'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (7 - 11 శ్లోకాలు)!
భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 7 నుండి 11 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగం వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Fm0jzAL6ytw ]
కురు సైన్యంలో ఉన్న వీరుల గురించి, ద్రోణాచార్యునితో, దుర్యోధనుడి సంభాషణ ఇలా కొనసాగుతోంది..
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।। 7 ।।
ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా తెలుసుకొనుము. వీరు నాయకులుగా, అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి వివరించబోతున్నాను.
ఈ సంభాషణలో దుర్యోధనుడు, కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ, అంటే, బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడా అని చెప్పుకొచ్చాడు. అది ఉద్దేశ్యపూర్వకంగా వాడిన పదంగానే అనిపిస్తుంది. నిజానికి ద్రోణాచార్యుడు, వృత్తి రీత్యా యోధుడు కాడు.. సైనిక విద్య నేర్పించే గురువు మాత్రమే. దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూడార్థం ఏమిటంటే, ఒక వేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే, రాజ మందిరంలో ఉండే ఒక సామాన్య బ్రాహ్మణుడిగానే మిగిలిపోతాడని, తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. పాండవుల పక్షాన ఉన్న వీరుల గురించి వివరించిన దుర్యోధనుడు, ఇక తన పక్షాన నిలబడిన మహాయోధుల గురించి పేర్కోనడం మొదలుపెట్టాడు.
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథ: ।। 8 ।।
అన్యే చ బహవః శూరా: మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।।
తమరూ, భీష్ముడూ, కర్ణుడూ, యుద్ధాన్ని జయించగల కృపాచార్యుడూ, అశ్వత్థామా, వికర్ణుడూ, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడూ, జయద్రధుడు, వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. ఇంకా చాలా మంది వీరయోధులు, నా కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధంగా వున్నారు. అనేక ఆయుధాలు కలిగి ఉన్న వీరందరూ, యుద్ధవిద్యలో ప్రావీణ్యం పొందిన వారే.
దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహాయోధుల గురించి, ద్రోణాచార్యునికి వివరించాడు. ఈ వీరులందరూ తన పక్షాన పోరాడి, ప్రాణాలు సైతం కొల్పోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ, తన గర్వాన్ని ప్రదర్శించాడు.
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ।। 10 ।।
అపరిమితమైన మన సైనిక బలం, మనం, భీష్మ పితామహుడిచేత రక్షింపబడుతున్నాం. కానీ, భీముడిచేత రక్షింపబడుతున్న ఆ పాండవసైన్యం పరిమితమైనది.
దుర్యోధనుడిలా, గొప్పలకు పోయేవారు, అంత్య కాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా, అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి, అతన్ని ఓడించటం చాలా కష్టం. అందుకే, దుర్యోధనుడు తనకు ఓటమి లేదని వీర్రవీగాడు. ఇక పాండవపక్షం వైపు సైన్యాన్ని, దుర్యోధనుడి బద్ధ శత్రువైన భీముడు పరిరక్షిస్తున్నాడు. భీష్ముడి సామర్ధ్యాన్ని భీముడి బలంతో పోల్చి, పాండవులను తక్కువ అంచనా వేశాడు. కానీ, భీష్ముడు, కౌరవులకూ, పాండవులకూ పితామహుడు.. ఇరు పక్షాల క్షేమం కోరేవాడు. సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మ వున్న ఈ పవిత్రయుద్ధంలో, భూమ్మీద ఉన్న ఏ శక్తి కూడా, అధర్మ పక్షాన నిలబడి, గెలుపుని సాధించలేదని, భీష్ముడికి తెలుసు. కానీ, కౌరవులపట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా, భీష్ముడు, పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి నిలబడ్డాడు.
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షన్తు భవన్త: సర్వ ఏవ హి ।। 11 ।।
కౌరవ సేనా నాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ, భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. అంటూ, సైనికులందరినీ ఉద్దేశించి చెప్పాడు.
ఇక యుద్ధం ప్రారంభం కాబోతుండగా, దుర్యోధనుడు తన కౌరవ సేనకు కొన్ని సూచనలు అందించాడు. తన పక్షాన నిలబడిన సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్మడు, తన సైన్యానికి స్ఫూర్తిగా, శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. అందుకే, తన సేనా నాయకులను, తమ తమ సైనిక వ్యూహ స్థానాలను కాపాడుకుంటూ, భీష్ముడిని పరిరక్షించమని కోరాడు.
మన తదుపరి వీడియోలో రణరంగంలో శంఖారావం పూరించడం, యుద్ధ ప్రారంభ విషయాల గురించీ తెలుసుకుందాము.
కృష్ణం వందే జగద్గురం!
Post a Comment