కురు పాండవుల గురువు ద్రోణాచార్యుడి జన్మ రహస్యం! Life of Drona


కురు పాండవుల గురువు ద్రోణాచార్యుడి జన్మ రహస్యం!

గతించిన కాలానికీ, మనకూ మధ్య వారధిగా నిలిచేవి ఇతిహాసాలు. ఆనాడు జరిగిన సంఘటనలను మనకు తెలియజేసి, మనలోని అజ్ఞానాన్ని కాలరాసి, వాటిలో దాగిన విజ్ఞానాన్ని మనకందించేవి మన పురాణాలు. మహాభారతం, అత్యంత ప్రముఖ ఇతిహాసంగా ఖ్యాతి గడించింది. ఇందులో అనేక గాథలున్నాయి. ఎందరో వీరుల చరిత్రలున్నాయి. ధర్మం పక్షాన నిలబడి, కష్టాలనుభవించి, గెలిచిన వారున్నారు. అధర్మంతో, అవివేకంతో, యుద్ధానికి కాలుదువ్వి, కాలగర్భంలో కలిసిపోయిన వారున్నారు. మన భారతంలో పేర్కోనబడిన ప్రతీ ఒక్కరూ, ఏదో ఒక ప్రత్యేకతను కలిగిన వారే. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/YeU3P4QkK8Q ]

మహాభారత గ్రంథంలోని, ఆదిపర్వం, పంచమాశ్వాసంలో, కురు పాండవుల జననం గురించి, వేదవ్యాసుడు తెలియజేశాడు. వీరితో పాటు, వీరిరువురికీ గురువైన ద్రోణుడి జన్మ రహస్యం గురించి కూడా, ఇందులో వివరించబడి ఉంది. అస్త్ర శాస్త్రంలో మేటిగా, ధనుర్విద్యలో గొప్ప వీరునిగా, భారతంలో పేరుగడించాడు ద్రోణాచార్యుడు. ఆయన జననం వెనుక దాగిన రహస్యం ఏంటి? స్నేహితులైన ద్రుపదుడూ, ద్రోణుడి మధ్య వైరానికి గల కారణమేంటి? కురుక్షేత్రంలో వీరోచితంగా పోరాడిన ద్రోణుడు, మరణించడానికి గల కారణం ఏంటి? అనేటటువంటి ఆసక్తికర విషయాల గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

ఘృతాచి అనే దేవకన్య, గంగానదిలో జలకాలాడుతుండగా, ఆమె ఒంటిపైనున్న వస్త్రం జారిపడింది. నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న భరద్వాజ మహర్షి, ఆ దేవకన్యను వివస్త్రగా చూడగా, వీర్యపతనం జరిగింది. దానిని ఒక ద్రోణంలో, అంటే, ఒక కలశంలో దాచాడు. అలా కలశంలో జన్మించిన బాలుడే ద్రోణుడు.  భరద్వాజుని స్నేహితుడైన వృషపతుడు, తన కుమారుడైన ద్రుపదుడికి విద్యాబుద్ధులు నేర్పమని, ఆశ్రమానికి పంపాడు. ద్రోణుడూ, ద్రుపదుడూ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. స్నేహభావంతో మెలిగేవారు. తన సకల సంపదలనూ, ద్రోణుడితో పంచుకుంటానని, ద్రుపదుడు మాటిచ్చాడు. తరువాతి కాలంలో, పాంచాల రాజైన వృషపతుడు చనిపోవడంతో, ద్రుపదుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు.

ద్రోణుడు, తండ్రి భరద్వాజ మహర్షి దగ్గర అస్త్ర శస్త్ర విద్యలలో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు, అగ్నివేశ్యుడైన ముని దగ్గర ఆగ్నేయాస్త్రం ఉపదేశాన్ని పొందాడు. ద్రోణుడు యుక్త వయస్సుకు రాగా, కృపాచార్యుడి సోదరి అయిన కృపిని వివాహం చేసుకుని, అశ్వత్థామకు జన్మనిచ్చాడు. తన కొడుకంటే ద్రోణుడికి వల్లమాలిన ప్రేమ. తన కొడుకుని గొప్పవానిగా చేయాలని, అందుకు తన పేదరికాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు విరివిగా దానాలు చేస్తున్నాడని తెలుసుకుని, బయలుదేరాడు. మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడి దగ్గరకు వెళ్ళి, తన కోరికను వెల్లడించాడు ద్రోణుడు. కానీ, పరశురాముడు అప్పటికే తన సంపదనంతా దానం చేసేశాననీ, తన దగ్గరున్నది శరీరం, ధనుర్విద్యా మాత్రమేననీ, ఆ రెండింటిలో ఏం కావాలో కోరుకోమనగా, ద్రోణుడు ధనుర్విద్యను ప్రసాదించమన్నాడు.

అలా పరశురాముడి దగ్గరున్న దివ్యాస్త్రాలన్నింటినీ సంపాదించాడు. కానీ, తన పేదరికం తీరకపోవడంతో, బాల్యంలో తనకు మాట ఇచ్చిన ద్రుపదుడు గుర్తువచ్చి, పాంచాల రాజ్యం చేరుకున్నాడు. రాజుననే అహంకారంతో ఉన్న ద్రుపదుడు, బాల్య స్నేహితుడన్న విషయం మరచి, ద్రోణుడి పట్ల అనుచితంగా ప్రవర్తించి, సభలో అందరి ముందూ అవమానించి, బయటకు పంపించేశాడు. దాంతో ద్రుపదుడిపై పగ పెంచుకున్నాడు ద్రోణుడు. తరువాత తిరుగు ప్రయాణమై వెళుతుండగా, పిల్లలుగా వున్న పాండవులూ, కౌరవులూ ఆడుకుంటూ, బంతిని నీళ్ళలో పడేయడం చూశాడు. దానిని తీయబోయిన ధర్మరాజు వేలి ఉంగరం కూడా, నీటిలో పడిపోయింది. దాంతో ద్రోణుడు వారికి సాయం చేయదలిచి, బాణం మీద బాణం వేసి, బాణానికి బాణం గుచ్చుకునేలా చేసి, నీళ్ళలోని బంతినీ, ఉంగరాన్నీ తీసి ఇచ్చాడు. ఈ సంఘటనను తెలుసుకున్న భీష్ముడు, ద్రోణుడిని సత్కరించి, కురు, పాండవులకు విద్య నేర్పించమని అర్థించాడు. అనాటి నుండి, ద్రోణుడు ద్రోణాచార్యుడిగా, కురు, పాండవులకు గురువుగా, తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

ద్రోణుడు గురుదక్షిణగా, ద్రుపదుణ్ని బంధించి తెమ్మని కోరాడు. కౌరవుల వల్ల కాలేదు. భీముడూ, అర్జునుడూ వెళ్ళి, యుద్ధం చేసి మరీ, ద్రుపదుణ్ని బంధీగా తెచ్చి, గురువుకి కానుకగా ఇచ్చారు. ద్రోణుడు ద్రుపదుడిని మందలించి, అర్థ రాజ్యం ఇచ్చి వదిలేశాడు. తన పగను తీర్చిన అర్జునుడంటే, ద్రోణాచార్యునికి అమితమైన ప్రేమ. అందుకే, తన విద్యనంతటినీ అర్జునుడికి నేర్పించాడు. తనకు సాటి మరేవరూ ఉండకూడదనే, ఏకలవ్యుడి బొటన వ్రేలుని గురు దక్షిణగా కోరి, అర్జునుడికి అడ్డులేకుండా చేశాడు. అయితే, అర్జునుడి కారణంగా బంధీ అయిన ద్రుపదుడు, ఆగ్రహంతో రగిలిపోయాడు. అతి పిన్న వయస్సులోనే, అర్జునుడి ధైర్య సాహసాలను చూసి, తనకు అలాంటి కుమారుడే కావాలని, ఒక మహా యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగ ఫలం చేతనే ద్రౌపదీ, దృష్టద్యుమ్నుడూ జన్మించారు. ద్రుపదుడు విద్యాభ్యాసం కోసం, అస్త్ర శస్త్ర విద్యలలో నైపుణ్యం కోసం, దృష్టద్యుమ్నుడిని, ద్రోణుడి వద్దకు పంపాడు.

దృష్టద్యుమ్నుడు జన్మించింది, తనను సంహరించడం కోసమే అని తెలిసినా, గురువుగా ఎటువంటి పక్షపాతం లేకుండా, తనకు తెలిసిన విద్యనంతా నేర్పించాడు. పాండవులంటే ద్రోణునికి అభిమానం ఉన్నా, దుర్యోధనుడు ప్రభువు కాబట్టి, కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన నిలబడ్డాడు. ద్రోణుడిని పాండవ పక్షపాతిగా, యుద్ధ భూమిలో అవమానించాడు దుర్యోధనుడు. దాంతో, ద్రోణుడు చెలరేగిపోయాడు. ధర్మరాజుని చంపకుండా, పట్టి తెచ్చి అప్పగిస్తానని, ధుర్యోధనునికి మాటయిచ్చాడు. ద్రోణుడు యుద్ధరంగంలోకి దూకగా, ఎవ్వరూ తన ముందు నిలబడలేకపోయారు. ద్రుపదుడూ, విరాట రాజునీ చంపి, రణరంగంలో విరోచితంగా పోరాడుతున్న ద్రోణాచార్యుడిని ఆపడం, పాండవుల వల్ల కాలేదు. ద్రోణుడు ఇలానే యుద్ధం కొనసాగిస్తే, పాండవుల ఓటమి తథ్యమని భావించిన శ్రీకృష్ణ పరమాత్ముడు, ఒక ఉపాయం ఆలోచించాడు.

భీముడు "అశ్వత్థామ" అనే ఏనుగుని చంపి, "అశ్వత్థామ హతః" అని అరిచాడు. అది విన్న ద్రోణుడు, తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడా? అని ధర్మరాజుని అడిగాడు. అందుకు ధర్మరాజు "అశ్వత్థామ హతః" అని గట్టిగా అరచి, "కుంజరః" మెల్లగా అన్నాడు. ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడనుకుని, కుప్ప కూలి పోయాడు. ధనుర్బాణాలను వదిలేసి, అచేతనంగా ఉండిపోయాడు. అదే అదునుగా దృష్టద్యుమ్నుడు, ద్రోణుని తలను ఖండించాడు. అధర్మ యుద్ధంలో, అతిరథుడలా కన్నుమూశాడు. మహాభారతంలో ఉన్న అతి శక్తివంతమైన పాత్రలలో, ద్రోణుడు ముఖ్యుడనడంలో, ఎటువంటి అతిశయోక్తీ లేదు. తనకు సహాయం చేసిన అర్జునుడి పట్ల ఎంతో కృతజ్ఞతగా మెలిగాడు. తనను చంపాలనుకున్న వారికి సైతం విద్యను నేర్పించి, గురువుగా తన బాధ్యతను పూర్తి చేశాడు. యుద్ధంలో తన కొడుకు మరణించాడనుకుని, బాధతో కుప్పకూలిపోయి, ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదిలేసిన ఆయన ప్రేమ, అనిర్వచనీయం.

Link: https://www.youtube.com/post/Ugx-WMdqu7xduSHNmuB4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes