సొంత వారినే చంపుకుని, సుఖంగా ఎలా ఉండగలము? Bhagavad Gita

 

సొంత వారినే చంపుకుని, సుఖంగా ఎలా ఉండగలము?

'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (32 - 37 శ్లోకాలు)!

భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో, అర్జున విషాద యోగం లోని 32 నుండి 37 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగం వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/OKq37bUEEVo ]

రణరంగాన్ని చూసి విరక్తి చెందిన అర్జునుడు, యుద్ధానికి సిద్ధమవ్వడానికి కారణమైన రాజ్యాధికారం గురించి, ఈ విధంగా చెబుతున్నాడు..

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।

కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ।। 32 ।।

యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।

త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ।। 33 ।।

ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో, వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు,  రాజ్యం వలన కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వలన కానీ ప్రయోజనం ఏముంది? అని కృష్ణుడిని అడుగుతున్నాడు.

చంపటం ఒక పాపపు పనైతే, సొంత బంధువులనే హతమార్చటం, మరింత పాపిష్టి పని అనే భావన, అర్జునుడికి కలగడంతో, ఆందోళనకి గురయ్యాడు. రాజ్యం కోసం, ఇంత క్రూరమైన పని చేసినా, ఆ గెలుపు చివరకి సంతోషాన్ని ఇవ్వలేదని, అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో, బంధువులతో, తన విజయాన్నీ, రాజ్య వైభవాన్నీ పంచుకోలేడు. ఎందుకంటే, ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. అదే విషయం అర్జునుడి కలతకు కారణమైంది. తన మనస్సూ, బుద్దీ కలత నొందాయి. చేయవలసిన పని మీద అసంతృప్తీ, లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి.

ఆచార్యాః పితరః పుత్రా: తథైవ చ పితామహాః ।

మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ।। 34 ।।

ఏతాన్న హంతుమిఛ్చామి ఘ్నఽతోపి మధుసూదన ।

అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ।। 35 ।।

గురువులూ, తండ్రులూ, కొడుకులూ, మేనమామలూ, మనుమలూ, మామలూ, బావ మరుదులూ, ఇంకా ఇతర బంధువులూ, వారి ప్రాణాలనూ, ధనాన్నీ పణంగా పెట్టి మరీ ఇక్కడకు చేరి వున్నారు. ఓ మధుసూదనా, వీరందరూ కలిపి నా మీద దాడి చేసిననూ, నేను వీరిని చంపను. ధృతరాష్ట్రుని పుత్రులని సంహరించి, ముల్లోకాలపై ఆధిపత్యం సాధించినా, ఏం తృప్తి మిగులుతుంది? ఇక ఈ భూ-మండలంలో సాధించే విజయం కోసమైతే, ఏమి చెప్పను? అని యుద్ధంపై అసంతృప్తిని తెలియజేస్తున్నాడు.

గురువులు, ద్రోణాచార్యుడూ మరియు కృపాచార్యుడూ, పితామహులు, భీష్ముడూ మరియు సోమదత్తుడూ,  తండ్రి వరసైన సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడూ, మేనమామలూ, పురుజిత్తూ, కుంతిభోజుడూ, శల్యుడూ ఇంకా శకునీ, తన సోదరులూ, ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులూ, బిడ్డలాంటి వాడు దుర్యోధనుని తనయుడైన లక్ష్మణుడూ, ఇలా తన సొంత వారినీ, బంధువులనూ చంపాల్సి ఉంటుందని, అర్జునుడు వేదన చెందుతున్నాడు. బంధువులనూ, సోదర సమేతులనూ సంహరించి, ముల్లోకాలలో రాజుగా కీర్తింపబడినా, తన వారు లేని ఆ పదవి వ్యర్థం కదా? అని చింతిస్తున్నాడు అర్జునుడు. రాజ్యాధికారం కోసం, తనను వారందరూ చంపడానికి వచ్చినా, తిరిగి వారిని సంహరించను, అని తన బంధు ప్రీతిని వ్యక్తపరుస్తున్నాడు.

నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః  స్యాజ్జనార్ధన ।

పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ।। 36 ।।

తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ।

స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ।। 37 ।।

ఓ జనార్ధనా, సర్వ భూతములకూ సంరక్షకుడూ, పోషకుడూ అయినవాడా.. ధృతరాష్ట్ర తనయులను చంపి, మనమెలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి, ధృతరాష్ట్రుని పుత్రులనూ, అతని తరుపున ఉన్న స్నేహితులనూ చంపటం, మనకు తగదు. ఓ మాధవా, మన సొంత వారినే చంపుకుని, మనం సుఖంగా ఎలా ఉండగలము?

న్యాయం కోసం చంపినా, అది పాపిష్టి పనే. అది పశ్చాత్తాపాన్నీ, అపరాధ భావననూ కలుగజేస్తుంది. సంపదకి నిప్పు పెట్టే వారూ, అన్నంలో విషం కలిపే వారూ, చంపటానికి ప్రయత్నించే వారూ, సొత్తుని కొల్లగొట్టే వారూ, భార్యని అపహరించిన వారూ, రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునే వారూ, ఇలాంటి వారిని, ఆత్మ రక్షణ కోసం చంపటం, పాపము కాదని మను-స్మృతి చెబుతోంది. అయినప్పటికీ, దుర్మార్గంగా తమ రాజ్యాన్ని లాక్కున్న ధృతరాష్ట్ర కుమారులను చంపడానికి కూడా, అర్జునుడికి మనస్సు రావడం లేదు. వారిని చంపి రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నా, మనశ్శాంతితో రాజ్యపాలన చేయలేమని, అర్జునుడు శ్రీ కృష్ణుడితో తన మనోభావాలను వివరిస్తున్నాడు.

మన తదుపరి వీడియోలో, ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన కలిగే వివిధ రకాల పాపాల గురించి, అర్జునుడు ఏ విధంగా వివరిస్తున్నాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugw1qBeTmMr8vUTtbmt4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes