లోక శ్రేయస్సు!


లోక శ్రేయస్సు!

ఆ పరమేశ్వరుడికి తన సృష్టిపై అంతులేని ప్రేమ.. మనుషులు తమ మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, స్వజాతి వినాశనానికి ఎంత ప్రయత్నిస్తున్నా, భగవంతుడు మాత్రం రక్షిస్తూనే ఉంటాడు. చంటి బిడ్డ కాలితో తన్నినా, తల్లి దండ్రులు ఆ కాలిని ముద్దు పెట్టుకుంటారే తప్ప, కినుక వహించరు. ఈ చరాచర జగత్తు సర్వం, ఈశ్వరమయం. ప్రతిచోటా పరమేశ్వరుడు ఉంటాడన్నాక, ఇక ప్రాణుల్లోనూ ఉంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేమన దృష్టిలో ప్రతి జీవీ, శివ స్వరూపమే. జీవిని చంపడం అంటే, శివుడిని చంపడమేనని, వేమన విస్పష్టంగా చెప్పాడు..

[ శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిన సన్యాసి ‘లక్ష్యం’! = https://youtu.be/nxAY2zJ4tZw ]

పాశ్చాత్యుల ఆధ్యాత్మిక దృష్టి ప్రకారం, ఆరువేల సంవత్సరాల క్రితం, మనుషుల్ని భగవంతుడు సృష్టించాడు. భారతీయుల దృష్టిలో, కొన్ని లక్షల సంవత్సరాలు దాటింది. భారతీయుల దృష్టే సత్య సమ్మతంగా ఉందని, ఆధునిక విజ్ఞాన శాస్త్రం స్పష్టంజేస్తున్నది. ఈ సృష్టిని గురించి మన పురాణాలు పేర్కొన్నాయి.. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ రుద్రుడినీ, ఇంద్రుడినీ, సనక సనందనాదులనూ, దేవర్షులనూ, ప్రజాపతులనూ, సిద్ధ, గంధర్వ, కిన్నర, కింపురుష, విద్యాధరులనూ, చతుర్వర్ణాల మనుషులనూ, జంతువులనూ, చెట్లనూ, ఇతర స్థావరాలనూ సృష్టించాడు. విత్తనాలనుంచి చెట్లు పుడతాయి. వీటిని ఉద్బీజాలు అంటారు. చెమట నుంచి పుట్టిన సూక్ష్మ క్రిములు, స్వేదజాలు. ఇవి గాక, అండజాలూ, పిండజాలూ, లక్షల రకాలు సృష్టిలో కనిపిస్తాయి..

భారతదేశంలో పుట్టిన ప్రతి ఆధ్యాత్మిక మార్గమూ, ‘అహింసో పరమో ధర్మః’ అని చెబుతుంది. భగవంతుడి ప్రేమ మార్గాన్ని వ్యాప్తి చేసే సూత్రం ఇది. శంకరాచార్యుల అద్వైతం, బుద్ధుడి కరుణా దృష్టీ, ఈ మార్గంలోనే పయనిస్తున్నాయి. ప్రకృతి ప్రియులకు సృష్టిలోని ప్రతి చెట్టూ, పుట్టా, పిట్టా సౌందర్య నిలయాలే.. ఏ ప్రాణీ తనను తాను అసహ్యించుకోదు.. ఒక్క మనిషితప్ప.. నల్లగా ఉన్నామనో, పొట్టిగా ఉన్నామనో వేదన చెందేవారు ఎందరో ఉన్నారు. భగవానుడే నల్లటివాడిగా, పొట్టివాడిగా అవతారాలెత్తాడు. ఆయన చేసిన పనుల వలన, లోకాలు సుఖించాయి. అందువల్ల, నల్లనయ్యను భక్తితో పూజిస్తాం. ఆయన బోధించిన భగవద్గీత మనకు మోక్ష మార్గం. చరిత్రలో ఎందరో అందవిహీనంగా ఉండే మహాత్ములు కనిపిస్తారు. కానీ, వారి ఔన్నత్యం, భౌతిక సౌందర్యాన్ని మించి పోయి ఉంటుంది. వారి రూపురేఖలు, మన హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి. ఇక వారి అందాన్ని గురించి పట్టించుకోం. ఎవరైనా ఆ మహాత్ముల చక్కదనాన్ని గురించి తక్కువచేసి వ్యాఖ్యానిస్తే, సహించం..

సామాన్యంగా కథారచయితలూ, కవులూ కల్పనను ఇష్టపడతారు. అందువల్లనే, వారి రచనల్లో సత్యం తక్కువగా ఉన్నట్లనిపిస్తుంది. అయినా, వారిని అసత్యవాదులు అనలేం. మనకు అర్థంకాని జీవిత సత్యాలనెన్నింటినో, రచయితలు సులభంగానూ, రసరమ్యంగానూ తెలియజేస్తారు. పురాణ ఇతిహాసాలలోనూ, ఇదే రీతి. కల్పనల సహాయంతో, క్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారాలను సూచించారు, మన రుషులు. వారిది పవిత్ర దృష్టి. వాళ్ల సృష్టి కూడా, పవిత్రమైనదే. వారి కల్పనలు లోకానికి శుభం చేకూరుస్తాయి. లోక శ్రేయస్సు కోసం చేసే కర్మలూ, చెప్పే మాటలూ, రాసే రాతలూ, అన్నీ సత్యంగానే భావించాలి. మానసిక వైద్యులు, రోగికి ఉపశమనం కలిగించడానికి చెప్పే మాటలను సత్యాలుగా భావిస్తేనే, మేలు కలుగుతుంది. విద్యార్థులతో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను గ్రహించాలంటే, వాళ్లకు శ్రద్ధా భక్తులు అవసరం. గురువును దైవం అనే దృష్టితో చూస్తేనే, అది సాధ్యం.. సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgwrxKgaRgPUI0JW-0N4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes