అంతర్యామి!

 

అంతర్యామి!

మనస్సు పోకడలు పలు విధములు, బహు ముఖములు. చేలిమి చేసి, మనస్సును మచ్చిక చేసుకోవాలి. మనిషి నడతలన్నీ, మనస్సు పోకడలను బట్టే ఉంటాయి. మనో చాంచల్యం, మన చర్యల్లో కనిపిస్తుంది. మన చర్యలను బట్టే, మనకు గౌరవ మర్యాదలుంటాయి. మనస్సు తెలిపి, మనస్సు తెలిసి, మసిలే మనుష్యులు దొరకడం, వరం. అట్టి వరం ప్రసాదింపబడినపుడు, వెనుకంజ వేయకూడదు.

[ మనిషికుండవలసిన లక్ష్యం!: https://youtu.be/laB5lI-sf2Q ]

వైద్యులు వ్యాధి మూలాలను పట్టుకుంటేనే, తగిన చికిత్స చేయడానికి వీలై, రోగం మందులతో శాంతిస్తుంది? తల్లిదండ్రులు తమ సంతానం గొప్పవాళ్లు కావాలని, ఆరాటపడతారు. వారి దృష్టిలో గొప్పదనం అంటే, ధనార్జన, హోదా, అధికారం, సాంఘిక గౌరవం.. ఇవన్నీ ఉన్నా, శీలం లేకపోతే, ఏమీ లేనట్లే. శీలం గలవారినే, జ్ఞానం ఆశ్రయించి ఉంటుంది. జ్ఞానం అంటే, కేవలం వివేకంతో కూడిన లోకజ్ఞానం కాదు. పరిణతి చెందిన ఆధ్యాత్మికతనే, శుద్ధ జ్ఞానం అంటారు. జ్ఞానానికి శుద్ధత ఏమిటి? అనుకోవచ్చు.. బంగారాన్ని శుద్ధి చేస్తేనే, మేలిమి బంగారమవుతుంది.

జ్ఞానికికూడా సందేహాలు ఉంటాయి. జనక మహారాజు వద్దకు శుకమహర్షి వెళ్ళి సందేహాలు తీర్చుకోవడం, ఇందుకు ఉదాహరణ. జ్ఞానం ఒక మహా సముద్రం. దానిని యథాతథంగా స్వీకరించగల శక్తి, అందరికీ ఉండదు. ఒక్క అగస్త్యుడే, సముద్రాలను ఆపోశనం పట్టినట్లు చెబుతారు. సముద్ర జలాలను సూర్యుడు ఆవిరిగా మార్చి, మేఘాలకు అందిజేస్తాడు. అప్పుడు వాటిలోని లవణ లక్షణం పోయి, మేఘాలు శుద్ధ జలాలను వర్షిస్తాయి. అవే, కొండలనుంచి సెలయేళ్లుగా, నదులుగా ప్రవహిస్తాయి. ఆ నీరు ప్రాణదాతగా, ప్రకృతికి జీవం ప్రసాదిస్తుంది. జ్ఞానమూ అంతే..

జ్ఞాన మూలం, పరమాత్మ.. ఆయన నుంచి శబ్ద బ్రహ్మంగా, వేదాలను మహర్షులు విన్నారు. అవి శ్రుతులయ్యాయి. వాటిని మననం చేసుకుంటూ, సుబోధకంగా శిష్య పరంపరకు చెప్పారు. అవే, స్మృతులు. అనేక వడపోతల తరువాత జ్ఞానం, శుద్ధం, పరిశుద్ధం, సుగ్రాహ్యంగా మారి, జిజ్ఞాసువులకు అందుబాటులోకి వచ్చింది.

మనిషి ఇంటినీ, ఒంటినీ శుభ్రం చేసుకుంటాడే తప్ప, మనస్సులోని మకిలిని వదిలించుకోవాలనుకోడు. అసలు సమస్య అంతా, మనస్సుతోనే. దానిని శూన్యం చేసుకోవాలంటారు, జ్ఞానులు. కొందరు తీవ్రమైన సాధనలు చేసేవారు, ‘మనోనాశ’ అనే స్థితికి చేరతారు. ఇది దాదాపు, అవధూత స్థితి. భారతీయ ఆధ్యాత్మికత, ఆత్మస్వరూపుడైన అంతర్యామికి తొలి తాంబూలం ఇస్తుంది. అంతర్యామి దాసుడే, అసలైన భక్తుడు. అంతర్యామి అంటే, ఆలయ శిలామూర్తి కాదు. సృష్టిలోని సమస్త ప్రేమ, ఆనందం, అనంతత్వం, ఇవన్నీ కలగలిసిన ఒక దివ్యతేజం. విశ్వంభరగా ఉన్న నిత్య చైతన్యం. దానిని దర్శించాలంటే, మనం ఆత్మస్థితికి చేరుకోవాలి. మనం మోస్తున్న మనస్సూ, బుద్ధి అనే రెండు బరువుల్ని వదిలించుకోవాలి, లేదా జ్ఞానాగ్నిలో దహనం చెయ్యాలి.. అంటే, వాటి ప్రమేయం నశించాలి.

‘నేను’కు నిర్వచనాలు, మనస్సూ, బుద్ధి. ‘నేను’ నశించాక మిగిలేది, అనంతుడూ, అజేయుడూ, శాశ్వతుడైన బ్రహ్మమే. సృష్టిలో బ్రహ్మం కానిదేదీ లేదంటుంది, యోగ వాసిష్ఠం. అంటే, మనం కూడా, బ్రహ్మ స్వరూపులమే. కానీ, ఆ జ్ఞానం మనకు లేదు. అలా లేకపోవడమే, మాయ. మన జీవితకాల యుద్ధం, ఈ మాయతోనే. మాయను జయిస్తే, ప్రపంచమనే మత్తూ, భ్రమలలోంచి బయటపడితే, ఎదురుగా కనిపించేది, అంతర్యామే. ఆ మహా తేజస్సు ఎప్పుడూ, అలాగే, అక్కడే ఉంటుంది.

ఎప్పుడు మనం అంతర్యామిని చూడగలుగుతామో, అక్కడితో మనం గమ్యం చేరినట్లే. మన జీవనయానం, ముగిసినట్లే. ఇవి జరగాలంటే, మనస్సు పోకడల్ని గమనిస్తూ, మనల్ని మనం, తడబడకుండా, దారి తప్పకుండా, ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. మనం 'నేను'ను తప్పుగా అన్వయం చేసికోవడం వల్ల కలిగే సుఖదు:ఖ కారక  భావములూ, జ్ఞానములూ, అజ్ఞానములూ, మన నిజ స్థితియైన శాంతానంద స్థితిని కప్పివేస్తాయి. అవి తొలగగానే, సతతమూ మన నిజస్వభావమైన శాంతి, మనస్సంతా నిండుతుంది. మనస్సపుడు విరామము నొంది, అంతరంగమంతా అంతర్యామే..

శ్రీర్భూయాత్!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes