మనో నియంత్రణ!
భగవంతుడు మనిషికి ప్రసాదించిన గొప్పవరం, మనస్సు. మనిషిని మనస్సుకన్నా అధికంగా ప్రభావితం చేసేది, మరేదీ లేదు. అభ్యుదయానికి మూలం, మనస్సు. అలాగే, పతనానికి కారణం కూడా మనస్సే. అందుకే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో, మనస్సే మనకు మిత్రుడూ, శత్రువూ అని ఉపదేశించాడు.
[ కర్తృత్వాభిమానము - చేసేది నేనే అన్న అహంకారము! – https://youtu.be/bWgzBS2LXo0 ]
స్వచ్ఛతకూ, నిర్మలత్వానికీ సంకేతం, మనస్సు. మనిషిలో కలిగే స్పందనలూ, ప్రతిస్పందనలూ, రాగద్వేషాలూ, ఇలా అన్నింటికీ మూలం, మనస్సే. ఇలాంటి మనస్సును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి? మానసిక ఆనందం కలగడానికి, ఏం చేయాలి..?
దీనికి పతంజలి మహర్షి, నాలుగు విషయాలు బోధించాడు.
మొదటిది, సజ్జనసాంగత్యం..
సజ్జనులతో సహవాసం చేస్తే, భ్రమర కీటక న్యాయంగా, మనిషి సజ్జనుడిగా మారతాడు. సజ్జన సాంగత్యం వల్ల, మనస్సు నిర్మలమవుతుంది. మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది.
రెండవది, సహాయం..
ఈ సమాజంలో రకరకాల పరిస్థితుల వల్ల దుఃఖపడుతున్నవారున్నారు. వారిని ఓదార్చి, తగిన సహాయం అందించాలి. ఈ సహాయ సహకారాల వల్ల, మానసికానందం కలుగుతుంది.
మూడవది, సత్కార్యాలు..
ఎవరైనా సత్కార్యాలు చేస్తుంటే అభినందించాలి, ప్రోత్సహించాలి. ఆ సత్కార్యాల్లో భాగస్వాములమైతే, మనకు తప్పక మనశ్శాంతి కలుగుతుంది.
ఇక నాలుగవది, అధర్మ నిర్మూలనం..
మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మానికి అధర్మం వల్ల, సత్యానికి అసత్యం వల్ల హాని కలుగుతున్నప్పుడు, దానిని అణచి వేయగలిగిన సామర్థ్యం గలవారు, చూస్తూ ఊరుకోకూడదనీ, అలా ఉపేక్షించి ఊరుకున్నట్లయితే, వారికే నష్టం వాటిల్లుతుందనీ చెప్పాడు. అందుకే, సమర్థులైనవారు అధర్మాన్ని ఆపాలి. ఆ దుర్మార్గాన్ని ప్రోత్సహించకూడదు.
ఈ నాలుగింటినీ పాటించిన మనిషి, మానసిక ఆనందాన్నీ, మనశ్శాంతినీ పొందుతాడు.
మనస్సు చాలా చంచలమైనది. ఇలాంటి చంచలమైన మనస్సును, ఎలా అదుపు చేయాలన్న అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు, అభ్యాస వైరాగ్యాలతో అదుపు చేయగలమని, సమాధానం ఇచ్చాడు. నిత్యం బాహ్యవిషయాలపై పరుగులిడుతూ, చెడు అలవాట్లకు బానిసైన మనస్సును, సక్రమమైన మార్గంలోకి మళ్ళించి, ఆ దారిలో ముందుకు పయనించేలా అభ్యాసం చేయగలిగితే, మనో నియంత్రణ సాధ్యపడుతుంది.
మనస్సు ఎంత పవిత్రమైనదైతే, దాన్ని స్వాధీనం చేసుకోవడం, అంత సులభతరం. అందుకే, మనస్సులోకి నిరంతరం, సత్సంకల్పాలను ఆహ్వానించాలి. మనస్సును పరిశుద్ధం చేయడానికి, సాధన చేయాలి. మనో నియంత్రణ కలిగిన మనిషి, సమగ్రమైన వ్యక్తిత్వ వికాసం కలిగి ఉంటాడు. అతడిలో మానసిక రుగ్మతలు ఉండవు. మానసిక ఒత్తిళ్ల వల్ల కలిగే శారీరక రుగ్మతలూ దరిజేరవు. ప్రతిక్షణం, పరిపరి విధాలా ఆలోచించే మనసును నియంత్రించి, స్థిరత్వం కలిగించడానికి, ధ్యానం చక్కని ఆయుధం. అంతర్ముఖులైన ధీరులే, అంతరాత్మను దర్శించగలరంటారు, ఆధ్యాత్మికవేత్తలు. బహిర్గతమైన మనస్సును అంతర్ముఖంజేసుకుని, భగవంతుడి ధ్యానంలో గడిపిన మనిషికి, శాశ్వతానందం చేకూరుతుంది.
ప్రార్థన, సాధుజీవనం, సంకీర్తన, సద్గ్రంథ పఠనం, నిష్కామ సేవల వల్ల, మనస్సులో మాలిన్యాలు తొలగిపోతాయి, మానసిక శుద్ధత అలవడుతుంది. అప్పుడే, మనస్సులో ఉన్నతమైన భావాలు, అంకురిస్తాయి. అవే, మనిషిని విజయతీరం వైపుకు నడిపిస్తాయి.
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment