మహిమాన్విత ‘వట సావిత్రీ వ్రతం - 24/06/2021' కథ! Vata Savitri Vratham

 

మహిమాన్విత ‘వట సావిత్రీ వ్రతం - 24/06/2021' కథ!

ప్రాచీన కాలం నుంచీ, మన హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం, మానవులలోని దోషాలనూ, నష్టాలనూ, పాపాలనూ తొలగించుకోవడానికీ, అష్టైశ్వర్యాలనూ, సకల సౌభాగ్యాలనూ పొందడానికీ, ఎన్నోరకాల నోములూ, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా, ఇటువంటి ఆచారాలను అవలంభించడం జరిగింది. అటువంటి నోములలో, ‘వట సావిత్రీ వ్రతం’ కూడా ఒకటి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి, సకల సౌభాగ్యాలూ లభించడంతో పాటు, రకరకాల దోషాలూ, పాపాలూ, కష్టనష్టాల నుంచి విముక్తినీ పొందుతారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iweHMvboCqQ ​]

పూర్వం సతీ సావిత్రి కూడా, ఈ వట సావిత్రీ వ్రతాన్ని ఆచరించి, తన భర్త అయిన 'సత్యవంతుని', మృత్యువు నుంచి కాపాడుకో గలిగింది. అటువంటి మహోన్నత శక్తిని కలిగిన ఈ వ్రతాన్ని, జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు, లేదా జ్యేష్ఠ బహుళ అమావాస్యనాడు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించుకుంటారు. ఈ వ్రతం ఆచరణలో ఎటువంటి సమస్యలూ కలగనీయకుండా, అన్ని జాగ్రత్తలూ ముందుగానే తీసుకోవాలి. వ్రతం భగ్నమయితే, ఎటువంటి ఫలితాలూ దక్కవు. అలాగే, ఈ వ్రతంలో ఏ ఒక్క పద్ధతిని సరిగ్గా అవలంభించకపోయినా, నష్టాలు వాటిల్లుతాయి.

కాబట్టి, చాలా జాగ్రత్తగా, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహించుకోవాలి. ఈ వట సావిత్రీ వ్రతాన్ని, మన భారతదేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క రకంగా చేసుకుంటారు.

వ్రత విధానం..

ఈ వ్రతాన్ని చేసుకునేవారు, ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం వుండాలి. ఏ రకమైన తినుబండారాలను గానీ, పళ్లను గానీ తీసుకోకూడదు. తెల్లవారు జామున నిద్ర లేవగానే, రోజువారీ కార్యక్రమాలను ముగించుకుని, తలస్నానం చేసుకోవాలి. మనసులో దేవుడిని, దారిపొడవునా స్మరించుకుంటూ, మర్రిచెట్టు దగ్గరకు చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తరువాత, మర్రిచెట్టు వద్ద అలికి, ముగ్గులు వేసి, సావిత్రీ, సత్యవంతుల బొమ్మలను ప్రతిష్టించుకోవాలి. ఒకవేళ వారి చిత్రపటాలుగనుక లభించకపోతే, పసుపుతో చేసిన బొమ్మలను ప్రతిష్టించుకోవాలి. ఈ విధంగా చేసిన వారికి, వైధవ్యాది సకల దోషాల నుంచీ పరిహారం లభిస్తుంది.

ఆ తరువాత.. 'బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం.. సత్యవత్సావిత్రీ ప్రీత్యర్థంచ.. వట సావిత్రీ వ్రతం కరిష్యే' అనే శ్లోకాన్ని భక్తితో పఠించాలి. ఈ విధంగా మర్రిచెట్టును పూజించడం వల్ల, త్రిమూర్తులను పూజించినంత ఫలితం దక్కుతుందంటారు. పూజానంతరం, 'ఓం నమో వైవస్వతాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ, మర్రిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం, నైవేద్యం సమర్పించి, బ్రాహ్మణులకూ, ముత్తైదువులకూ, దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఇలా చేసిన వారికి, వారి భర్త దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడని, మన పెద్దలు చెబుతారు..

శుభం భూయాత్!

ఈ సంవత్సరం వట సావిత్రీ వ్రతం రోజులు.. 

వట సావిత్రీ అమావాస్య తేదీ - 10 జూన్, 2021 గురువారం..

వట సావిత్రీ పూర్ణిమ తేదీ - 24 జూన్, 2021 గురువారం..

Link: https://www.youtube.com/post/UgyiJU8h8J3TAWOOnlt4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes