మహాభారత యుద్ధంలో పాల్గొనని ఆ ఇద్దరూ ఎవరు?


మహాభారత యుద్ధంలో పాల్గొనని ఆ ఇద్దరూ ఎవరు?

మన సనాతన ధర్మ ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనాలు మన ఇతిహాసాలు. వాటిలో గ్రంథ రాజంగా, గత చరిత్రకు ఆనవాలుగా పరిఢవిల్లుతోంది మహాభారతం. ద్వాపర యుగం నాటి ఈ గ్రంథంలో, నేటికీ మరచిపోలేని అద్భత ఘట్టం, కురుక్షేత్రం. దాయాది కుటుంబాలైన కురు పాండవుల మధ్య పోరు జరిగిన ప్రాంతమే, కురుక్షేత్ర రణరంగం. పద్దెనిమిది రోజుల పాటు జరిగిన ఆ మహా సంగ్రామంలో, అన్ని రాజ్యాల వారూ, కురు పాండవుల తరుపున పాల్గోన్నారు. పరాయి రాజ్యాల వారు సైతం, ఈ యుద్ధంలో పాల్గోని, తమ సహాయం అందించగా, కృష్ణుని సోదరుడూ, బావ మాత్రం అందులో పాల్గోనలేదు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fj5UhwJjRGI ]

కృష్ణుడి సోదరుడైన బలరాముడు, అందరి క్షేమాన్నీ కోరుకునే శాంతికాముకుడు. మహాజన క్షయకరమైన కురుక్షేత్ర సంగ్రామంలో, బలరాముడు పాల్గొనకపోవడానికి కారణాలను, మన మునుపటి వీడియోలో పొందుపరిచి ఉన్నాం.. ఆ విషయాలు సమగ్రంగా తెలుసుకోవడం కోసం, 'కురుక్షేత్ర సంగ్రామంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు?' అనే వీడియోను వీక్షించగలరు. ఇక కురుక్షేత్రంలో పాల్గోనని మరో వ్యక్తి, రుక్మిణీ దేవి సోదరుడు రుక్మి. దేవతా శక్తులుగల ఆయుధాలను కలిగిఉన్న మహావీరుడైన రుక్మి, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గోనకపోవడానికి గల కారణాలను, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

విదర్భ రాజ్యానికి రాజైన భీష్మక మహారాజు కుమారుడు రుక్మి. ఈయన మిక్కిలి పరాక్రమవంతుడేగాక, ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు కూడా. ధ్రుముడనే కింపురుషుడి అనుగ్రహంతో, 'విజయం' అనే దివ్య ధనుస్సును పొందిన వీరుడు. లోకంలో అత్యంత శ్రేష్టమైన దివ్యాయుధాలు మూడే ఉన్నాయి. వాటికి దేవతల ధనుస్సులు సైతం, సాటి రావు.. వాటిలో ఒకటి విష్ణుమూర్తి ఆయుధమైన 'సారంగం' అనే ధనువు. దానిని, శ్రీకృష్ణుడు ధరించాడు. మరొకటి, ఖాండవ వన దహన సమయంలో, అగ్నిదేవుడు అర్జునుడికి బహూకరించిన 'గాండీవం'. ఇక మూడవది, రుక్మి దగ్గరున్న 'విజయం' అనే ధనువు. రుక్మిణీ దేవి యొక్క అయిదుగురు సోదరులలో, ప్రథముడు రుక్మి.

రుక్మిణీ దేవి మనస్సు కృష్ణ పరమాత్ముడిని కోరుకుంటోందని తెలిసీ, దుష్ట గుణాలు కలిగిన శిశుపాలునికిచ్చి వివాహంజేయడానికి పూనుకున్నాడు. అది తెలుసుకున్న భగవానుడు, రుక్మిణీ దేవిని పెళ్లి చేసుకోవడానికి ఎత్తుకెళుతుండగా, రుక్మి తన సైన్యంతో అడ్డుకుని, కృష్ణయ్య పై యుద్ధానికి దిగాడు. చక్రాయుధ ధరుడైన కృష్ణయ్య, రుక్మిని ఓడించి రుక్మిణిని తీసుకువెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. అది అవమానంగా భావించిన రుక్మి, కృష్ణుడిపై పగను పెంచుకున్నాడు. కురు పాండవుల మధ్య వైరం కారణంగా, మహాభారత సంగ్రామం జరగడం తథ్యం అని తెలిసి, ఒక అక్షౌహిణి సేనతో, పాండవుల వద్దకు వెళ్లాడు రుక్మి. అక్కడ వారి ఆతిధ్యాన్ని స్వీకరించిన పిమ్మట అర్జునుడిని పిలిచి, 'అర్జునా! రాబోయే మహాసంగ్రామం గురించి భయపడకు.. నన్ను మించిన వీరుడూ, పరాక్రమవంతుడూ లేడు. నా వద్ద శక్తివంతమైన ధనుస్సు ఉంది. దాని సహాయంతో, భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యుల వంటి మహావీరులను సైతం మట్టి కరిపించి, హస్తినాపురిని మీకు అప్పగిస్తాను' అని బీరాలు పలికాడు.

రుక్మి మాటలు విని, చిరు మందహాసం చేసిన పార్థుడు, 'మహావీరా! మాకు సహాయం చేస్తానన్నందుకు ధన్యవాదాలు.. అయినా, నీకు తెలియని విషయం కాదుగా.. మాకు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడే, అండగా ఉన్నాడు. ఆయన ఉండగా, ఇక వేరేవారి సహాయం అవసరం ఉంటుందా? పైగా, నా దగ్గర దివ్యాస్త్రమైన గాండీవం ఉంది. ఆ ఇంద్రుడే వచ్చినా, నేను భయపడను' అన్న అర్జునుడి మాటలకు ఆగ్రహించిన రుక్మి, అక్కడి నుంచి తనసేనతో బయలుదేరి, సుయోధనుడి దగ్గరకు చేరాడు.

'దుర్యోధనా! నేను నీ పక్షాన ఉంటాను. నా ధనుస్సుతో పాండవులను అంతంజేస్తాను. నీకు విజయం తథ్యం. నా ప్రతాపం చూపిస్తాను. అని గొప్పలు చెప్పాడు. అభిమానధనుడైన రారాజు, అతడి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఇక చేసేది లేక, రుక్మి సిగ్గుతో, తన విదర్భ రాజ్యానికి తిరుగుముఖం పట్టాడు.

అందుకే, ఎప్పుడూ మనల్ని మనం అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి శక్తియుక్తుల్ని తక్కువగా అంచనా వేయడం, మంచిది కాదు. అలా చేయడం వల్ల, అవమానమే తప్ప, వేరే ఫలితం ఉండదు. దేవతలను సైతం ఎదురించగలిగే అస్త్రాలు ఉన్నా, గొప్ప వీరుడిగా పేరుగండించినా, అవేవీ రుక్మికి ఉపయోగం లేకుండా పోయాయి. కాబట్టి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgzJMp6AVsOkjXmL-7Z4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes