‘ఆషాఢం’ ఎందుకు శుభకార్యాలకు అనువు కాని మాసం! Significance of Ashada Month

 

‘ఆషాఢం’ ఎందుకు శుభకార్యాలకు అనువు కాని మాసం!

మన సనాతన ధర్మంలో ప్రతి విషయం, ప్రత్యకమే. మంచిని ఎలా ఆహ్వానించాలి, చెడును ఎలా దూరం చేసుకోవాలి అనే విషయాలు, మన పెద్దలు మనకు వెల్లడించారు. మన సంప్రదాయం, ప్రకృతితో ముడిపడి ఉంటుంది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/MRiexGfghUM ​]

మన రుతువులు కూడా, నక్షత్రాల ఆధారంగానే నిర్ణయించబడతాయి. అలా పూర్వ ఆషాఢ నక్షత్రంలో, పౌర్ణమి ఉన్న నెలను, 'ఉత్తర ఆషాఢ' మాసంగా చెబుతారు పండితులు. ఈ ఆషాఢ మాసాన్ని, శూన్య మాసం అని కూడా అంటారు. ఈ మాసం మనకు ఎంతో పవిత్రమైనది. శుభకార్యాలకు మంచిది కాని ఈ శూన్య మాసం విశిష్ఠత ఏంటి? ఈ మాసంలో ఉండే ప్రత్యేకతలేంటి? అనేటటువంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

మనకున్న 12 నెలలలో, అశుభమాసంగా పేర్కొనబడేది ఆషాఢ మాసం. గృహ ప్రవేశాలూ, పెళ్లిళ్లూ వంటి శుభకార్యాలకు దూరం, ఈ మాసం. ప్రత్యేక పూజలకూ, వ్రతాలకూ నెలవు, ఈ మాసం. మన లౌకిక ఆనందాలకు దూరంగా, ఆధ్యాత్మాక భావనకు దగ్గరగా గడిపే ఈ మాసం, ఎంతో ప్రత్యేకమైనది. ఆషాఢ మాసంలో, అనేక పండుగలూ, ఉత్సవాలూ నిర్వహిస్తారు. తెలంగాణాలో బోనాలూ, ఒడిశాలో జగన్నాథ స్వామి రథయాత్రా, త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినమైన గురు పూర్ణిమ, సూర్యుడు ఉత్తరం నుండి, దక్షిణదిశకు తిరిగే భాను సప్తమీ, చాతుర్మాస్య వ్రతం ప్రారంభమయ్యే తొలి ఏకాదశీ, కఠోర నియమాలతో చేసే కుమార షష్ఠీ వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగినది, ఈ ఆషాఢ మాసం.

ఈ  నెలలో దేవాలయాలన్నీ, భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు, శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇది మొదలు, కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకూ, చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్లు చేయకపోవడానికి, ఇది కూడా ఒక కారణం. శ్రీ హరి యోగ నిద్రలో ఉండడం వలన, వివాహం చేసుకున్న కొత్త దంపతులకు ఆయన ఆశీర్వాదం ఉండదని, పెద్దల భావన. రుతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల, ఈ కాలంలో, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ సమయంలో పెళ్లిళ్లు పెట్టుకుంటే ఇబ్బందులు ఉంటాయని, వాటిని వాయిదా వేస్తారు. ఆషాఢ మాసంలో, భార్యభర్తలు ఒకే ఇంటిలో ఉండకూడదని అంటారు. నూతన వధూవరులు శారీరకంగా దూరమై, మానసికంగా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ దగ్గరవుతారనే ముందు జాగ్రత్త, మన పెద్దలది.

తెలంగాణ రాష్ట్రంలో, బోనాల పండుగ ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతుంది. అన్నం, బెల్లం, పెరుగూ, పసుపు నీళ్లూ, వేపాకులూ కలిపిన బోనాన్ని, అమ్మవారికి నివేదన చేస్తారు. వర్షాకాలం ఆరంభమయ్యే ఈ మాసంలో, అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు, భక్తులు బోనాలను సమర్పిస్తారు. బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారి రథోత్సవం, ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుండి, ఎంతో మంది భక్తులు విచ్చేస్తుంటారు.

ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక ప్రత్యేకతలు కలిగిన ఈ మాసంలో, గోరింటాకు పెట్టుకోవడం అనేది, ఒక ఆచారం. ఆడవారందరూ, తప్పకుండా ఈ నెలలో గోరింటాకును పెట్టుకోవడం, ఆది కాలం నుండీ ఆనవాయితీగా వస్తోంది. ఎందుకంటే, ఆషాఢ మాసంలో, వాతావరణం మారుతూ ఉంటుంది. ఈ సమయంలో, ఆనారోగ్య సమస్యలు రాకుండా, గోరింటాకు, ఆరోగ్య ప్రదాయినిగా సహాయపడుతుంది. ఆధ్యాత్మిక సంప్రదాయాలూ, ఆచారాలూ పాటించడం వలన, ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ లాభాలను విడమరిచి చెప్పకుండా, వాటిని ఒక ఆనవాయితీగా, విధిగా సూచించారు. మన పెద్దలు చెప్పిన ప్రతి మాటలోనూ, ఎంతో పరమార్థం దాగి ఉంటుందనేది, అక్షర సత్యం.

శుభం భూయాత్!

Link: https://www.youtube.com/post/UgwZrNwbmqxxFpk9Aat4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes