తిరుమలలో దాగిన రహస్య తీర్థాలూ వాటి మాహాత్మ్యం! Tirumala sacred water places


తిరుమలలో దాగిన రహస్య తీర్థాలూ వాటి మాహాత్మ్యం!

లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం, దశావతారాలనెత్తిన ఆ నారాయణుడు, పత్యక్ష దైవంగా, వేంకటేశ్వరస్వామిగా, తిరుమల గిరులపై వెలశాడు. ఆ గోవిందుడు కొలువై ఉన్న కలియుగ వైకుంఠం, తిరుమల పుణ్య క్షేత్రం. అటువంటి అద్భుత ఆలయం గురించీ, అది నెలవైన తిరుమల గురించీ, ఎన్నో చారిత్రక, పురాణ గ్రంధాలలో వివరించబడి ఉంది. తిరుమల అంటేనే, అద్భుతాల సమాహారం, పవితత్రకు తార్కాణం, ఎన్నో రహస్యాల బాంఢాగారం. తిరుమలలోని ప్రతీ అణువూ, పురాణ గాధలనూ, ఇతిహాసాలలోని సంఘటనలనూ సాక్షాత్కరింపజేస్తుంటాయి. అంతేకాదు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయమైన తిరుమలలో, ప్రతి శిలా, చింతామణీ.. ప్రతీ చెట్టూ, ప్రతీ తీగా, మహర్షులూ.. ప్రతీ తీర్థం, దేవగంగా స్వరూపాలని, వేంకటాచల మాహాత్మ్యంలో, సవివరంగా ప్రస్థావించబడి ఉంది. శ్రీనివాసుని శయన భంగిమలో అలరారే, ఆ తిరుమల సప్తగిరులలో కొలువైన తీర్థాలు, యుగయుగాల నాటివి. అంతటి ప్రాశస్త్యం కలిగిన తిరుమల గిరులలో నెలకొనివున్న పలు తీర్థారాజాల గురించీ, వాటి వెనకున్న గాధల గురించీ, వాటి మాహాత్మ్యం గురించీ, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/NP3o-Ynr15w ]

మొట్టమొదటిగా చెప్పుకోవలసింది, వేంకటేశ్వరుని సన్నిధికి సమీపంలోని, వరాహ స్వామి ఆలయానికి ప్రక్కనున్న పుష్కరిణి గురించి.. అదే ‘స్వామి పుష్కరిణి’: స్వామి వారి ప్రధానాలయానికి సమీపాన ఉండే ఈ పుష్కరిణి, ఎంతో పవిత్రమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా, ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని, మన పురాణాలలో వెల్లడించబడి ఉంది. స్వామి వారిని దర్శించే ముందు, ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం, ఒక ఆచారంగా చెప్పబడుతోంది. ఈ తీర్థం వద్ద గో దానం చేయడంవలన, అత్యంత పుణ్యం లభిస్తుంది.

ఆకాశ గంగ: ప్రధానాలయం నుంచి, 5 కిలో మీటర్ల దూరంలో, ఆకాశ గంగ తీర్థం ఉంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థం ఉద్భవించిందని, భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆకాశ గంగలో స్నానమాచరిస్తే, శత పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని, పెద్దల నమ్మకం. ఈ ఆకాశగంగ ప్రాశస్త్యం, పలు పురాణాలలో కూడా వివరించబడి ఉంది.

పాప వినాశనం: ప్రధానాలయం నుంచి, 3 మైళ్ళ దూరంలో, పాపవినాశన తీర్థం వెలసింది. ఈ పాపనాసనంలో స్నానమాచరించిన వారికి, సకల పాప ప్రక్షాళన జరుగుతుందని, మన మహర్షుల ఉవాచ.

సనకనందన తీర్థం: పూర్వం సనకనందనులు సిద్ధిప్రాప్తి కోసం, ఈ ప్రాంతంలో ఘోరమైన తపస్సునాచరించారు. దాంతో వారి పేరు మీదుగా, ఇక్కడ తీర్థస్థలం వెలిసింది. ఇందులో మార్గశిర శుక్లపక్ష ద్వాదశినాడు స్నానం చేస్తే, సిద్ధి పొందుతారని భక్తుల విశ్వాసం. లక్షలాది మంది భక్తులు, ఇక్కడికి వస్తూ వుంటారు. ఈ తీర్థం, పాపవినాశనాకి ఉత్తరభాగంగా ఒక మైలు దూరంలో వుంది.

