హనుమంతుడు వివాహితుడా? బ్రహ్మచారా? ఆంజనేయ స్వామి అద్భుత చరిత్ర!


హనుమంతుడు వివాహితుడా? బ్రహ్మచారా? ఆంజనేయ స్వామి అద్భుత చరిత్ర!

రేపు '04/06/2021' హనుమజ్జయంతి శుభాకాంక్షలు!

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |

రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః || ౧ ||

ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః |

లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా || ౨ ||

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6wOkEw-wpsw ​]

హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడూ, శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బంధీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా, ద్రోణాచలమును మోసుకు వచ్చి, యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచిన వాడు.. అని పై పద్యం వివరిస్తుంది. 

వాల్మీకి లిఖించిన రామాయణాన్ని పరిశీలించి సుందరాకాండను పఠించినా, వాటిలో సర్వసద్గుణ సంపన్నులుగా కనపడేది ఇద్దరే ఇద్దరు. ఒకటి యుగ పురుషుడైన శ్రీ రామ చంద్రుడు, రెండు ఆ రామ చంద్రుడి పరమభక్తుడు హనుమంతుడు. అటువంటి అంజనీ పుత్రుడు జన్మించిన పర్వదినం గురించీ, ఆయన జన్మమూ, మహత్తరమైన జీవిత చరిత్ర గురించీ, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

దుష్ఠశిక్షణా శిష్ఠరక్షణ కొరకు, సాక్ష్యాత్తూ ఆ నారాయణుడే నరుడిగా అవతరించి, శ్రీరామునిగా నేటికీ అశేష భక్త కోటిచే పూజలందుకుంటుంటే, కైలాసనాథుడే హనుమంతుడి రూపంలో వచ్చి, రామదూతగా, రామభక్తుడిగా అవతరించాడని, పరాశర సంహిత తెలియజేస్తోంది. స్వామి భక్తి పరాయణుడిగా హనుమ స్థానం, అత్యున్నతం. తాను నమ్మిన రాముడి కోసం, ఎన్ని సాహసాలకు ఒడిగట్టాడో, తనను నమ్మిన భక్తులనూ, అంతే నిష్ఠగా కష్టాల నుంచి ఒడ్డున పడేస్తాడు. అందుకే, భక్తులందరికీ హనుమ అంటే కొండంత ప్రేమ, రామ పాదాలంత భక్తి.

పుంజికస్థల అనే అప్సరస, అంజన అనే వానర కాంతగా జన్మించగా, అమెకూ వానరవీరుడైన కేసరికీ పుట్టిన ముద్దుల తనయుడు మారుతి. కేసరికీ, అంజనీ మాతకూ పెళ్లి జరిగి ఎన్నో ఏండ్లు గడిచినా, పిల్లలు కలుగకపోవడంతో, వారు ప్రతి నిత్యం ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించేవారు. వారి ప్రార్థనల ఫలితంగా, వాయుదేవుడు శివుని తేజముగల ఒక పండుని ప్రసాదించగా, ఆ ఫల ప్రభావంచే, అంజనీ మాతకు జన్మించిన బిడ్డడే, ఆంజనేయుడు. అంజనీదేవి ప్రియ పుత్రుడగుటచే, ఆయనకు ఆంజనేయుడనే పేరు వచ్చిందని, మన పురాణాలు చెబుతున్నాయి. ఆ మారుతి వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడని, ఆ రోజుని హనుమాన్ జయంతిగా జరుపుకోవడం, మనకి అనాదిగా వస్తోంది. అయితే, ఉత్తర భారతదేశంలో మాత్రం, ఛైత్ర పౌర్ణమి నాడు, హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. వాయుదేవుని అనుగ్రహముచే జన్మించిన కేసరీ నందనుడు, జన్మత: బలసంపన్నుడూ, పలు సిద్ధులు కలిగినవాడు. ఈ సిద్ధులను, పసి వయస్సులోనే హనుమంతుడు ప్రదర్శించాడు. బాల మారుతికి ఒకనాడు తెల్లవారుజామునే, విపరీతమైన ఆకలి వేసింది. తన ఆకలి తీర్చమని అంజనీమాతను అడుగగా, ఆమె ఏదైనా ఎర్రగా పండిన ఫలాన్ని తినమని చెప్పింది. దాంతో హనుమంతుడు, తన ఆకలి తీర్చుకోవడానికి, ఎర్రని ఫలం గురించి వెతకగా, అప్పుడే ఉదయిస్తున్న ఎర్రటి రూపం గల బాలభానుడు, ఆయన కంటపడ్డాడు. ఆ సూర్య భగవానుడు మంచి పండు అనిపించడంతో, హనుమ ఒక్కసారిగా పైకి ఎగిరి, సూర్యుడిని తినడానికి వెళ్ళసాగాడు. అదే సమయంలో రాహువు, సూర్యుడికి గ్రహణం పట్టించడానికి వచ్చాడు. అంతేగాక, రాహువు హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలిచాడు. దాంతో కోపోద్రిక్తుడైన హనుమంతుడు, తన ఆహారానికి అడ్డం వచ్చిన రాహువుని ఒక్క దెబ్బ కొట్టగా, అతడు గిర్రున తిరిగి, దేవేంద్రుడి వద్దపడి, జరిగినదంతా చెప్పాడు. హనుమంతుడు చేసిన పనికి కోపగించుకున్న ఇంద్రుడు, తన వద్దనున్న వజ్రాయుధంతో దవడపై కొట్టాడు. ఆ దెబ్బకి మారుతి దవడ వాచి, సొమ్మసిల్లి పడిపోయాడు. దవడ అంటే, హనుమ అనే అర్థం వస్తుంది. అందువల్లనే, నాటి నుంచి ఆయనకు హనుమంతుడు, అనే పేరు సార్థకమైంది.

తన వర ప్రభావముచే పుట్టిన ఆంజనేయుడు స్పృహ కోల్పోవడంతో ఆగ్రహించిన వాయుదేవుడు, సకల లోకాలలో వాయువుని స్తంభింపజేశాడు. దాంతో సర్వలోకాలూ పెను ప్రమాదంలో పడటంతో, బ్రహ్మాది దేవతలు తరలివచ్చి, హనుమంతుడికి సపర్యలు చేసి, విశేషమైన వరాలిచ్చారు. దాంతో, వాయుదేవుడు శాంతించాడు. చిన్న వయస్సులోనే అన్ని వరాలు పొందడంతో, హనుమ అల్లరి ఎక్కువై, ఒకానొక సమయంలో, రుషులు చేస్తున్న యాగానికి భంగం కలిగించాడు. ఆ పనితో కోపగించుకున్న రుషులు, మరొకరు నీకు చెప్పేవరకూ, నీ శక్తులు నీకు గుర్తుండవు, అని శపించారు. ఈ సంఘటన తరువాత, ఆంజనేయుడిని విద్యాభ్యాసం కొరకు సూర్యుని వద్దకు పంపగా, ఆయన సూర్యభగవానుడి వద్దనుంచి, సకల శాస్త్రాలపై, సకల విద్యలపై పట్టుసాధించాడు. అయితే, విద్యాభ్యాస సమయంలో, కొన్ని విద్యలు వివాహితులకు మాత్రమే అర్హత ఉందనీ, అందువల్ల వాటిని నేర్పేందుకు, సూర్యభగవానుడు, తన కుమార్తె అయిన సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేశాడనీ, అయినా, హనుమంతుడి బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ, కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఈ కథల ఆధారంగానే, హనుమాన్ జయంతి రోజున, ఉత్తరాదిలోని కొన్ని ఆలయాలలో, హనుమంతుడి కళ్యాణం జరిపిస్తారు. ఇదిలా ఉంటే, సూర్యభగవానుడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న హనుమంతుడిని, ఆ ఆదిత్యుడు గురుదక్షిణగా, తన ప్రభావంతో పుట్టిన సూర్యపుత్రుడు, సుగ్రీవుడి వద్ద మంత్రిగా ఉండమని కోరాడట. అందుకు అంగీకరించిన హనుమ, కిష్కిందలో ఉన్న వాలి, సుగ్రీవుల వద్దకు వెళ్ళాడు. కొంతకాలానికి వాలి, సుగ్రీవుల మధ్య తలెత్తిన వైరం వల్ల, సుగ్రీవుడు తన అంతరంగికులైన హనమదాదులతో సహా, రుష్యమూక పర్వతముపై తలదాచుకోగా, సీతాన్వేషణకై అటుగా రామ లక్ష్మణులు రావడం గమనించిన సుగ్రీవుడు, తనని చంపడానికి తన అన్న వాలీయే, ఎవరో మానవులను పంపాడని కలవరపడ్డాడు. తన రాజు భయాన్ని పోగొట్టడానికి హనుమ, తాను వెళ్లి వారెవరో కనుక్కుని వస్తానని చెప్పి, మారువేషంలో రామ లక్ష్మణుల వద్దకు వెళ్లగా, అక్కడ రాముని తేజస్సుకి మంత్రముగ్ధుడైన హనుమ, తన జీవితం ఇక రామునికే అంకితం అని నిశ్చయించుకుని, ఆయన్ని పరిపరివిధాలుగా కీర్తించాడు. హనుమ పలుకులకు మిక్కిలి సంతోషించిన రాముడు, వెంటనే ఆయన్ని ఆలింగనం చేసుకుని, ఆయన నిజరూపాన్ని కూడా బయటపెట్టాడు. ఆ తరువాత హనుమ, రామునికీ, సుగ్రీవునికీ మధ్య మైత్రి చేకూర్చడంతో, ఆ మైత్రిలో భాగంగా, రాముడు వాలిని చంపి, కిష్కింధకు సుగ్రీవుడిని రాజుగా, పట్టాభిషిక్తుడ్ని చెయ్యడం, ఆ వెంటనే తన సైన్యాన్ని, సీతాన్వేషణకై పంపడం జరిగిందనే విషయం, మనకు తెలిసిందే.

