అర్జునుడి రథంపై హనుమంతుని చిహ్నం ఉండడానికి గల కారణం!


అర్జునుడి రథంపై హనుమంతుని చిహ్నం ఉండడానికి గల కారణం!

భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 20 నుండి 25 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/F3pdXaWX7ps ​]

కురుక్షేత్ర సంగ్రామంలో సమరానికి సిద్ధమై, ఇరు పక్షాలూ శంఖాలు పూరించిన తరువాత, అర్జునుడూ, శ్రీ కృష్ణుడి మధ్య సంభాషణ గురించి, సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా వివరిస్తున్నాడు..

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।

ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాణ్డవః ।। 20 ।।

హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ।

ఆ సమయంలో, తన రథంపై హనుమంతుని చిహ్నం కలిగిన, కపిధ్వజుడైన అర్జునుడు, తన ఆయుధాలనెక్కుపెట్టి, సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, శ్రీ కృష్ణుడితో ఇలా అన్నాడు రాజా.. అని, ధృతరాష్ట్రుడికి తెలియపరుస్తున్నాడు సంజయుడు.

అర్జునుడు తన రథంపై హనుమంతుని జెండా పెట్టుకోవడం వెనుక, ఒక కథ ఉంది. ఒకనాడు అర్జునుడు విలువిద్యలో తనకు సాటి ఎవరూ లేరనే గర్వంతో, ‘శ్రీరామ చంద్రమూర్తి కోసం, వానరులు అంత కష్టపడి వారధిని ఎందుకు నిర్మించారో..? అదే నేను గనుక అయితే, నా బాణాలతో సులువుగా వారధిని నిర్మించేవాడిని’ అని పలికాడు. అందుకు శ్రీ కృష్ణుడు, ‘ఎలా నిర్మిస్తావో చూపించు’ అన్నాడు. అర్జునుడు తన శర పరంపరతో వంతెనను నిర్మించగా, దానిని పరీక్షించడానికి శ్రీ కృష్ణుడు హనుమంతుడిని ఆహ్వానించాడు. అర్జునుడు తయారు చేసిన వంతెనపై హనుమంతుని పాదం మోపగానే, అది కూలిపోయింది. దాంతో అర్జునుడు తన తప్పు తెలుసుకుని, తొందరపాటుకు సిగ్గుపడి, హనుమంతుడిని క్షమాపణలు అడిగి, జరగబోయే మహాభారత యుద్ధంలో తనకు విజయాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. హనుమ దయాళుడై, ‘నీ రథంపై కూర్చుని, నీకు తోడుంటాను’ అని వరమిచ్చాడు. అందుకే, హనుమ చిహ్నంతో ఉన్న జెండా, అర్జునుడి రథంపై గొచరిస్తుంది. 

అర్జున ఉవాచ ।

సెనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।।

యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ ।

కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ।। 22 ।।

అచ్యుతా, దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలుపు. ఈ రణరంగంలో, ఎవరితో యుద్ధం చేయాలో, యుద్ధ కాముకులై వచ్చినవారెవరో నేను చూస్తాను. అని అర్జునుడు, శ్రీ కృష్ణునితో అన్నాడు.

సమస్త సృష్టికీ పరమేశ్వరుడైన శ్రీ కృష్ణుడికి, భక్తుడు అర్జునుడు. అయినప్పటికీ, అర్జునుడి రథానికి సారధిగా మారి, శ్రీ కృష్ణుడు, భక్తులతో తనకున్న బంధాన్ని తెలియజేస్తున్నాడు. "నేను సర్వ స్వతంత్రుడనయినా, నా భక్తులకు బానిసనయిపోతాను." అని చెప్పినట్లుగానే, అర్జునుడు రథంలో కూర్చుని ఆదేశాలిస్తుంటే, అతని భక్తికి వశుడైపోయిన శ్రీ కృష్ణ పరమాత్మ, రథాన్ని నడిపే సారధి స్థానాన్ని తీసుకున్నాడు.

యోత్స్యమానాన వేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।

ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ।। 23 ।।

దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుడి పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొసం, అతని పక్షాన యుద్ధానికి వచ్చిన వారందరినీ, ఒకసారి నాకు చూడాలని ఉంది.

ధృతరాష్ట్రుని తనయులు దుర్బుద్ధితో, పాండవుల నుండి అన్యాయంగా రాజ్యాన్ని లాక్కున్నారు. అలాంటి చెడు బుద్ధి కలిగిన వారి పక్షాన చేరి, యుద్ధానికి సన్నద్ధమయిన వారు కూడా, దుర్మార్గులే. అందుకే, అన్యాయం వైపు మొగ్గుచూపిన వారిని, ఒకసారి చూడాలనుకున్నాడు, అర్జునుడు.

సంజయ ఉవాచ ।

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।

సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ।। 24 ।।

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ ।

ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ।। 25 ।।

సంజయుడు, మహారాజుతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. రథాన్ని, రణరంగం మధ్యలోకి తీసుకువెళ్లిన శ్రీ కృష్ణుడు, భీష్ముడూ, ద్రోణాచార్యుడూ మరియు ఇతర రాజుల సమక్షంలో, "ఓ పార్థా, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడు" అని పలికాడు. 

ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, రణరగంలో ఉన్న కురు వంశస్థులను చూడు, అని పలికాడు. కౌరవులూ, పాండవులూ, కురు వంశానికి చెందిన వారే. శ్రీ కృష్ణుడు, ఉద్దేశపూర్వకంగానే ఈ పదాన్ని వాడినట్లు తెలుస్తోంది. ఎలాగైతే వైద్యుడు, కురుపుతో వున్న రోగికి, మొదట్లో దానికి చీము పట్టి ముదిరే మందిచ్చి, తరువాత, ఆ రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయటానికి, శస్త్ర చికిత్స చేస్తాడో, భగవంతుడు కూడా ఆ విధంగానే చేస్తున్నాడు. మొదట అర్జునుడిలో అంతర్గతంగా వున్న మోహాన్నీ, భ్రమనూ ప్రేరేపించేలా, అక్కడ యుద్ధానికి సిద్ధమైంది తన వారే, అనే భావనను కలిగించి, ఆ తరువాత, ధర్మం, అధర్మం అనే విషయాలపై అవగాహన కలిగించబోతున్నాడు.

మన తదుపరి వీడియోలో, యుద్ధరంగం మధ్యలో నిలబడి తన వారిని చూసిన అర్జునుడు, తన అభిప్రాయాలను శ్రీ కృష్ణుడితో సంభాషించడం గురించి, తెలుసుకుందాము.. 

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugy-11W-5JLDoMB5xk54AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes