ఈరోజు '25/05/2021' శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి జయంతి!
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గురించిన అద్భుతవాస్తవాలు!
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QEj5N9uOWlo ]
[ సంతాన భాగ్యాన్ని ప్రసాదించే నృసింహ ఆలయ రహస్యాలు! = https://youtu.be/t9cgrPMuL_g ]
[భక్త పహ్లాదుడి గత జన్మ రహస్యం! = https://youtu.be/IstcmPa7sKU ]
సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే |
సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం ||
సింహాచల గిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నారసింహుని వైభవం, ఈ స్తోత్రం ద్వారా తెలుస్తోంది. ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలైన వరాహ స్వామీ, నరసింహ స్వామీ కలయికతో, స్వయంభువుగా వెలసిన ఏకైక మహా పుణ్య క్షేత్రం, సింహాచలం. కొన్ని యుగాల చరిత్ర కలిగిన ఆ ఆలయంలోని స్వామి, సంవత్సరంలో కేవలం 12 గంటలు మాత్రమే, తన నిజ రూపాన్ని భక్తులకు చూపించే పుణ్యదినమే, వైశాఖ శుక్ల తదియ. ఆ రోజునే చందనోత్సవముగా ఆలయ పూజారులు జరుపుతుండడం మరో విశేషం. ఇక్కడ స్వామి వారి ముఖం వరాహమూర్తిగానూ, శరీరం మానవునిగానూ ఉండి, సింహం యొక్క వాలం కలిగిన విలక్షణ మూర్తిగా స్వామివారు దర్శనమిస్తారు. ఇంతటి విశిష్ఠత కల స్వామి వారి మూల విగ్రహాన్ని, ఎందుకు సంవత్సరం మొత్తం చందనంతో కప్పి ఉంచుతారు? అసలు ఈ చందనోత్సవం ఎలా జరుపుతారు? సింహచల క్షేత్రం యొక్క అసలు చరిత్ర ఏమిటి? అనే విషయాలను ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం.
కుందాభ సుందర తనుః పరిపూర్ణ, చంద్రబింబానుకారి వదన ద్విభుజస్త్రీ నేత్రః
శాంతస్త్రీభంగి లలితః క్షితి గుప్తపాదః, సింహాచలే జయతి దేవ వరోనృసింహః
సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ నారసింహుడు, సుందరమైన తనువు గలవాడూ, పూర్ణ చంద్రుని వంటి మేని ఛాయ గలవాడూ, ద్విభుజుడూ, త్రినేత్రుడూ, శాంతమూర్తీ, శరీరమందు మూడు వంకలు గలవాడూ, భూమిలోపల పాదాలు నిక్షిప్తమై ఉన్న వాడు... అంటూ, స్వామి వారి విలక్షణ స్వభావాన్నీ, క్షేత్ర మాహాత్మ్యాన్నీ వర్ణిస్తోంది పై పద్యం. అంతేకాక, స్వామి అంతర్లీనంగా, వామన మూర్తి రూపాంతరాన్ని పొంది ఉన్నాడనీ, అందుకే స్వామి నిజరూపం కురచగా దర్శనమిస్తోందనీ, పై పద్యం ద్వారా తెలుస్తోంది. ఇటువంటి విశిష్ఠతలు గల శ్రీ వరాహ నారసింహ స్వామి వారి యొక్క చందనోత్సవం గురించి తెలుసుకోవాలంటే, ఒక్కసారి ఆ ఆలయ చరిత్రను ప్రస్థావించుకోవాలి. పూర్వం శ్రీ మహావిష్ణువు యొక్క మహా భక్తుడైన ప్రహ్లాదుడినీ, అతని తండ్రీ మరియు అసుర రాజైన హిరణ్యకశిపుని వద్ద నుంచి రక్షించి, అతని సంహారానికై, విష్ణుమూర్తి నరసింహావతారంలో వచ్చి, హిరణ్యకశిపుడిని సంహరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఆ ఘటనకు ముందు, ప్రహాద్లుడిచే హరినామస్మరణ మాన్పించడానికి, హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
ఆ ప్రయత్నాలలో భాగంగా, ఒకనాడు, ప్రహ్లాదుడిని ఎత్తైన కొండ శిఖరంపై నుంచి లోయలోకి పడేయాలని, హిరణ్యకశిపుడు ఆజ్ఞాపించడంతో, అతడి ఆజ్ఞను పాటిస్తూ, భటులు ప్రహ్లాదుడిని ఒక కొండపైనుంచి క్రిందకు త్రోసేశారు. అప్పుడు ప్రహ్లాదుడు ఆ శ్రీహరిని ప్రార్థించగా, ఆ నారాయణుడే స్వయంగా వైకుంఠం నుంచి, గరుడ వాహనంపై అత్యంత వేగంగా వచ్చాడు. ఆ క్రమంలో, సమయం తక్కువగా ఉన్నందున, గరుత్మంతుడిని వేగంగా వెళ్ళమని చెప్పగా, అంత వేగంగా గరుత్మంతుడు ఎగరలేక, అలసిపోయాడు. అప్పుడు తన బోటన వ్రేలు నోటిలోపెట్టి, గరుత్మంతుడికి అమృతపానం చేయిస్తూ, జారిపోతున్న పట్టు పీతాంబరాన్ని మరొక చేతితో పట్టుకొని వస్తూ, అప్పటికీ వేగం సరిపోక, సింహగిరిపై అమాంతం దూకాడట. దాంతో స్వామి వేగానికి, పాదాలు రెండూ పాతాళంలో కూరుకుపోయాయి. అయినా, వెంటనే పైకి వచ్చి, ప్రహ్లాదుడిని రక్షించాడు. ఆ తరువాత కొంతకాలానికి, హిరణ్యకశిపుని సంహారం అనంతరం, ప్రహ్లాదుడు, స్వామిని ద్వయావతారంగా, అంటే వరాహ నరసింహునిగా, సింహగిరిపై వెలియాలని ప్రార్థించాడట.
ప్రహ్లాదుడి కోరిక మేరకు, ఆ శ్రీహరి, వరాహనరసింహావతారంలో, సింహాచలంపై వెలిశాడు. అప్పటి నుంచీ, ఆ స్వామిని ప్లహ్లాదుడు తనువు చాలించేంత వరకూ, ఎన్నో ఏళ్ళ పాటు పూజించాడు. ఆనాడు ప్రహ్లాదుడు స్వామిని అర్చించి, అభిషేకించిన పూజా విధానాలే, నేటికీ అవలంభించడం ఒక విశేషం. అయితే, ప్రహ్లాదుడి తరువాత, వరాహ నరసింహ మూర్తిని పట్టించుకునే వారు లేక, ఆ ఆలయం శిథిలమై, స్వామి విగ్రహం చుట్టూ పుట్టలు వెలిశాయి. త్రేతాయుగంలో, భారతావనిని పాలించిన పురూరవ చక్రవర్తి ఒకనాడు, తన ప్రేయసి అయిన ఊర్వశితో, ఆకాశంలో విహరిస్తుండగా, సింహగిరి కొండల వద్దకు రాగానే, వారి వాహనం ఆగిపోయిందట. అప్పుడు ఊర్వశి, తన దివ్య దృష్టితో, తామున్నది పరమపవిత్రమైన సింహగిరి క్షేత్రమనీ, అక్కడ వరాహ నరసింహుని విగ్రహం ఉందనీ, దానిని బయటకు తీసి, పున: ప్రతిష్ఠ చేయాలనీ, పురూరవునికి చెప్పగా, అతడు మూడు రోజుల పాటు రాత్రీ పగలూ వెతకగా, ఒక పుట్టలో స్వామి విగ్రహం కనిపించింది.
వెంటనే పురూరవుడు, వేయి కడవల నీటితోనూ, పంచామృతాలతోనూ స్వామిని అభిషేకించాడు. అయినా, స్వామి పాదాలు కనబడకపోయేటప్పటికి, ఆ పాదాలకై మరింత ప్రయత్నించగా, ఆ ప్రదేశం నుంచి విపరీతమైన వేడి పైకి వచ్చింది. వెంటనే ఆకాశంలో అశరీర వాణి ఒకటి, స్వామి వారి విగ్రహానికి మొత్తం చందనపు పూత పూసి ఉంచమనీ, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, ఆ పూత తొలగించి, నిజరూప దర్శనం చేయమనీ చెప్పింది. నాటి నుంచి నేటి వరకూ, చందనోత్సవం జరుగుతోందని, ఆలయ చరిత్ర చెబుతోంది. నేటికీ చందనోత్సవం రోజున, స్వామి నిజరూప దర్శన సమయంలో గర్భాలయంలో, విపరీతమైన వేడి ఉంటుందని, అక్కడి పూజారులు చెబుతారు.
పురూరవ చక్రవర్తి మొదటిసారి చందనోత్సవం చేసిన రోజే, వైశాఖ శుక్ల తదియ అవ్వడం, ఆరోజే ఎంతో విశిష్ఠత కలిగిన అక్షయ తృతీయ కూడా కావడంతో, ప్రతీ సంవత్సరం, వైశాఖ శుక్ల తదియ నాడే చందనోత్సవం జరిపించాలని, పురూరవుడు శాసనం చేశాడట. ప్రతీ సంవత్సరం, వైశాఖ శుక్ల తదియ తెల్లవారుఝామునే, అర్చకులు నాద స్వర మేళాలతో, వేద మంత్రోచ్ఛారణలతో సుప్రభాత సేవ చేసి, స్వామిని మేల్కోలుపుతారు. నిత్యార్చనలు పూర్తయిన తరువాత, బంగారం, వెండి బొరిగెలతో, స్వామిపై ఉన్న చందనాన్ని విసర్జింపచేస్తారు. అలా వచ్చిన చందనాన్ని, భక్తులకు ప్రసాదం రూపంలో, దేవస్థానం వారమ్ముతారు. చందన విసర్జన అనంతరం, నిజరూపంలోకి వచ్చిన స్వామి శిరస్సునా, ఛాతీ పైనా, చలువ చందనాన్ని ముద్దలుగా ఉంచుతారు. దేవాలయంలో అనాదిగా వస్తోన్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ, అర్చకులకూ, ఆలయాధికారులకూ, ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకూ, తొలి దర్శన భాగ్యం లభిస్తుంది. అనంతరం, ప్రముఖులతో పాటు, సాధారణ భక్తులకు కూడా, ఏకకాలంలో నిజరూప దర్శనం జరుగుతుంది.
శ్రీ వరాహ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనాన్ని, ఆరోజు రాత్రి 9 గంటల వరకూ చూడవచ్చు. స్వామిని చూడడానికి, ఆ రోజు లక్షల సంఖ్యలో జనాలు ఆలయానికి పోటెత్తుతారు. 9 గంటలవ్వగానే, వందల మంది వైష్ణవ స్వాములు, వెయ్యి కడవలతో నీటిని, ఆలయం దగ్గరలో ఉన్న గంగధార అనే జలధార నుంచి తీసుకువచ్చి, స్వామిని అభిషేకిస్తారు. వాటితో పాటు, పంచామృతాభిషేకం కూడా జరుగుతుంది. ఆ తరువాత, మూడు మణుగుల శ్రీ గంధాన్ని స్వామి వారికి సమర్పించడంతో, చందన యాత్ర ముగుస్తుంది. శ్రీవారికి, చందనంపై ఉన్న మక్కువ గురించి, ఎన్నో పురాణాలలో చెప్పబడింది. అంతటి విశిష్ఠమైన శ్రీ గంధంలోనే నిత్యం ఉండే సింహచలేశుని చందనం విషయంలో, దేవస్థానం వారు, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అక్కడ వాడే చందనాన్ని, తమిళనాడు రాష్ట్రంలోని ఎంపిక చేసిన మంచి గంధపు చెక్కల నుంచి తీస్తారు. అందుకుగానూ, చందనపు చెక్కలను, ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అనుమతితో, సింహాచలానికి తరలిస్తారు. అలా, సుమారు 150 కేజీల చందనపు చెక్కలను, లక్షలు వెచ్చించి ఆలయానికి తీసుకువచ్చి, వాటిని మరొక సారి తూకం వేసి, ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. ఆ తరువాత, ప్రతియేటా వచ్చే చైత్ర బహుళ ఏకాదశి నాడు, చెక్కల అరగదీత ప్రక్రియ, శాస్త్రోక్తంగా మొదలవుతుంది.
చందనం చెక్కలను తొలుత మూల విరాట్టు ముందుంచి, ఆలయ వైదిక పెద్దలు తొలుత చందనాన్ని అరగదీస్తారు. అలా వచ్చిన కొంత చందనాన్ని స్వామికి నివేదించిన అనంతరం, ఆలయ ఉద్యోగులు, గంధపుచెక్కల అరగదీతను మొదలుపెడతారు. 32 సంఖ్యకూ, నరసింహ స్వామికీ, ఎంతో అవినాభావ సంబంధం ఉందని, మన పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే, నృసింహ స్వామి మూలమంత్రంలోని అక్షరాలు, 32. ఈ ప్రామాణికంగా, తొలి విడత చందన సమర్పణకు, 32 కేజీల చెక్కలను అరగదీసి, 125 కేజీల గంధాన్ని తీస్తారు. ఈ చందన అరగదీత మొత్తం, సింహాచల క్షేత్రంలోని ‘బేడా’ మండపంలో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సానలపై, ఆలయ ఉద్యోగులు నిర్వహిస్తారు. ఇలా ఏరోజుకారోజు అరగదీసి, చందనాన్ని మొత్తం తూకం తూసి, ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. సరిగ్గా చందనోత్సవం ముందు రోజు, ఆ చందనంలో కొన్ని సుగంధ ద్రవ్యాలనూ, మరికొన్ని వనమూలికలనూ కలుపుతారు. ఈ విధంగా చందనాన్ని సిద్ధం చేసి, చందనోత్సవం రోజున స్వామికి సమర్పిస్తారు. ఆ రోజు చందనంతో పాటు, 32 మీటర్ల పొత్తి వస్త్రాన్ని కూడా స్వామి వారికి సమర్పిస్తారు. ఈ వస్త్రాన్ని ఒడిస్సా రాష్ట్రంలోని బర్హంపురం అనే ఊరిలో, ప్రత్యేకంగా తయారుచేయించి తీసుకువస్తారు. ఈ విధంగా, ప్రతీ ఏడూ, సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవాన్ని, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఇంతటి విశిష్ఠత కల చందనోత్సవాన్నీ, స్వామి వారి నిజరూపదర్శనాన్నీ, ఈ సంవత్సరం కూడా మనమందరం దర్శించుకుని, ఆ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆశిస్తూ...
జై శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః!
Link: https://www.youtube.com/post/UgyzEl0OADMjFC9T2kB4AaABCQ
Post a Comment