రాధా కృష్ణుల వియోగం వెనుక దాగిన దేవ రహస్యం! Radha Krishna


రాధా కృష్ణుల వియోగం వెనుక దాగిన దేవ రహస్యం!

ఈ సృష్టిలో ముక్కోటి దేవతలున్నా, ప్రేమమూర్తులుగా, అందరిచేతా ఆరాధించబడేవారు, కేవలం రాధా కృష్ణులు మాత్రమే. ఈ సకల చరాచర జగత్తునీ మాయలో ఓలలాడించి, ఆడించే పరంధాముడు, ఆ నీల మేఘశ్యాముడి ప్రేమ అందరికీ సొంతమైనా, ఆయనకు ప్రియ సఖిగా, ఆయనతో సమానురాలిగా పూజలందుకునేది మాత్రం, రాధా దేవి.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xZvBKP2PoSI ​]

అనంతమైన ప్రేమతత్వానికి రూపాన్నిచ్చి, యుగయుగాలుగా, చిరస్మరణీయంగా మిగిలిన వారు, ఆ రాధా కృష్ణులు. ఆ కృష్ణ పరంధాముడు, ప్రేమ మూర్తి.. ఆయనకు అష్టమహిషులూ, 16 వేల మంది గోపికలూ ఉన్నారు. కృష్ణుడు వారిని వివాహం చేసుకోవడానికి గల కారణాలూ, అందుకు వారు చేసుకున్న గత జన్మ పుణ్య ఫలాల గురించి, మన గత వీడియోలో తెలుసుకున్నాము.. 

[ శ్రీ కృష్ణుడి అష్టభార్యల పరిణయం వెనుక దాగిన రహస్యాలు! = https://youtu.be/IKbw0J6koIU ]

అయితే, ప్రేమికులకు ప్రతిరూపంగా చెప్పబడే రాధా కృష్ణులు, పెళ్ళి వైపుగా అడుగులు వేయకపోవడానికి గల కారణం ఏంటి? మేనత్త వరసైన రాధా దేవిని, కృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు? వీరిరువురి మధ్యా గల వయస్సు వ్యత్యాసమే ఆటంకంగా మారిందా? కృష్ణుడి ప్రియసఖిగా, దేవలయాలలో సైతం, భగవానుడితో సమాన పూజలందుకుంటున్న రాధా దేవి అసలు ఎవరు? రాధా కృష్ణుల ప్రణయం వెనుక దాగిన రహస్యం ఏంటి? మన పురాణాలలో వివరించబడిన గాధేంటి? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

సంసార సుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతః ।

బహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణశ్శరణం మమ ।।

‘శ్రీకృష్ణ’ శబ్దంలోనే ఆకర్షణ ఉంది. ‘కృష్ణ’ అంటే ‘నలుపు’ అని అర్థం. శూన్యప్రదేశమంతా నలుపులోనే కనిపిస్తుంది. వెలుగుకు వెనుక చీకటి ఉంటుంది. ఆకాశంలోనూ మనకు కృష్ణబిలాలు ఉంటాయి. అవి తీవ్ర ఆకర్షణతోకూడిన అతిశక్తి కేంద్రాలు. పోతన ‘భాగవతం’లోని ‘గజేంద్రమోక్షం’లో పేర్కొన్న ‘పెంజీకటి’కూడా కృష్ణమయమే. ఇటువంటి కృష్ణతత్త్వానికి ప్రతీక మన భాగవత శ్రీకృష్ణుడు. అందరినీ ఆకర్షింపజేసేవాడు, అందరి కష్టాలనూ తొలగించేవాడు, అందరి తలలో నాలుకలాంటివాడు. సాధువులకూ, సాధకులకూ మోక్షప్రదాత. ఎదిరించిన వానికికూడా జ్ఞానప్రదాత. అజ్ఞానంతో లోకాన్నీ, తననూ ఇబ్బందులకు గురిజేసేవారినీ ఆదుకున్నవాడు. సాధుత్వ రక్షణ, దుష్టత్వ శిక్షణకు ఆవిర్భవించిందే ‘శ్రీకృష్ణావతారం’.

