వట సావిత్రీ వ్రతం - Vat Savitri Puja

 

రేపు 24/06/2021 ‘వట సావిత్రీ వ్రతం’!

ప్రాచీన కాలం నుంచీ, మన హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం, మానవులలోని దోషాలనూ, నష్టాలనూ, పాపాలనూ తొలగించుకోవడానికీ, అష్టైశ్వర్యాలనూ, సకల సౌభాగ్యాలనూ పొందడానికీ, ఎన్నోరకాల నోములూ, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా, ఇటువంటి ఆచారాలను అవలంభించడం జరిగింది. అటువంటి నోములలో, ‘వట సావిత్రీ వ్రతం’ కూడా ఒకటి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి, సకల సౌభాగ్యాలూ లభించడంతో పాటు, రకరకాల దోషాలూ, పాపాలూ, కష్టనష్టాల నుంచి విముక్తినీ పొందుతారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iweHMvboCqQ ​]

పూర్వం సతీ సావిత్రి కూడా, ఈ వట సావిత్రీ వ్రతాన్ని ఆచరించి, తన భర్త అయిన 'సత్యవంతుని', మృత్యువు నుంచి కాపాడుకో గలిగింది. అటువంటి మహోన్నత శక్తిని కలిగిన ఈ వ్రతాన్ని, జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు, లేదా జ్యేష్ఠ బహుళ అమావాస్యనాడు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించుకుంటారు. ఈ వ్రతం ఆచరణలో ఎటువంటి సమస్యలూ కలగనీయకుండా, అన్ని జాగ్రత్తలూ ముందుగానే తీసుకోవాలి. వ్రతం భగ్నమయితే, ఎటువంటి ఫలితాలూ దక్కవు. అలాగే, ఈ వ్రతంలో ఏ ఒక్క పద్ధతిని సరిగ్గా అవలంభించకపోయినా, నష్టాలు వాటిల్లుతాయి.

కాబట్టి, చాలా జాగ్రత్తగా, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహించుకోవాలి. ఈ వట సావిత్రీ వ్రతాన్ని, మన భారతదేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క రకంగా చేసుకుంటారు.

పురాణ గాథ:

ఈ వ్రతం వెనుక ఉన్న సావిత్రీ, సత్యవంతులకు సంబంధించిన గాథ ఉంది. ఈ వ్రతం ఆచరించే సావిత్రి, తన భర్త సత్యవంతుని మృత్యువునుంచి కాపాడుకో గలిగింది. అశ్వపతి - మాళవి దంపతుల కూతురు ‘సావిత్రి’ యుక్త వయస్సులో ఉండగా, నీకు ఇష్టమైన వాడిని వరించమని, తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో, అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి తనయుడైన సత్యవంతుని వివాహమాడతానని, తల్లిదండ్రులకు తెలిపింది. సత్యవంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్పటికీ, సావిత్రి పట్టుపట్టడంతో, సత్యవంతుడితోనే వివాహం చేశారు. మెట్టినింట చేరి, భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది.

సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాల కోసం అడవికి బయలుదేరగా, సావిత్రీ, భర్త వెంట వెళ్లింది. సమిధలను కోసి, చెట్టు దిగిన సత్యవంతుడు, తలభారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది. కొద్ది సేపటికి యముడు తన దూతలతో వచ్చి, సత్యవంతుడికి యమపాశం వేసి, తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడా తన భర్తను అనుసరించి వెళ్ళసాగింది. యముడు వారించినప్పటికీ, భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో, ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు, సావిత్రిని వరం కోరుకోమన్నాడు.

‘మామగారికి దృష్టి ప్రసాదించండి’ అని, ఓ వరాన్ని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు మరో వరాన్ని కోరుకోమన్నాడు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని, తిరిగి ప్రసాదించమని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో, ఆమె పతి భక్తిని మెచ్చి, మూడవ వరం కోరుకోమనగా, ‘తాను తల్లి అయ్యేటట్లు వరాన్ని ప్రసాదించండ’ని కోరింది. యముడు సావిత్రి పతి భక్తిని మెచ్చి, ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా, వటవృక్షానికి పూజ చేసి, భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథనం. అప్పటినుంచే వటవృక్షాన్నీ, సావిత్రినీ పూజిస్తూ చేసే ‘వట సావిత్రీ వ్రతం’ అమలులోకి వచ్చినట్లు పురాణగాథ.

వ్రత విధానం..

ఈ వ్రతాన్ని చేసుకునేవారు, ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం వుండాలి. ఏ రకమైన తినుబండారాలను గానీ, పళ్లను గానీ తీసుకోకూడదు. తెల్లవారు జామున నిద్ర లేవగానే, రోజువారీ కార్యక్రమాలను ముగించుకుని, తలస్నానం చేసుకోవాలి. మనసులో దేవుడిని, దారిపొడవునా స్మరించుకుంటూ, మర్రిచెట్టు దగ్గరకు చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తరువాత, మర్రిచెట్టు వద్ద అలికి, ముగ్గులు వేసి, సావిత్రీ, సత్యవంతుల బొమ్మలను ప్రతిష్టించుకోవాలి. ఒకవేళ వారి చిత్రపటాలుగనుక లభించకపోతే, పసుపుతో చేసిన బొమ్మలను ప్రతిష్టించుకోవాలి. ఈ విధంగా చేసిన వారికి, వైధవ్యాది సకల దోషాల నుంచీ పరిహారం లభిస్తుంది.

ఆ తరువాత.. 'బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం.. సత్యవత్సావిత్రీ ప్రీత్యర్థంచ.. వట సావిత్రీ వ్రతం కరిష్యే' అనే శ్లోకాన్ని భక్తితో పఠించాలి. ఈ విధంగా మర్రిచెట్టును పూజించడం వల్ల, త్రిమూర్తులను పూజించినంత ఫలితం దక్కుతుందంటారు. పూజానంతరం, 'ఓం నమో వైవస్వతాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ, మర్రిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం, నైవేద్యం సమర్పించి, బ్రాహ్మణులకూ, ముత్తైదువులకూ, దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఇలా చేసిన వారికి, వారి భర్త దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడని, మన పెద్దలు చెబుతారు..

శుభం భూయాత్..

Link: https://www.youtube.com/post/Ugy5-KENL68Ctlxr6nd4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes