'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (1, 2 శ్లోకాలు)!
ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ, ఆత్మను నశింపజేయదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే.. అంటే, తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి, సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరుకోగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో, భగవంతుని చేరవచ్చు. అటువంటి మార్గాలను మనకు సులభతరంజేసే భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 1, 2 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/cCRC_ePh0bs ]
వైశంపాయన మహాముని, అర్జునుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించిన దాని ప్రకారం, భగవద్గీత మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది..
ధృతరాష్ట్ర ఉవాచ ।
ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।
ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడితో, 'సంజయా, ధర్మ క్షేత్రమైన కురుక్షేత్ర సంగ్రామంలో, యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులూ, పాండు పుత్రులూ ఏమి చేశారు?' అని అడిగాడు.
ఇలా అడగడానికి కారణం.. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా? అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా? ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు మామకః అంటే, నా కుమారులు, పాండవ: అంటే, పాండుకుమారులు అన్న భావం ప్రకటించడం ద్వారా, పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక, వారిని వైరులగానే చూస్తున్నాడు.. అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో, అలా కౌరవులు దునుమాడ బడతారు అన్నది, ధర్మక్షేత్రానికి అర్ధం.
సంజయ ఉవాచ ।
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।
సంజయుడు ఈ విధంగా చెప్పాడు. యుద్ధానికి సన్నద్ధమై, వ్యూహరచనతో సిద్ధంగా ఉన్న పాండు సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు, ద్రోణాచార్యులను సమీపించి ఇట్లా అన్నాడు.. అని, చెప్పసాగాడు.
ధృతరాష్ట్రుడు పుట్టుకతో గృడ్డివాడైనా, అతడికి అంతరజ్ఞాన నేత్రం వరంగా వుంది. కానీ, అతడి అతి ప్రేమ వలన, అది కూడా కనబడనీయడం లేదు. అతని పుత్రవాత్సల్యం వలన, ఎక్కడ తన కొడుకులు అర్ధ రాజ్యం ఇచ్చేస్తారోనన్న ఆదుర్దా కనబడుతోంది. సంజయునికి మహారాజు ఆంతర్యం తెలుసుగనుక, ఆయనకు ఊరట కలిగిస్తూ.. పాండవుల వ్యూహం చూసిన దుర్యోధనుడు, గురువుల వద్దకు వెళ్ళిన విషయం వివరిస్తున్నాడు. పైకి గాంభీర్యం నటిస్తున్నా, పాండవుల సేననుజూసి లోన భయపడిన రారాజు, అది కప్పిపుచ్చుకోవడానికి తన గురువు ద్రోణుని వద్దకు వెళ్ళాడు.
తదుపరి వీడియోలో దుర్యోధనుడూ, ద్రోణాచార్యుల వారి సంభాషణ గురించి తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురం!
Link: https://www.youtube.com/post/Ugw7Rd_qtvKnfAEmqrp4AaABCQ
Post a Comment