27 నక్షత్రాలూ, మెరుగైన జీవితంకోసం పరిహారాలూ.. నారద పురాణం ప్రకారం!
మన సనాతన ధర్మంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం. మనం జన్మించిన రాశీ, అందులోని నక్షత్రం, మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, మన లక్షణాలనూ, మన అభిరుచులనూ, కొంత వరకూ నక్షత్రాలు నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. శ్రీ నారద పురాణంలో, నక్షత్రాలకు గల స్వభావాలు వివరించబడ్డాయి. ఏ నక్షత్రంలో పుట్టిన వారు, ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు! ఏ నక్షత్రానికి ఏ వృక్షాన్ని పూజించాలి? నక్షత్రాలకు సంబంధించిన అధి దేవతలెవరు? నక్షత్రానికి సంబంధించిన రంగులూ, వాడాల్సిన రత్నాల గురించీ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nnxzaeC-w-E ]
మనకున్న 27 నక్షత్రాలలో, దేవ గణ నక్షత్రాలూ, మానవ గణ నక్షత్రాలూ, రాక్షస గణ నక్షత్రాలూ, అని మూడు రకాలుంటాయి.
అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమీ, హస్తా, స్వాతీ, అనూరాధ, శ్రవణ, రేవతీ.. ఈ తొమ్మిది నక్షత్రాలూ, దేవగణ నక్షత్రాలు.
భరణీ, రోహిణీ, ఆరుద్ర, పుబ్బ, ఉత్తర, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర.. ఈ తొమ్మిదీ, మానవ గణ నక్షత్రాలు.
ఆశ్లేష, మఖ, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ఠ, శతభిష, చిత్త, కృత్తిక.. ఈ తొమ్మిదీ, రాక్షస గణ నక్షత్రాలు.
ఈ 27 నక్షత్రాలకూ, 27 వృక్షాలు జన్మించాయి. ఆయా నక్షత్రాల వారు, ఆ నక్షత్రానికి చెందిన వృక్షాన్ని, ప్రయత్న పూర్వకంగా అర్చిస్తే, శుభం కలుగుతుంది. గ్రహ స్థితుల వలన ఇబ్బందులు పడుతున్న వారు, ఆయా నక్షత్రాల అధి దేవతలను పూజిస్తూ, ఆ నక్షత్ర రత్నాన్ని ధరించినట్లయితే, ఎటువంటి కష్టాలూ దరిచేరవని, మన జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తోంది. అయితే, ఇందులో వివరించబడిన నక్షత్ర స్వభావాలు, నారద పురాణంలో వివరించబడినవి. ఇక నక్షత్రాల వివరణలోకి వెళితే..
1 – అశ్వినీ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, రూపవంతులు. ఆభరణాలపై ప్రీతి కలిగి ఉంటారు. ఈ నక్షత్ర వృక్షం, వృష (అడ్డరస). ఈ నక్షత్రానికి ఆధిదేవత అర్థనారీశ్వరుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు పసుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం వైఢూర్యం.
2 – భరణీ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు సమర్ధులు. నిత్యం సత్యాలను మాట్లాడుతూ, సత్యవాదిగా జీవిస్తారు. ఈ నక్షత్ర వృక్షం యమకర (దేవదారు). ఈ నక్షత్రానికి ఆధిదేవత సూర్యుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు ఆకాశనీలం. వీళ్ళు వాడాల్సిన రత్నం వజ్రం.
3 – కృత్తికా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, తిండి ప్రియులు, స్థిరమైన బుద్ధి కలవారు, అందరితో చక్కగా, ప్రియంగా మాట్లాడుతూ, మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ నక్షత్ర వృక్షం మేడి. ఈ నక్షత్రానికి అధిదేవత అగ్ని. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు కావి. వీళ్ళు వాడాల్సిన రత్నం మాణిక్యం.
4 – రోహిణీ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు ధనవంతులవుతారు. కృషితో పైకి వస్తారు. ఈ నక్షత్ర వృక్షం నేరేడు. ఈ నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు తెలుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం ముత్యం.
5 – మృగశిరా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు భోగాలను అనుభవిస్తారు. సిరి సంపదలతో తులతూగుతారు. ఈ నక్షత్ర వృక్షం చండ్ర. ఈ నక్షత్రానికి అధిదేవత దుర్గ. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు ఎరుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం పగడం.
6 – ఆర్ధ్రా ( ఆరుద్రా) నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, హింసాశీలిగా ఉంటారు. శఠులు. ఈ నక్షత్ర వృక్షం నల్లజువ్వి. ఈ నక్షత్రానికి ఆధిదేవత కాళి. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు ఎరుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం గోమేధికం.
7 – పునర్వసూ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రియ నిగ్రహం కలవారు. తరుచూ అనారోగ్యం పాలవుతారు. అందరికీ శుభాలందిస్తారు. ఈ నక్షత్ర వృక్షం వెదురు. ఈ నక్షత్రానికి అధిదేవత రాముడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు పసుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం పుష్యరాగం.
8 – పుష్యమీ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు కళాకోవిదులు. మంచి కవులు. సుఖాలను అనుభవించేవారు. ఈ నక్షత్ర వృక్షం పిప్పిలి. ఈ నక్షత్రానికి అధిదేవత దక్షిణామూర్తి. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగులు పసుపు, ఎరుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం నీలం.
9 – ఆశ్లేషా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు ధూర్తులవుతారు. తినకూడని పదార్థాలను కూడా తిని, పాపం మూటకట్టుకుంటారు. ఈ నక్షత్ర వృక్షం నాగ కేసరి. ఈ నక్షత్రానికి అధిదేవత చక్రత్తాళ్వార్. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు కావి. వీళ్ళు వాడాల్సిన రత్నం మరకతం.
10 – మఖా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు భోగులు. లక్ష్మీ కటాక్షంగలవారై, దైవ చింతనతో జీవిస్తుంటారు. ఈ నక్షత్ర వృక్షం మర్రి. ఈ నక్షత్రానికి అధి దేవత ఇంద్రుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు లేతపచ్చ. వీళ్ళు వాడాల్సిన రత్నం వైఢూర్యం.
11 – పుబ్బా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, కళలపై అమితాసక్తిని కలిగి ఉంటారు. ఈ నక్షత్ర వృక్షం మోదుగ. ఈ నక్షత్రానికి ఆధిదేవత రుద్రుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు శ్వేతపట్టు. వీళ్ళు వాడాల్సిన రత్నం పచ్చ.
12 – ఉత్తరా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు ధనవంతులవుతారు. భోగాలను అనుభవిస్తూ జీవిస్తారు. ఈ నక్షత్ర వృక్షం జువ్వి. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు లేతపచ్చ. వీళ్ళు వాడాల్సిన రత్నం మాణిక్యం.
13 – హస్తా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, చోరత్వగుణం కలిగి ఉంటారు. కొంత దైన్య జీవనం సాగిస్తారు. ఈ నక్షత్ర వృక్షం అరిష్ఠ (కుంకుడు). ఈ నక్షత్రానికి అధిదేవత అయ్యప్ప. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు, ముదురు నీలం. వీళ్ళు వాడాల్సిన రత్నం ముత్యం.
14 – చిత్తా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, చంచలమైన గుణం కలిగి ఉంటారు. వీళ్ళు సహృదయులు. ఈ నక్షత్ర వృక్షం శ్రీ వృక్షం (తాటి). ఈ నక్షత్రానికి అధిదేవత విశ్వకర్మ. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు ఎరుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం పగడం.
15 – స్వాతీ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, మంచి నేత్రాలను కలిగి ఉంటారు. చిత్రమైన వస్త్రాలు ధరిస్తూ, ఫ్యాషన్ పై రక్తి కలిగిఉంటారు. వీళ్ళు ధర్మాతులైనప్పటికీ, దయలేనివాళ్ళుగా జీవిస్తుంటారు. ఈ నక్షత్ర వృక్షం మద్ది. ఈ నక్షత్రానికి అధిదేవత వాయుదేవుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు తెలుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం గోమేధికం.
16 – విశాఖ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు లోభగుణం, కోపగుణం కలిగినవాళ్ళు. ఈ నక్షత్ర వృక్షం వికంత. ఈ నక్షత్రానికి అధిదేవత కుమార స్వామి. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు పచ్చ. వీళ్ళు వాడాల్సిన రత్నం పుష్యరాగం.
17 – అనూరాధా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు ప్రయాణాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. విదేశాలలో స్థిరపడడానికి ప్రయత్నిస్తారు. ఈ నక్షత్ర వృక్షం పొగడ. ఈ నక్షత్రానికి అధిదేవత మహాలక్ష్మి. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు పసుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం నీలం.
18 – జ్యేష్ఠ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, ధర్మపరాయణులుగా, సంతోషంగా జీవిస్తారు. ఈ నక్షత్ర వృక్షం విష్ఠి. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు శ్వేతపట్టు. వీళ్ళు వాడాల్సిన రత్నం మరకతం.
19 – మూలా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు ధనవంతులు, అభిమానవంతులు, సుఖవంతులు. ఈ నక్షత్ర వృక్షం సర్జ (వేగిస). ఈ నక్షత్రానికి అధిదేవత నిరుతి. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు ముదురుపచ్చ. వీళ్ళు వాడాల్సిన రత్నం వైఢూర్యం.
20 – పూర్వాషాఢ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, అభిమానవంతులు, సంతోషగుణం కలవారు, అందరి ప్రేమకూ పాత్రులు. ఈ నక్షత్ర వృక్షం కంజల (నెమ్మి). ఈ నక్షత్రానికి అధిదేవత వరుణుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు బూడిద. వీళ్ళు వాడాల్సిన రత్నం వజ్రం.
21 – ఉత్తరాషాఢ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, విరమశీలం కలవారు, ధార్మికులు. ఈ నక్షత్ర వృక్షం పనస. ఈ నక్షత్రానికి అధిదేవత గణపతి. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు తెలుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం మాణిక్యం.
22 – శ్రవణా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు ధనవంతులై, సుఖభోగాలను అనుభవిస్తుంటారు. ఈ నక్షత్ర చెట్టు జిల్లేడు. ఈ నక్షత్రానికి అధిదేవత మహావిష్ణువు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు కావి. వీళ్ళు వాడాల్సిన రత్నం ముత్యం.
23 – ధనిష్ఠా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు దాతలు, శూరులు, ధైర్యవంతులు, ధనవంతులు. ఈ నక్షత్ర వృక్షం జమ్మి. ఈ నక్షత్ర అధిదేవత చిత్రగుప్తుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు పసుపు పట్టు. వీళ్ళు వాడాల్సిన రత్నం పగడం.
24 – శతభిషా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, శత్రువుల్ని జయిస్తారు. వ్యసనపరులై ఉంటారు. ఈ నక్షత్ర చెట్టు కదంబ (అరటి). ఈ నక్షత్ర అధిదేవత భద్రకాళి. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు కాఫీ. వీళ్ళు వాడాల్సిన రత్నం గోమేధికం.
25 – పూర్వాభాద్రా నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, విషయ సుఖాలమీద వ్యామోహంగలవారై ఉంటారు. ఈ నక్షత్ర వృక్షం మామిడి. ఈ నక్షత్రానికి అధిదేవత కుబేరుడు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు ముదురు పసుపు. వీళ్ళు వాడాల్సిన రత్నం పూస.
26 – ఉత్తరాభాద్ర నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు, మంచివక్తలు, ప్రియులు. ఈ నక్షత్ర వృక్షం వేప. ఈ నక్షత్రానికి అధిదేవత కామధేనువు. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు గులాబి. వీళ్ళు వాడాల్సిన రత్నం నల్లపూస.
27 – రేవతీ నక్షత్రం
ఈ నక్షత్రంలో జన్మించిన వారు పవిత్రులు, ధనవంతులు, ధైర్యవంతులు. ఈ నక్షత్ర చెట్టు ద్రాక్ష. ఈ నక్షత్రానికి అధిదేవత అయ్యప్ప. ఈ నక్షత్రం గలవారికి అదృష్ట రంగు ముదురు నీలం. వీళ్ళు వాడాల్సిన రత్నం ముత్యం.
గమనిక: మనిషి జీవితం, కేవలం నక్షత్రాలూ, రాశులను బట్టే కాక, గత జన్మల కర్మఫలాన్ని బట్టీ, మనం చేసే పాప, పుణ్య కార్యాలను బట్టి కూడా, నిర్దేశింపబడుతుంది.
Link: https://www.youtube.com/post/Ugw8FuOfbUKWpGgMXk14AaABCQ
Post a Comment