అటువంటి శ్రీ కృష్ణుడి ప్రేమను పొందిన ప్రియ భక్తురాలైన రాధా దేవి వృత్తాంతాన్ని, పార్వతీ దేవి కోరిక మేరకు పరమేశ్వరుడు వివరించినట్లు, శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. ద్వాపరయుగంలో శ్రీ కృష్ణావతారానికి ముందు, బృందావనంలో దివ్య సింహాసనంపై ఆసీనుడై ఉన్న విష్ణువుకు, అకస్మాత్తుగా రమించాలనే కోరిక కలిగింది. వెంటనే, ఆయన శరీరం రెండు రూపాలుగా ఏర్పడింది. కుడి భాగం శ్రీ కృష్ణుడిగా, ఎడమ భాగం రాధా దేవిగా ఏర్పడ్డారు. జగన్మోహనాకారమైన రాధాదేవి, జగదేక సుందరుడైన కృష్ణుడిని చూసి వరించింది. కృష్ణుడు నిత్యం రాధా దేవి నామాన్నే స్మరిస్తూ, ఆమే లోకంగా జీవించసాగాడు. రాధ అంటే, ముక్తినిచ్చేది అని అర్థం. శ్రీ కృష్ణుడి పార్శ్వం నుండి ఉద్భవించిన రాధా దేవి రోమకూపాలనుండి, అనేక మంది గోపికలు, ఆవిర్భవించారు.

అదేవిధంగా, కృష్ణుడి రోమకూపాల నుండి, గోపాలురు ఉద్భవించారు. ఆ రాధా దేవి అంశతోనే, రాజులకు ఆనందాన్ని కలిగించే రాజ్యలక్ష్మీ, మన ఇంట్లో వెలిగించే దీపానికి అధిష్ఠాన దేవత అయిన మర్త్య లక్ష్మీ, ఆవిర్భవించారు. కృష్ణ పరమాత్మకు ప్రాణపత్ని, రాధా దేవి. ఎల్లప్పుడూ, ఆయన హృదయాన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. ఆమెను బ్రహ్మాది దేవతలు సైతం, పూజించేవారు.

ఒకనాడు శ్రీ కృష్ణుడు గోలోకంలోని శతశృంగ పర్వతంపై, విరజా దేవితో ఉండగా, ఆ విషయం చెలికత్తెల ద్వారా తెలుసుకన్న రాధా దేవి, ఆగ్రహావేశాలతో, ఆ శతశృంగ పర్వత ప్రాంతానికి చేరుకుంది. రాధా దేవి రాకను గమనించిన శ్రీ కృష్ణుడు, హఠాత్తుగా అదృశ్యమవ్వగా, విరజా దేవి భయపడి, నదిగా, ఆమె పరిచారికలు ఉపనదులుగా మారిపోయారు. ఆగ్రహంతో అక్కడకు చేరుకున్న రాధా దేవికి, ఎవ్వరూ కనబడకపోవడంతో, తిరిగి వెళ్లి పోయింది. కొంత సమయానికి కృష్ణుడు, తన ఎనిమిది మంది సహచర గోపకులతో పాటు, రాధా దేవిని కలవడానికి వెళ్లగా, అక్కడున్న ద్వార పాలకులు వారిని అడ్డగించారు. రాధా దేవి చాలా కోపంగా ఉందనీ, లోపలికి వెళ్ళవద్దనీ స్వామిని వారించారు. అయినా, వారి మాటలు వినకుండా, రాధా దేవి దగ్గరకు వెళ్ళారు, కృష్ణుడూ, ఆయన వెంట సహచరులూ.

కృష్ణుడిని చూసేసరికి, ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన రాధా దేవి, పరుషమైన మాటలతో, స్వామిని నిందించింది. రాధా దేవి ఎన్ని మాటలంటున్నా, మౌనంగా, ఆమె మాటలను భరిస్తూ నిలబడ్డాడు కృష్ణ భగవానుడు. అక్కడున్న గోపాలుడైన సుదాముడు, రాధా దేవి కృష్ణుణ్ణి నిందించడాన్ని సహించలేకపోయాడు. తిరిగి రాధాదేవిని దూషించడం, మొదలుపెట్టాడు. దాంతో, మరింత ఆగ్రహించిన రాధా దేవి, ‘ఓరీ సుదామా, ఎంత ధైర్యం? నన్నే దూషిస్తావా? చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా, రాక్షసంగా ప్రవర్తించిన నీవు, రాక్షసుడిగా భూలోకంలో జన్మించు’ అని శపించింది. రాధా దేవి శాపం విన్న సుదాముడు కూడా ఆగ్రహంతో, ‘రాధా దేవీ, నీవు కూడా నీ చెలికత్తెలతో సహా, భరత ఖండంలో జన్మించు. అక్కడ నీకు శ్రీ కృష్ణుడితో వంద సంవత్సరాల వియోగం ప్రాప్తిస్తుంది. నీతో పాటు శ్రీ కృష్ణుడు కూడా భూలోకంలో జన్మించి, అసుర సంహారం ద్వారా, భూభారాన్ని తగ్గిస్తాడు’ అని ప్రతి శాపమిచ్చాడు.

కొంతసేపటికి ఇరువురూ శాంతించారు. తల్లిని శపించినందుకు సుదాముడు ఎంతో పశ్చాత్తాప పడ్డాడు. రాధా దేవి కూడా, సుదాముడిని రాక్షసునిగా జన్మించమన్నందుకు, బాధపడింది. అలా రాధా దేవి చేత శపించబడిన సుదాముడే, శంఖచూడుడనే రాక్షసుడిగా జన్మించాడు. అతని భార్యే, తులసీ దేవి. ఈ శంఖ చూడుడు, శివుని త్రిశూలానికి బలై, రాక్షస జన్మను ముగించి, తిరిగి గోలోకానికి చేరుకున్నాడు. ఇక సుదాముడి శాపం ప్రకారం, వరాహ కల్పంలో రాధా దేవి, తన చెలికత్తెలతో సహా, భూలోకానికి వచ్చింది. మహాలక్ష్మీ అంశ అయిన రాధా దేవి, వృషభాను మహారాజూ, కళావతి దంపతులకు, అయోనిజగా, వాయురూపంలో జన్మించింది.

రాధా దేవికి, 12 సంవత్సరాల వయస్సురాగానే, రాయణుడనే వైశ్యపుత్రుడికిచ్చి వివాహం నిశ్చయించాడు, వృషభానుడు. దాంతో, రాధా దేవి తన ఛాయా రూపాన్ని అక్కడ వదిలి, అదృశ్యమయ్యింది. రాయణుడు, ఆ ఛాయా రూపాన్నే వివాహం చేసుకున్నాడు. రాధా దేవికి 14 సంవత్సరాల వయస్సున్నప్పుడు, కృష్ణుడు గోకులానికి వచ్చాడు. శ్రీ కృష్ణుడి తల్లైన యశోదా దేవి సోదరుడే, రాధా దేవిని వివాహం చేసుకున్న రాయణుడు. ఆ విధంగా, రాధ శ్రీ కృష్ణుడికి మేనత్త వరస అయ్యింది. రాధ, ఛాయా రూపంలో రాయణుడికి భార్యగా, నిజ స్వరూపంలో, కృష్ణుడి ప్రియసఖిగా, ఆయన వక్షస్థలంలో కొలువైంది. శ్రీ కృష్ణుడు బృందావన ధామంలో, రాధా దేవితో పాటు, కొన్నాళ్లు సంతోషంగా కాలం గడిపాడు. కానీ, సుదాముడి శాపం కారణంగా, వీరి మధ్య వియోగం ఏర్పడింది. రాధ భౌతికంగా కృష్ణుడికి దూరంగా ఉన్నా, నిరంతరం ఆయన సాన్నిధ్యాన్నే అనుభవించింది.. ఆయననే స్మరించింది.. ఆ మాధవుడినే ప్రేమించింది. అందుకే, వీరి ప్రేమ అజరామరం. కృష్ణ ఉపాసకులు కూడా, ముందుగా రాధాదేవి పేరును ఉచ్ఛరించి, ఆ తరువాతే, కృష్ణుడి పేరును ఉచ్ఛరించాలి.

రాధా కృష్ణ అని కాకుండా, ముందుగా కృష్ణుడి పేరు, తరువాత రాధ పేరును పలికినట్లయితే, బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంటుంది. రాధా కృష్ణులు, ఇద్దరుగా కనిపిస్తున్నా, నిజానికి ఒక్కరే. అర్థనారీశ్వర స్వరూపమే. శ్రీ కృష్ణుడే స్వయంగా చేసిన రాధా దేవి స్తోత్రాన్ని పఠించడం వలన, ఆయన అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. రాధా కృష్ణుల విగ్రహాలను గానీ, పటాలను గానీ, గృహంలో ఉంచుకుంటే మంచిదని, చాలా మంది భావిస్తారు. అందుకు గల కారణం, వారిరువురి మధ్యా గల ప్రేమానుబంధాలు, ఆ ఇంట్లో ఉన్న వారిలో కూడా చిగురించాలని. ముఖ్యంగా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి, సంతోషంగా ఉండాలని. రాధా కృష్ణులు వేరుగా ఉన్నా, ఏ విధంగా ఒకే ప్రాణంగా జీవించారో, ఆలూమగలు కూడా, ఆ విధంగానే, ఐక్యతతో మెలిగి, సుఖ సంతోషాలను కలిగి ఉండాలనేది, మన పెద్దల ఉద్దేశ్యం.

సకల కష్టాల నివారణకు ‘శ్రీకృష్ణశ్శరణం మమ’!

Link: https://www.youtube.com/post/UgwkGNIAZQBp7o-gUYx4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes