించి, ఆమెను 3 ప్రశ్నలు అడిగాడు:
1. ఈ సారి వెళ్లినప్పుడు, వారిలో ఎవరినైనా ఫోన్ తో చూశావా?
2. ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్ చెప్పుకోవడం నీకు వినిపించిందా?
3. ఎవరైనా కపటంగా కనిపించారా?
తండ్రి ప్రశ్నలకు ఆ అమ్మాయి.. 'నేను నా దృష్టి గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను. నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతావారిని నేను గమనించనేలేదు..'
అప్పుడు తండ్రి.. 'నీవు దేవాలయానికి వచ్చినప్పుడు చేయవలసినదిదే.. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే, వీరెవరూ నీ దృష్టికి రారు.. పైగా, నీవంటి వారిని చూసి, వారుకూడా క్రమంగా మారవచ్చు..'
అచంచలమైన భక్తీ, నిరంతర ఏకాగ్రత, సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువజేస్తాయి.. జీవితంలో ఉన్నత పథంలో నడిపిస్తాయి..
సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgynkMOkmera7YGeJa14AaABCQ
Post a Comment