జాబాలి తీర్థం: తిరుమలలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే, ఈ తీర్థం ఉంది. జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేయగా, ఆంజనేయుడు దర్శనమిచ్చినట్టుగా, పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆంజనేయుని ఆలయం ఇక్కడ నెలకొని ఉంది. హథీరాంజీ మఠాధిపతుల అధీనంలో వున్న ఈ ఆలయంలో, స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, భూత, ప్రేత, పిశాచ బాధలు తొలగిపోవడంతో పాటు, మనోవాంఛ కూడా సిద్ధిస్తుంది. వనవాసంలో భాగంగా, శ్రీరాముడు, సీతమ్మవారూ, లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్లతో, ఇక్కడ కొంత కాలం ఉన్నారన్న కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

తుంబుర తీర్థం: ప్రధానాలయానికి ఉత్తరాన, 16 కిలో మీటర్ల దూరంలో, ఈ తుంబుర తీర్థం ఉంది. వర్షాకాలంలో ఈ తీర్థం, ఎంతో శోభాయమానంగా, పచ్చని ప్రకృతి అందాలతో, కళకళలాడుతుంటుంది. గంధర్వుడైన తుంబురుడు తన భార్యను శపించడంతో, ఆమె కప్ప రూపంలో మారి, ఈ తీర్థంలో ఉండేది. అగస్త్య ముని ఓరోజు ఈ తీర్థానికి రావడంతో, ఆమె తన గోడును వెళ్లగ్రక్కగా, ముని అనుగ్రహంతో, ఆమె తిరిగి తన యథా రూపాన్ని పొందింది. అప్పటి నుంచి, ఇది తుంబుర తీర్థంగా వెలుగులోకి వచ్చింది. అయితే, మరో కథనం ప్రకారం, తుంబుర నాద మహర్షి ఇక్కడ ఘోరమైన తపస్సు చేయడం వల్ల, ఈ తీర్థానికి తుంబుర తీర్థం అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. ఇక్కడ, స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ, తన అవసానదశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు, నేటికీ ఉన్నాయి. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, కష్టాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ తీర్థానికి వెళ్లడానికి, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు మాత్రమే అనుమతుంటుంది.

పాండవ తీర్థం: ఇది తిరుమల కొండ ఆదిలో, నృసింహ కొండకు అభిముఖంగా ఉంది. ఈ తీర్థం, పౌరాణిక ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు, వనవాస సమయంలో, ఈ ప్రాంతంలోనే ఒక ఏడాది పాటు నివసించారు. అంతేకాక, కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తరువాత, పాండవులు, వారు చేసిన బ్రహ్మహత్యా పాపాలను నివృత్తి చేసుకోవడానికి గానూ, ఈ తీర్థంలోనే అభిషేక స్నానాలు చేసినట్లు, కొన్ని పురాణాలలో వివరించబడి ఉంది. ఆనాడు పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడం వలనే, దీనికి పాండవతీర్థం అనే పేరొచ్చింది. వైశాఖమాసం, శుక్లపక్ష ద్వాదశి, ఆదివారం నాడు కలిసి వచ్చినప్పుడు గానీ, కృష్ణపక్ష ద్వాదశీ, మంగళవారం నాడు గానీ, ఈ తీర్థంలో స్నానం చేయడం సర్వ శ్రేష్ఠం.

కుమార ధారా తీర్థం: మహావిష్ణువుకై ఓ భక్తుడు తిరుమలలో తపమాచరించగా, ఆ దేవదేవుడు ప్రత్యక్షమై, అక్కడి తీర్థంలో స్నానమాచారించమని చెప్పారట. ఆ విధంగానే తీర్థంలో స్నానం చేసిన భక్తుడు, 16 నెలల బాలుడిగా మారిపోయాడు. అప్పటినుంచి, ఈ తీర్థానికి కుమార తీర్థమనే పేరొచ్చింది. మరో కథనం ప్రకారం, కుమార స్వామి శ్రీవారి అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగా, ఈ ప్రాంతానికి కుమారధారా తీర్థం అనే పేరు స్థిరపడినట్లు తెలుస్తోంది. తారకాసురుణ్ణి సంహరించిన తరువాత, శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతంలోనే తపమాచరించినట్లు, ఈ తీర్థంలో స్నానమాచరించి, బ్రహ్మహత్యపాపాలను పొగొట్టున్నట్లు కొన్ని ఆధారాలున్నాయి. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, రాజసూయ యాగం చేసినంత ఫలం దక్కుతుందని, భక్తుల విశ్వాసం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున, సంతాన భాగ్యం లేని మహిళలు ఈ తీర్థంలో స్నానమాచరిస్తే, సంతాన భాగ్యం, కార్య సిద్ధి కలుగుతుందని ప్రతీతి. అంతటి విశిష్ఠత కలిగిన మాఘ పౌర్ణమి నాడు, స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని ఇక్కడకు తెచ్చి, భక్తులకు పంచటం, మరో విశేషం. 

చక్రతీర్థం: ప్రధానాలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో, శిలాతోరణం ప్రాంగణంలో, ఈ చక్ర తీర్థం ఉంది. తిరుమల గిరులపై బ్రహ్మ తపస్సు చేయదలచి, అందుకు అనువైన ప్రాంతం చూపమని వేంకటేశ్వరుణ్ణి కోరడంతో, ఆయన తన సుదర్శన చక్రంతో రాతిని చీల్చి, బ్రహ్మకు స్థానం చూపించాడు. అలా చీలిన కొండపై నుంచి వచ్చిన నీటితోనే, ఈ తీర్థం ఏర్పడింది. బ్రహ్మోత్సవాల సమయంలో, స్వామి ఉత్సవమూర్తిని, ఇక్కడకు కూడా తీసుకొస్తారు. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన పాపాలు తొలగి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

నాగ తీర్థం: వేంకటేశ్వరుని సన్నిధి నుండి, కిలోమీటరు దూరంలో ఉంటుంది ఈ నాగతీర్థం. పెళ్ళికాని మహిళలూ, వివాహం ఆలస్యమవుతున్న స్త్రీలూ, ఈ తీర్థంలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరిస్తే, సకల సద్గుణాలు కలిగిన ఉత్తమ భర్తను పొందుతారని ఐతిహ్యం.
బాలతీర్థం: ఈ తీర్థంలో స్నానం చేస్తే, వృద్ధులు సైతం, బాలుల వంటి శక్తిని పొందుతారట. అయితే, ఇది సృష్టికి అవరోధం కావడంతో, ఇక్కడున్న జలం, శిలల్లో ఇంకి పోయింది. ఇది నాగతీర్థానికి రెండువందల గజాల దూరంలో ఉంది.

శేషతీర్థం: సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడు, ఆదిశేషుని రూపంలో కొలువై ఉన్న తీర్థం ఇది. ఒక రోజు శ్రీ మహా విష్ణువుకు బాగా దాహం వేసింది. దాంతో జలం తీసుకురమ్మని, గరుత్మంతుడిని పురమాయించారు. కానీ, ఆయన ఎంత సేపటికీ నీళ్లు తీసుకురాకపోవడంతో, ఆది శేషుడ్ని, దాహం తీరడానికి నీళ్లు కావాలని అడిగాడు. వెంటనే ఆది శేషుడు తన తోక ద్వారా జలాన్ని రప్పించి, శ్రీ వారి దాహం తీర్చాడు. అందుకే, ఇది శేష తీర్థం అయ్యిందని, పురాణ విదితం. ఈ తీర్థంలోని అడుగుభాగంలో, ఆదిశేషుడు శిలారూపంలో కొలువై ఉన్నాడు. ఈ తీర్థంలో స్నానమాచరించిన వారికి, మరుజన్మ వుండదని ప్రతీతి. ఈ తీర్థాన్ని చేరుకోవడం కొంచెం కష్టతరం. దట్టమైన అటవీ ప్రాంతంలో, పర్వతాలను ఎక్కుతూ, చిన్న చిన్న పాచి పట్టిన ప్రవాహాలను దాటుకుంటూ, కొన్ని ప్రత్యేక జాతుల విష నాగులను తప్పించకుంటూ, ఈ శేష తీర్థాన్ని చేరుకోవాలి.

సీతమ్మ తీర్థం: తిరుమలలో వెలసిన ఎన్నో విశిష్ట తీర్థాలలో, ఈ సీతమ్మ తీర్థం ఒకటి. శ్రీవారి ఆలయానికి తూర్పు దిక్కున, శేష తీర్థానికి కాస్త పైన, సీతమ్మ తీర్థం ఉంది. ఈ ప్రాంతం, ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాలతో, ముగ్ధ మనోహరంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్న కొండ గుహలో, సీతమ్మ తీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడున్న గుంతలో, ఎల్లప్పుడూ నీరు ఊరుతుంటుంది. దానిని వెదురు కర్రతో కాస్త కదిలిస్తే, నీరు బయటికొస్తుంది. ఆ నీటిని భక్తులు తల మీద చల్లుకుని కృతార్థులవుతారు. ఈ సీతమ్మ ధార తీర్థ జలాలన్నీ, శేష తీర్థంలో కలుస్తాయి. సీతమ్మ ఇక్కడ లవకుశులతో కాలం గడిపిందిగనుక, ఈ తీర్థాన్ని సీతమ్మ ధార తీర్థం అంటారు. ఆనాడు సీతాదేవి లవకుశులకు కరం నూరిపోసింది ఈ ప్రాంతంలోనే. అందుకు సాక్ష్యంగా, అక్కడున్న బండపై అరిగివున్న కొంత భాగం, నేటికీ కనిపిస్తుంటుంది.

వైకుంఠ తీర్థం: శ్రీ వారి ప్రధానాలయానికి తూర్పు దిశలో, ఒక కిలోమీటరు దూరంలో వున్న ఈ తీర్థంలో స్నానం చేస్తే, వైకుంఠప్రాప్తి కలుగుతుంది. పురజనులు అప్పుడప్పుడూ ఇక్కడ వైకుంఠ సమారాధనలు కూడా చేస్తూ వుంటారు.

యుద్ధగళ తీర్థం: ఈ తీర్థం విశిష్ఠత గురించి, రామాయణంలో వర్ణించబడి వుంది. పూర్వం రాముడు, రావణుడిని సంహరించిన తరువాత, తాను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని నిర్మూలించుకోవడం కోసం, ఈ తీర్థంలో స్నానం చేశాడు.

పద్మ సరోవరం: పద్మావతి మందిరం దగ్గరున్న ఈ సరోవరం, తిరుపతి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో వుంది. ఇందులో వున్న జలం, స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. ఈ పద్మసరోవరంలో స్నానం చేసినవారికి, సకల భోగభాగ్యాలూ ప్రాప్తిస్తాయి.

కపిలతీర్థం: ఇది శేషాద్రికొండ దిగువన ఉంది. కృతయుగంలో, పాతాళలోకంలో, కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, భూమిని చిల్చుకుని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందుకే ఇది 'కపిల లింగం'గా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా, 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో, కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ, ముక్కోటి పౌర్ణమి నాడు, మధ్యాహ్నం వేళ, పది ఘటికల సమయం, అంటే, నాలుగు గంటల పాటు, కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో తీర్థంలో స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని, భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీప పర్వదినాన, ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరూ, కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.

తిరుమల గిరులపై కేవలం ఈ తీర్థాలు మాత్రమే కాక, కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థం, కటాహ తీర్థం, వరాహ తీర్థం, విష్వక్సేన తీర్థం, పంచాయుధ తీర్థం, బ్రహ్మతీర్థం, సప్తముని తీర్థం, దేవ తీర్థం వంటి ఎన్నో ముఖ్యతీర్థాలు మిళితమై ఉన్నాయి. కొన్ని తీర్థాలలోని నీరు అట్టడుగుకు చేరినా, మరికొన్ని మాత్రం, నేటికీ శోభాయమానంగా, భక్తుల పాపాలు పరిహరిస్తున్నాయి. ఇటువంటి ఎన్నో మాహాత్మ్యాలకు నెలవైన తిరుమలగిరులు, పరమపవిత్రం. అందుకే, కలియుగ ప్రత్యక్ష దైవంగా, వేంకటేశ్వరుడు అక్కడ కొలువై, భక్తుల పాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు.

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes