అన్ని సమస్యలకూ పరిష్కారం ‘శ్రీ మద్ భగవద్గీత’!
ఓం యత్ర యోగీశ్వరః కృష్ణో యత్రపార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతిర్ధృవానీ తిర్మతిర్మమ..
పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యేమహాభారతమ్ |
అద్వైతామృత వర్షిణీమ్ భగవతీమ్ అష్టాదశాధ్యాయినీమ్
అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ||
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C4pz2fzWz-8 ]
ఈ శ్లోకం, భగవద్గీతలోని అంతరార్థాన్ని తెలియజేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన అద్భుత బహుమతి, భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలనూ స్పృశించి, ప్రతీ సమస్యకూ పరిష్కారం చూపే గ్రంథ రాజమే, శ్రీమద్ భగవద్గీత. మన మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం, 25 వ అధ్యాయము మొదలు, 42 వ అధ్యాయము వరకూగల 18 అధ్యాయములను, భగవద్గీత అంటారు. భారతంలో భాగమైనా, భగవద్గీత ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతూ, ప్రసిద్ధి చెందింది. భారతం, ద్వాపర యుగం నాటి ఇతి హాసంగా ఖ్యాతి గడించగా, అందులో భాగమైన భగవద్గీత, అన్ని గ్రంథాలకూ, మకుటాయమానంగా భాసిల్లుతోంది. అందుకు కారణం, ఈ 18 అధ్యాయాలలో, సాక్షాత్తూ కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం, ఇమిడి ఉండడమే. అందుకే, ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో, ముఖ్య స్థానం పొందింది. అటువంటి పవిత్ర గ్రంథమైన భగవద్గీత విశిష్ఠతనూ, దాని ప్రాముఖ్యతనూ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
భగవద్గీతను "గీత" అనీ, "గీతోపనిషత్తు" అని కూడా పిలుస్తారు. భగవద్గీత అంటే, "భగవంతుని వాక్కు" అని అర్థం. ఈ అమూల్యమైన భగవద్గీతను, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు, శ్రీ కృష్ణ పరమాత్ముడు పార్థుడికి బోధించాడు. సిద్ధాంత గ్రంథమైన ఈ భగవద్గీతయందు, వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవంతుని తత్వమూ, ఆత్మ తత్వమూ, జీవన గమ్యమూ, గమ్యసాధనా, యోగముల గురించి, ఇందులో బోధింపబడివుంది. భగవద్గీత, ఉపనిషత్తుల సారమనీ, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకూ, పాపహరణకూ మార్గమనీ చెప్పబడుతోంది. కర్మ యోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అనే మూడు జీవనమార్గాలూ, భగవంతుని తత్వం, ఆత్మ స్వరూపం, ఇందులోని ముఖ్యాంశములు. అన్ని వేదాలలోని మంత్రాలనూ, వాటిలోని విషయ సమాహారాన్నీ కలిపి, ఏకాకారంలో, ఒకే గ్రంథంగా తీర్చబడినదే, భగవద్గీత. అంటే, ఒక దండలోని ముత్యాలను ఏర్చికూర్చినట్లుగా, వేదాలలోని సారాన్ని మిళితం చేసుకున్న గ్రంథం ఇది. భగవద్గీత, మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది.
దాయాదులైన కురు పాండవులు, రాజ్యాధికారం కోసం, యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునుడికి రథసారథి, శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపులవారూ శంఖాలను పూరించారు. అర్జునుని కోరికపై, కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా, తన బంధువులూ, గురువులూ, స్నేహితులూ కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం, బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు, కర్తవ్యబోధ చేయమని, శ్రీకృష్ణుడిని అడిగాడు. అలా అర్జునునికీ, శ్రీకృష్ణునికీ మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. జగద్గురువు అర్జునుడికి అనుగ్రహించినటువంటి మహోపదేశమే గీత.
కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకీ, సందిగ్థతకీ సమాధానంగా, భగవద్గీత ఈ నాటికీ, ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుందనడంలో, సందేహం లేదు. అటువంటి మహత్తర గీతోపనిషత్తు గురించి, భీష్మ పర్వం 43 వ అధ్యాయం, 4వ శ్లోకంలో వివరించబడిన దాని ప్రకారం, గీతలో శ్రీ కృష్ణుడు 620 శ్లోకాలూ, అర్జునుడు 57 శ్లోకాలూ, సంజయుడు 67 శ్లోకాలూ, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే, మొత్తం 745 శ్లోకాలు. కానీ, ప్రస్తుతం వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి, కృష్ణుడు 574 శ్లోకాలూ, అర్జునుడు 84 శ్లోకాలూ, సంజయుడు 41 శ్లోకాలూ, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే, మొత్తం 700 శ్లోకాలు. మరి కొన్ని ప్రతులలో, 13 వ అధ్యాయం ‘క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం’ మొదట్లో, అర్జునుడు అడిగినట్లుగా ‘ప్రకృతిం పురుషం చైవ..’ అని, ఒక ప్రశ్న ఉంది. దానిని కూడా కలుపుకున్నట్లయితే, మొత్తం 701 శ్లోకాలవుతాయి. మిగిలిన 44 శ్లోకాల గురించిన పరిశోధన, నేటికీ కొనసాగుతూనే ఉంది. స్వయానా భగవానుడు వివరించిన ఆత్మజ్ఞానం, కర్మజ్ఞానం గురించీ, భగవద్గీతలోని అంతరార్థం గురించీ, ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకనాడు భూదేవి, విష్ణుమూర్తితో, ‘స్వామీ, ప్రారబ్ధమనుభవించే వారికి, అంచచలమైన భక్తి ఎలా కలుగుతుంది?’ అని ప్రశ్నించింది. అందుకు భగవానుడు,
మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతిచేత్,
క్వచిత్స్పర్శం న కుర్వంతి నళీనీదళ మంభసా
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే,
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై.
సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే,
గోపాలా గోపికావాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే.
అని వివరించాడు. అంటే, తామరాకుకి నీరు అంటనట్లుగా, గీతాధ్యానముచేయు వారికి, మహాపాపములు కొంచెమైననూ అంటుకోవు. ఎక్కడ భగవద్గీత గ్రంథముంటుందో, ఎక్కడ గీతా పారాయణ మొనర్చబడుతుంటుందో, అక్కడ ప్రయాగ మొదలగు సమస్తతీర్థములుంటాయి. ఏ చోట గీతాపారాయణం జరుగుతుందో, అక్కడికి సమస్త దేవతలూ, ఋషులూ, యోగులూ, నాగులూ, గోపాలురూ, భగవత్పార్శ్వర్తులూ, నారద, ఉద్ధవాదులూ వచ్చి, శీఘ్రముగా సహాయమొనరుస్తారు. అని సాక్ష్యాత్తూ విష్ణు భగవానుడు, భూదేవికి సెలవిచ్చాడు. ఈ భగవద్గీతలో మొత్తం, 18 అధ్యాయాలున్నాయి. ఒకొక్క అధ్యాయాన్నీ, ఒకొక్క "యోగము" అని అంటారు. వీటిలో 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కలిపి, "కర్మషట్కము" అనీ, 7 నుండి 12 వరకూ గల అధ్యాయాలను, "భక్తి షట్కము" అనీ, 13 నుండి 18 వరకూ గల అధ్యాయాలను, "జ్ఞాన షట్కము" అనీ అంటారు.
ఇంతటి మహత్తర భగవద్గీతను, ప్రతీ ఒక్కరూ పఠించడం, కొంతవరకు అసాధ్యమే. దీనిని చదవలేని వారూ, చదవడానికి వీలుకుదరని వారి కోసం, భగవద్గీతలోని శ్లోకం, తాత్పర్య సహితంగా, మన Maheedhar's planet leaf channelలో భాగాలుగా అందించాలని ప్రయత్నిస్తున్నాం. ఆదిశంకరాచార్యులు విరచించిన, శ్రీ మద్భగవద్గీత శంకర భాష్య పారాయణం, ఏప్రిల్ 13, ప్లవ నామ సంవత్సరాది ఉగాది నుండీ, ప్రతి మంగళవారం నాడు అందించబోతున్నాం. మా ఈ ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తారనీ, మీ ఆశీస్సులతోపాటు, తోడ్పాటునీ అందిస్తారనీ ఆశిస్తున్నాం. సర్వేజనాః సుఖినోభవంతు!
Post a Comment