సీతాదేవి జాడకై నాలుగు దిక్కులకు వెళ్లిన వానర సైన్యంలో, అంగదుడు నాయకత్వం వహిస్తున్న బృందం దక్షిణ దిక్కుగా వెళ్లడం, అందులోనే హనుమ, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులు ఉండడం జరిగింది. అలా వెళ్లిన వారు, సంపాతి అనే రాజు ద్వారా, సీతాదేవి లంకలో రావణుని చెరలో బంధీగా ఉందని తెలుసుకున్నాడు. అయితే, నూరు యోజనాల దూరం విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలో తెలియక, ఇబ్బంది పడుతున్న సమయంలో, ఈ పని కేవలం ఆంజనేయుడు మాత్రమే చెయ్యగలడని తెలుసుకున్న జాంబవంతుడు, ఆయనకు ఉన్న శక్తుల గురించి చెప్పి, హనుమలోని శక్తులన్నింటినీ మళ్లీ హనుమంతుడి స్పృహలోకి వచ్చేటట్లు చేశాడు. అంతట హనుమ మిక్కిలి ఆత్మవిశ్వాసంతో, మహేంద్రగిరిపైకి ఎక్కి, సకల దేవతలనూ ప్రార్థించి, సీతమ్మవారి జాడ తెలుసుకుని వస్తానని తన సహచరులతో చెప్పి, ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి, లంకవైపుకు లంఘించాడు.

దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహిణీ రాక్షసిని సంహరించి, రామబాణంలా లంకలో వాలాడు. చీకటిపడిన తరువాత, లంకిణిని దండించి, లంకలోకి ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. సూక్ష్మ శరీరము ధరించి, లంకానగరం మొత్తం కలయతిరగగా, అక్కడున్న ఒక వనంలోని ఒక చెట్టు క్రింద, సీతమ్మను చూశాడు. అదే సమయంలో రావణుడు అక్కడకు వచ్చి, సీతాదేవిని బెదిరించి, తనకు వశముకావలెనని చెప్పి, ఒక నెల రోజులు గడువు పెట్టి వెళ్లిపోయాడు. దాంతో, ఆమె సీతాదేవని నిర్ధారించుకుని, సీతమ్మ వద్దకు మెల్లగా చేరుకుని, జరిగిన వృత్తాంతమంతా చెప్పి, ఆమె సందేహాలను నివృత్తి చేసి, రాముల వారు ఇచ్చిన అంగుళీకాన్ని, ఆమెకు అందించాడు. దాంతో సీతమ్మ వారు సంతోషించి, తన గుర్తుగా చూడామణిని హనుమంతుల వారికిచ్చి పంపింది. అయితే, రావణుడిని కలిసి, ఒకసారి హెచ్చరిద్దామనే ఉద్దేశ్యంతో, సీతమ్మ ఆదేశం తీసుకుని, లంకను మొత్తం అల్లకల్లోలం చేయ్యగా, ఈ విషయం తెలుసుకున్న రావణుడు, తన సైన్యంలోని కొంతమంది వీరులను పంపగా, వారందరినీ యమపురికి పంపించాడు హనుమ. ఆఖరిగా ఇంద్రజిత్తు వేసిన అస్త్రానికి బంధీ అయినట్లు నటించి, రావణుడి వద్దకు వెళ్లి, అక్కడ తన బలాన్ని చూపించడంతో పాటు, సీతమ్మను అప్పజెప్పి, రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు పలికాడు. అంతట రావణుడు ఉగ్రుడై, హనుమ తోకకు నిప్పంటించమని ఆదేశించగా, ఆ నిప్పుతోనే స్వర్ణలంకను కాస్తా దహించి వేసి, తిరిగి ప్రయాణమై, మహేంద్రగిరిపై వాలి, జరిగిన వృత్తాంతాన్ని తన వారికి చెప్పి, వారందరితో కలిసి రాముని వద్దకు వెళ్లాడు.

అక్కడ రామునికి సీతమ్మజాడను చెప్పి, లంకకు పయనమై, రావణ సైన్యంతో ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భాగంగా, ధూమ్రాక్షుడూ, అకంపనుడూ, దేవాంతకుడూ, త్రిశిరుడూ, నికుంభుడి వంటి మహావీరులతో పాటు, ఎంతో మంది రావణ సైన్యాన్ని హతమార్చాడు. ఆ యుద్ధంలో భాగంగానే ఒకనాడు, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మస్త్రం వల్ల, లక్ష్మణుడు వివశుడవ్వగా, ఆయన్ని బ్రతింకించుకోవడానికి, ఏకంగా సంజీవనీ పర్వతాన్నే తెచ్చి పెట్టిన మహాబలవంతుడు, హనుమ. ఆపై భీకర సంగ్రామంలో, రామ లక్ష్మణులకూ, యావత్ వానరసైన్యానికీ అండగా వుండి, యుద్ధాననంతరం, సీతాసమేత రాముడితోనూ, లక్ష్మణుడితోనూ కలసి, అయోధ్యకు చేరుకుని, తక్కిన కాలం మొత్తం, రామసేవలోనే గడిపాడు హనుమంతుడు. ఒకానొక సమయంలో, సీతాదేవి తన నుదిటికి సింధూరం పెట్టుకోవడం చూసి, ఆమె చెంతచేరి, ‘తల్లీ, మీరెందుకని సింధూరం నుదుటన పెట్టుకుంటున్నారు? అని అడుగగా, దానికి ఆమె తన పతి అయిన శ్రీ రాముడి దీర్ఘాయుష్యుకై అని చెప్పిందట. అప్పుడు వెంటనే హనుమంతుడు, తన శరీరం మొత్తం సింధూరం పూసుకున్నాడు. రామునిపై హనుమకి వున్న భక్తికి, ఇదో నిదర్శనం అని పెద్దలు అంటారు. అందువల్లనే, నేటికీ హనుమంతుల వారి విగ్రహానికి, పూర్తిగా సింధూరం పూస్తారు. మరొక సందర్భంలో, హనుమ తన గుండెలను చీల్చి, అందులో సీతారాముల వారిని చూపించి, వారిపై తనకున్న భక్తిప్రపత్తులను, సర్వ లోకాలకూ చూపించాడు. హనుమ అంటే, భక్తికి నిదర్శనం. హనుమ అంటే, ధైర్యానికి మరో రూపం. హనుమ అంటే, కార్య సిద్ధికి పర్యాయపదం. హనుమ అంటే, విధేయతకు మారుపేరు. హనుమ అంటే, బలానికీ, అరివీర పరాక్రమమునకూ నిలువెత్తు సాక్షీ భూతం. అటువంటి హనుమంతుల వారిని నిత్యం, అంత:కరణ శుద్ధితో పూజిద్దాం. స్వామి కరుణకు పాత్రులమవుదాం.

జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🚩

Link: https://www.youtube.com/post/UgwfIsyfKXD0QtMJYQt4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes