గుణాకరుడు – అందాల యక్షిణి! విక్రమార్క బేతాళ కథలు!


గుణాకరుడు – అందాల యక్షిణి! విక్రమార్క బేతాళ కథలు!

విక్రమార్క బేతాళ కథలలో, సన్యాసిగా మారిన హరిస్వామి మరణం వలన, ఎవరికి బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంటుంది? అనే విషయాన్ని, గత భాగంలో తెలుసుకున్నాము. ఇక బేతాళుడు చెప్పిన నాలుగవ కథ, ‘గుణాకరుడి కథ’. ఈ కథా, బేతాళుడు వేసిన చిక్కు ప్రశ్న, దానికి విక్రమార్క మహారాజు చెప్పిన సమాధానం ఏంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Ie7svrp0yOE ​]

పూర్వం ఉజ్జయినీ నగరంలో, దేవశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడి కుమారుడు గుణాకరుడు. అతను దుర్గుణాలకు నిథి. అతడికి అన్ని రకాల వ్యసనాలూ ఉన్నాయి. దుర్వ్యసనాలూ, దుష్టసావాసాల కారణంగా, పిత్రార్జితాన్ని చాలా వరకూ నాశనం చేశాడు. అతడి ప్రవర్తన చూసీ చూసీ విసుగు పుట్టిన తల్లీ, తండ్రీ, బంధుగణమంతా తమ పరువుపోతోందని భావించి, అతణ్ణి ఇంటి నుండి తరిమివేశారు. గుణాకరుడు ఇంటి నుండి బయటపడి, గమ్యం అనేది లేకుండా, ఎక్కడెక్కడో సంచరించాడు. విధివశాత్తు, అలా సంచరిస్తున్న గుణాకరుడు, ఒక సిద్ధాశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో, కపర్ధి అనే సిద్ధ పురుషుడున్నాడు. గుణాకరుణ్ణి చూసి, అతడు ఆకలితో ఉన్నాడని గ్రహించి, కొంత ఆహారాన్ని అందించాడు. అయితే, గుణాకరుడు దాన్ని స్వీకరించలేదు.

అప్పుడు కపర్ధిముని, ఒక యక్షిణీ స్త్రీ ని పిలిచి, అతడికి భోజనం పెట్టమని చెప్పాడు. కపర్ధిముని పిలిచిన యక్షిణి, గుణాకరుడి దగ్గరకు వచ్చి, సాదరంగా తన కుటీరంలోకి ఆహ్వానించింది. ఆమె అందానికి ముగ్ధుడై పోయిన గుణాకరుడు, మారు మాట్లాడకుండా, ఆమె వెంట లోపలికి వెళ్ళాడు. లోపల ఆ యక్షిణి, అతడికి భోజనాన్ని వడ్డించి, తిరిగి తన లోకానికి వెళ్ళిపోయింది. భోజనం ముగించి చూసేసరికి, గుణాకరుడికి యక్షిణి కనిపించలేదు. వెంటనే కపర్ధిముని దగ్గరికి వచ్చి, యక్షిణిని కలిసే మార్గం చెప్పమని, ప్రాథేయపడ్డాడు. ఆమె లేకపోతే తాను జీవించలేనన్నాడు. గుణాకరుడి ప్రార్థన విని, కపర్ధి ముని మనస్సు కరిగిపోయింది. ఆయన ఒక మంత్రాన్ని గుణాకరుడికి ఉపదేశించి, "కుమారా, నీవీ మంత్రాన్ని నలభైరోజుల పాటు దీక్షగా, అర్ధరాత్రి పూట నీళ్ళల్లో నిలబడి, ఉదయం దాకా పఠించు. నీకు మంత్ర సిద్ధి కలిగితే, నీవు కోరిన యక్షిణి, నీ దగ్గరకు వస్తుంది" అని చెప్పాడు.

కపర్ధిముని చెప్పినట్టే, గుణాకరుడు ఏకాగ్రతతో, యక్షిణీ మంత్రాన్ని సాధన చేశాడు. అయితే, అతడికి మంత్రం సిద్ధించలేదు. ఇక చేసేదేమీ లేక, తిరిగి కపర్థిముని దగ్గరకు వచ్చి, విషయం చెప్పాడు. ఆయన గుణాకరుడికి మరో మార్గం సూచించాడు. ఆయన మాట ప్రకారం, గుణాకరుడు తిరిగి ఇంటికి చేరాడు. తల్లి తండ్రులకు నమస్కరించి, వారిని క్షమించమని ప్రార్ధించాడు. ఆ మర్నాడే, ఒక సన్యాసి మఠానికి వెళ్లి, దీక్షని స్వీకరించి, పవిత్రుడయ్యాడు. కొంతకాలం తర్వాత, పంచాగ్నుల మధ్యలో నిలబడి, తిరిగి పూర్వం తాను చేసిన యక్షిణీ మంత్రాన్ని, నలభైరోజులు సాధన చేశాడు. అయినా, అతడికి మంత్రసిద్ధి కలుగలేదు.

ఓ విక్రమార్క మహారాజా! గుణాకరుడు, సిద్ధ పురుషుడైన కపర్ధిముని చెప్పిన విధంగానే, సాధన చేశాడు. అయినా, అతడికి మంత్రసిద్ధి ఎందుకు కలగలేదు? అని ప్రశ్నించాడు బేతాళుడు.

అందుకు విక్రమార్కుడు, ‘విప్రవరా! సాధకుడన్న వాడికి మంత్రసిద్ధి కలగాలంటే, మూడు ప్రధానమైన సుగుణాలుండాలి. అవి, 1. మనస్సు, 2. వాక్కు 3. శరీరం. ఈ మూడింటి ఏకాత్మ్యం. మనస్సు, వాక్కు, కలిపిచేసిన సాధన, పరలోక సుఖాల కోసం పనికి వస్తుంది. ఇక మనస్సు, శరీరం, కలిపి చేసే సాధన వల్ల, అందమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ అందమైన ఫలితాలు అంటే, ఇహలోకంలో తక్కవ, పరలోకంలో ఎక్కువ ఫలితాలు లభించడం. ఇలా మనస్సు - శరీరం ఏకం చేసి చేసే సాధనాఫలాలు, మరో జన్మలోనే సిద్ధిస్తాయి. అదే, సాధకుడు తన మనస్సునీ, మాటనీ, శరీరాన్నీ ఏకం చేసి గనుక సాధన చేస్తే, అది ఈ జన్మలోనే, శీఘ్రంగా ఫలితాన్నిస్తుంది. అంతేకాదు, మరణానంతరం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది.

ఈ కథలో గుణాకరుడు ఎంతో కష్టపడి మంత్రాన్ని జపించాడు. కానీ, రెండుసార్లు సాధన చేసినప్పుడు, అతడికి మనోయోగం సరిపోలేదు. అలాగే, పంచాగ్నుల్లో నిలబడి మంత్రజపం చేసినప్పుడు కూడా, అతడి శరీరం, మాట, ఏకమయ్యాయి కానీ, మనస్సు మాత్రం, మంత్రం మీదకాక, యక్షిణి అందం మీదే, లగ్నమైవుంది. అందువల్ల అతడికి మంత్రసిద్ధి లభించలేదు. అయితే, అతడి సాధన ఏ మాత్రం వృధాకాదు. ఇప్పుడు చేసిన సాధన వల్ల, మరో జన్మలో యక్షుడిగా జన్మించి, ఆ యక్షిణిని తప్పకుండా పొందుతాడు’ అని చెప్పాడు. మహారాజు చెప్పిన సమాధానం విని, ఎంతో ఆనందించాడు బేతాళుడు.

ఇక మన తదుపరి వీడియోలో, బేతాళుడి అయిదవ ప్రశ్న, అయిదవ కథ అయిన ‘నలుగురు మూర్ఖుల కథ’ను గురించి తెలుసుకుందాము..

Link: https://www.youtube.com/post/UgyXqT7jxonoDf11Ps14AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes