కృష్ణ పరమాత్ముడు చెప్పిన కర్మఫలం ఎలా పనిచేస్తుంది!
మహాభారతం హిందువులకు పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసము. మహాభారతాన్ని, ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/a0nnypJZfMM ]
"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు పరమ పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా, మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును. యుగాలు మారినా మానవ నైజాలలో, ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని, మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మన ప్రాచీన ఇతిహాసాలు నేటికీ చెలామణీ అవుతున్నాయి. మహాభారతగాథ ఒక మహాప్రవాహం. ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ. అటువంటి మహాభారతంలోని ఒక సన్నివేశాన్ని, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని, హస్తినాపురానికి వచ్చాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు, శోకంలో మునిగిపోయి ఉన్నాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి, భోరున విలపించాడు. చిన్నపిల్లవాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని, కృష్ణుడు ఓదార్చే ప్రయత్నంజేశాడు. ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి, కృష్ణుడిని నిలదీశాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ, జరిగేదంతా చూస్తూ కూడా, సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు, ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈ రోజు నాకు వందమంది పుత్రులని పోగొట్టుకునే దుస్థితిని ఎందుకు కలగజేశావు? అని నిలదీశాడు. అందుకు కృష్ణ భగవానుడు, ఇలా సమాధానమిచ్చాడు.
"ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికీ, నీకు పుత్రశోకం కలగటానికీ, అన్నిటికీ కారణం, నువ్వూ, నీ పూర్వార్జిత కర్మ. యాభై జన్మల క్రితం, నువ్వొక కిరాతుడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా, నీకు యేమీ దొరకని సందర్భంలో, ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట, వాటి గూట్లో, గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా, ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా, అప్పటికే సహనము నశించినవాడవై, కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లనూ, ఆ రెండు పక్షులూ చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలూ విచ్చిన్నం అవుతున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయాయి, ఆ జంట పక్షులు. వాటి గర్భశోకం, దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి, ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి, కర్మబంధం నుండి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి, ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మఫలం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు’ అని అన్నాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా, మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నించాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే, యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు? అని ప్రశ్నించాడు. అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే, ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలలో, నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక, నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది’ అని సెలవిచ్చాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోయాడు. మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ, ఒక్క చెడ్డపనితో తుడిచి పెట్టుకు పోతాయి.. అని శ్రీ కృష్ణుడి అంతరార్థం. కృష్ణం వందే జగద్గురం!
Link: https://www.youtube.com/post/UgyJEqM2a_emzQOEpWh4AaABCQ
Post a Comment