విజ్ఞాన సర్వస్వం! Hindu Epics


విజ్ఞాన సర్వస్వం!

యుగయుగాలనుండీ, ధర్మ స్వరూప నిరూపణం, కర్తవ్య నిర్వహణం, భవ బంధ విమోచనం అనే మూడు అంశాలూ, మానవ ధర్మానికి మూడు స్కంధాలు. వీటిలో మొదటి దానికి 'మహాభారతం', రెండవదానికి 'రామాయణం', మూడవదానికి 'భాగవతం', దర్పణాలుగా నిలుస్తాయి.

[ దుర్యోధనుడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/9Vj_dddES_k ]

భారతీయ సంస్కృతికి పట్టు కొమ్మలూ, జీవ ధారలూ అయిన గ్రంథ రాజాలు 'రామాయణ, భారత, భాగవతాలు'. మానవ జాతికి సంస్కారాన్ని అందించే ఈ గ్రంథాల్లో, సనాతన ధర్మం ప్రతిష్ఠితమై ఉంది. ఈ మూడు గ్రంథాల గమ్యం, వేద ప్రతిపాదనం. వేదమనే అంతర్యామితత్త్వానికి, దేహేంద్రియ మానసాల్ని కల్పించి, మూర్తిమత్వాన్ని పరికల్పించడమే, ఈ మూడు గ్రంథాల పరమార్థం. వేదవేద్యుడైన పరమ పురుషుడు, నరుడిగా ఎలా ప్రవర్తించాడో తెలిపేది, 'రామాయణం'. వేదాన్ని సమగ్రంగా మథనం చేసి, ధర్మామృతాన్ని ఇచ్చింది 'మహాభారతం'. భౌతిక జీవితం పొందిన జీవుడు నారాయణుడిగా వెలిగి, వెలిగించడానికి భావైక గమ్యమైన సులభ భక్తి మార్గాన్ని ఉపదేశిస్తుంది, 'భాగవతం'. వీటిని ప్రసాదించిన వాల్మీకి, వ్యాస మహర్షులు వేదావతార మూర్తులు..

సమస్త విశ్వంలో, వ్యక్తి తాదాత్మ్యం చెందే స్థితిలో, రామాయణ మహాకావ్యం, ఆదికవి హృదయం నుంచి ఆవిర్భవించింది. తపస్వి వాల్మీకి, సర్వ మానవ జగత్కల్యాణానికి ఉపకరించే సద్గుణ సముపేతుడైన వ్యక్తి ఉన్నాడని నారదుడి ద్వారా తెలుసుకుని, ఆ వ్యక్తి దృక్పథాన్ని ఉదాత్త రీతిలో, హృదయాకర్షక కథనంగా చెప్పడానికి సంకల్పించాడు. ఈ భూమి మీద నదులూ, పర్వతాలూ ఎంతకాలం ఉంటాయో, అంతకాలం, లోకంలో రామాయణం స్థిరంగా నిలిచి ఉంటుందని, బ్రహ్మ వాల్మీకిని ఆశీర్వదించినట్లుగా, ఆర్ష వాక్కు. మంచిచెడుల సంఘర్షణ, శ్రీరాముడి ప్రయాణం వెనక అంతర్లీనంగా గోచరిస్తుంది. దైవాంశను తనలోనే దాచుకుని, విశ్వప్రేమ సుగంధాన్నీ, ప్రేమనూ, కరుణనూ, చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచిపెట్టిన ధీరోదాత్తుడు శ్రీరాముడు. జీవితంలో అన్ని కోణాలకూ వర్తించిన శాశ్వత విలువలు కలిగిన విశ్వకావ్యం 'రామాయణం'.

కృష్ణ ద్వైపాయనుడనే వ్యాసుడు, భారతీయ సంస్కృతీ ప్రాసాదానికి మూలస్తంభం. వేదాలు బోధించే ధర్మాధర్మాలని, సామాన్య మానవులకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే, కౌరవ పాండవ కథా కథన వ్యాజంతో, మహాభారతం రచించాడు. అందుకే భారతం, పంచమ వేదంగా ప్రశంసలందుకుంది. మహాభారతం, విజ్ఞాన సర్వస్వం. వ్యాసమునీంద్రులు దర్శించిన భారతం, భారతీయ తత్వ సమగ్ర దృష్టి. విశ్వవాఙ్మయంలో, ఇంతగా మానవ హృదయాన్ని మధించి, వివిధ రీతుల్లో విస్తృతంగా చిత్రించిన కావ్యం మరొకటి లేదు. అన్ని కాలాలకూ, అన్ని దేశాలకూ ఉపయోగించే ధర్మాలు, భారతంలో ఉన్నాయి. బహు విధ సంకీర్ణమైన మానవత్వ భావగతుల్ని, అద్భుతంగా చిత్రించింది భారతేతిహాసం.

భగవంతుణ్నీ భక్తుణ్నీ సంధానించేది 'భాగవతం'. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక తత్త్వాల స్వరూప స్వభావాల కూడలీ, నిరాకారమైన భక్తికి సాకారమైన కథనం, 'భాగవతం'. భక్తికీ, ముక్తికీ, ప్రాణాధారమైనది భాగవతం. భాగవత పఠనం, మనిషిని శాంతచిత్తుణ్ని చేస్తుంది. రామాయణం కావ్యమనీ, భారతం ఇతిహాసమనీ, భాగవతం పురాణమనీ స్థూలమైన అవగాహన. ఈ మూడు గ్రంథాలూ, మానవ జాతిని అనుగ్రహించడం మొదలుపెట్టి, ఎన్ని వేల సంవత్సరాలయిందో! ఈ జాతి వారసత్వ సంపదగా, ఈ అక్షర సౌధాలు నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంటాయి.

ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgzcVxE9o2wfqbbpZvZ4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes