బ్రాహ్మణుడు గొప్పవాడా? క్షత్రియుడు గొప్పవాడా?
ఇంద్రుడి వజ్రాయుధం దధీచి మహర్షి ఆస్థికలతో చేయబడడం వెనుక చరిత్ర! పూర్వం చాలా మంది మహర్షులు తమ జీవితాలను లోక కల్యాణం కోసం పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితంగానే, మనం ఈ రోజు సంతోషంగా ఉంటున్నాం.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/DlfdeuIRzqA ]
యాగాలు చేసి, మేధస్సును సంపాదించి, దాన్ని లోక శ్రేయస్సు కోసమే ఉపయోగించారు. అలాంటి మహర్షులలో గొప్పవాడూ, తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిన వాడూ, దధీచి. గొప్ప తపోధనుడైన చ్యవన మహర్షీ, సుకన్య దంపతులకు పుట్టిన వాడు, దధీచి మహార్షి. బాల్యం నుండీ భక్తితత్పరుడైన దధీచి, ఈశ్వరానుగ్రహం పొందాడు. అన్ని శాస్త్రాలలో, దధీచి మహర్షి ప్రావీణ్యుడు. తన స్నేహితుడితో మొదలైన వాగ్వాదం, ఆయన ప్రాణాలను కబళించింది. అసలు దధీచి మహర్షికి, తన మిత్రునితో వైరం ఎందుకొచ్చింది? మృత్యువు ఒడిలోకి వెళ్లిన దధీచి, శ్రీహరిని ఎదిరించేంత బలవంతుడెలా అయ్యాడు? దధీచి అస్థికలతో తయారైన వజ్రాయుధం, ఎందుకంత శక్తివంతమైంది - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
పూర్వం బ్రహ్మదేవుడి కుమారుడైన క్షుపుడు, తన పరాక్రమంతో, భూమండలాన్ని సస్యశ్యామలంగా పాలించేవాడు. ఆయనకు, మహాతపస్వి అయిన దధీచి మునితో స్నేహం ఏర్పడింది. వీరి మధ్య అనుబంధం మరింత బలపడింది. అయితే, ఒకనాడు వారిద్దరికీ విప్రుడు గొప్పవాడా? క్షత్రియుడు గొప్పవాడా? అనే ప్రశ్న తలెత్తింది. దాంతో, వారిరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. క్షుపుడు, 'నేను శ్రీ హరి అంశతో జన్మించిన క్షత్రియుణ్ణి కనుక, నీ కన్నా నేనే గొప్పవాడిని' అని అహంకారంతో వాదించాడు. ఆ మాటలు విన్న దధీచికి ఆగ్రహం కలిగింది. వెంటనే తన పాదాలతో, క్షుపుడిని తన్నాడు. దాంతో, పట్టరాని ఆవేశంతో క్షుపుడు, తన దగ్గరున్న మహాయుధంతో దధీచిని కొట్టాడు. వెంటనే తన శరీరం రెండు భాగాలుగా చీలి, క్రిందపడిపోయాడు. తాను మరణ స్థితిలో ఉండగా, శుక్రాచార్యుణ్ణి స్తుతించాడు.
వెంటనే శుక్రాచార్యుడు అక్కడకు వచ్చి, తన దగ్గరున్న మృత సంజీవనీ విద్యతో, దధీచిని పునర్జీవితుణ్ణి చేశాడు. శుక్రాచార్యుడు దధీచితో, ‘దేవదేవుడూ, మహాదేవుడూ అయిన పరమేశ్వరుణ్ణి ఆరాధించి, మృత్యువుని జయించు. నాకీ మృత సంజీవనీ విద్యను ఉపదేశించింది, ఆ శంకరుడే. శివభక్తులైన వారికి, ఎప్పటికీ మృత్యుభయం ఉండదు.’ అని చెప్పి, త్ర్యంబక మంత్రాన్ని ఉపదేశించాడు. అలా శుక్రాచార్యుడి ద్వారా మంత్రోపదేశం పొందిన దధీచి మహార్షి, ఆయన చెప్పినట్టుగానే, మహా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి, సిద్ధి పొందాడు. ఆయన శరీరం, అవధ్యత్వాన్నీ, వజ్రం లాంటి ఎముకలనూ పొంది, ఎంతో దృఢంగా తయారయ్యింది. దధీచి సంపూర్ణ బలవంతుడయ్యాక, క్షుపుడి దగ్గరకువెళ్లి, మరోసారి ఆగ్రహంగా అతనిని తన్నాడు. దాంతో క్షుపుడు కూడా, తన ఆయుధంతో దధీచిని ఖండించబోగా, అది ఆయన శరీరానికి తగిలి, వంకరపోయింది.
ఆశ్చరపోయిన క్షుపుడు, దధీచి మహర్షికి శివానుగ్రహం లభించిందని గ్రహించి, వెనుతిరిగాడు. దధీచి చేతిలో అవమానించబడ్డ క్షుపుడు, ఏకాగ్రతతో, నారాయణుడి అనుగ్రహం కోసం తపస్సు చేయసాగాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత, శంఖ చక్రగదాధరుడై, సర్వాలంకార సంశోభితంగా, శ్రీహరి అతడికి దర్శనమిచ్చాడు. వెంటనే ఆయన పాదాల మీద పడి, తనను రక్షించమని ప్రార్ధించాడు. అందుకు శ్రీహరి, 'నీకేం కావాలో కోరుకో' అనగా, 'ప్రభూ! ఈశ్వరానుగ్రహం సంపాదించిన దధీచి మహర్షిని ఓడించే బలాన్ని ప్రసాదించు' అని వేడుకున్నాడు. క్షుపుడి కోరిక విన్న శ్రీహరి, 'రాజేంద్రా! శివభక్తులైన వారు, దేనికీ భయపడరు. వారిని ఎదురించడం, కష్టతరం. మహాముని అయినటువంటి దధీచికి, ఈశ్వరుడి బలం తోడైనందువలన, అతనిని ఓడించడం అసాధ్యం. కానీ, నీ భక్తి ప్రపత్తులు నన్ను ఆనందింపచేశాయి. అందుకే, నీ విజయం కోసం ప్రయత్నిస్తాను' అని శ్రీహరి మాటిచ్చాడు. క్షుపుడికిచ్చిన మాట ప్రకారం, ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో, శ్రీహరి దధీచి దగ్గరకు వెళ్ళాడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీహరికి, అతిథి మర్యాదలు చేశాడు దధీచి.
ఆ వృద్ధ బ్రాహ్మణుడు, 'దధీచి! నాకొక వరాన్ని ప్రసాదించు' అని కోరాడు. తపోసంపన్నుడైన దధీచి, వచ్చిన వాడు శ్రీహరేనని గుర్తించి 'ప్రభూ! మీరు శ్రీహరియని నాకు తెలుసు. క్షుపుడి కోరిక మేరకు నా దగ్గరకు వచ్చారు. మీకేం కావాలో అడుగండి స్వామీ' అని వినయపూర్వకంగా అడిగాడు. దధీచి తనను గుర్తుపట్టడంతో, శ్రీ హరి తన నిజ రూపాన్ని ధరించి, 'నా భక్తుడైన క్షుపుడికి మాటిచ్చాను. ఒక్కసారి క్షుపుడి సభలోకి వచ్చి, ‘నీ వల్ల నేను భయపడతాను’ అని ఒక్కమాట చెప్పు' అని అడిగాడు. అందుకు దధీచి, ‘నేను అసత్యాన్ని పలకన’ని గట్టిగా చెప్పాడు. దాంతో శ్రీహరి ఆగ్రహించి, తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. మహావేగంతో వచ్చిన సుదర్శన చక్రం, దధీచి మహర్షి శరీరాన్ని తాకినా, వజ్రశరీరుడు కావడంతో, అతన్ని కొంచెం కూడా గాయపరచలేకపోయింది. అప్పుడు దధీచి, 'స్వామీ! నీ సుదర్శన చక్రం కూడా శివుడు ప్రసాదించినదే కాబట్టి, అది నన్నేం చేయలేదు.' అని చెప్పడంతో, దధీచిలోని గొప్పతనాన్ని ప్రశంసించి, వైకుంఠానికి వెళ్లిపోయాడు శ్రీహరి. ఈ విషయమంతా తెలుసుకున్న క్షుపుడు, ఇక చేసేదేమీ లేక, దధీచి దగ్గరకు వచ్చి, క్షమించమని వేడుకున్నాడు.
దీనుడై నిలచిన క్షుపుడిని క్షమించి, 'రాజేంద్రా! ఎప్పటికీ నేనే గొప్ప అనే అహంకారం రాకూడదు. యోగ్యులైన వారు మాత్రమే పూజ్యులు.' అని హితబోధ చేయడంతో అందుకంగీకరించి, ఆయనకు నమస్కరించి, తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు క్షుపుడు. ఈ సంఘటన జరిగిన ప్రదేశం, స్థాణేశ్వరం. దధీచి-క్షుపుల సంవాదాన్ని చదివినవారూ, విన్నవారూ, బోధించినవారూ, అపమృత్యు బాధల నుండి విముక్తులై, శరీరం పతనం చెందాక కైలాసాన్ని చేరుకుంటారని, శ్రీ లింగ పురాణం వివరిస్తోంది. శ్రీహరిని సైతం ఓడించిన దధీచి, గొప్ప మహర్షి అనడంలో, సందేహం లేదు. పరమేశ్వరుడి అనుగ్రహంతో పరాక్రమవంతుడైన దధీచి, లోక శ్రేయస్సు కొరకు ప్రాణత్యాగం చేశాడు. వృత్తాసురుడనే రాక్షసుడు, దేవతలను అష్టకష్టాలు పెడుతుండేవాడు. వృత్తాసురుడు, దేవతల ఆయుధాలను అపహరించాలని పన్నాగం వేయడంతో, ఆ విషయం తెలుసుకున్న ఇంద్రుడు, దేవతల ఆయుధాలన్నింటినీ తన దగ్గర ఉంచమనీ, శస్త్రాల అవసరం వచ్చినప్పుడు, తిరిగి తీసుకుంటామనీ చెప్పి, దధీచి మహర్షికి అప్పగించాడు.
కొంతకాలం గడచిన తరువాత, ఇక శస్త్రాలకు కాపలా కాయడం కష్టతరమనిపించడంతో, వాటిని తన కమండలంలోని నీటితో కలిపి త్రాగేశాడు, దధీచి మహర్షి. ఆ శస్త్రాల శక్తంతా, దధీచి ఎముకలలోనికి చేరింది. ఎంత కాలం యుద్ధం జరుగుతున్నా, ఇంద్రుడు వృత్తాసురుడిని ఓడించలేకపోయాడు. దాంతో, శ్రీహరిని చేరి, సలహా కోరగా, ఆయన వృత్తాసురుడిని చంపగలిగేది, కేవలం దధీచి ఎముకల నుండి తయారు చేయబడే ఆయుధమేనని తెలియజేశాడు. దాంతో ఇంద్రుడు, దధీచి మహర్షిని చేరుకుని, జరిగిన విషయాన్ని చెప్పడంతో, ఆయన చిరునవ్వుతో, 'సరే.. నేను ప్రాణత్యాగం చేస్తాను' అని మాటయిచ్చాడు. ఆ విధంగానే, తన తపోశ్శక్తితో ప్రాణాలను విడువగా, అక్కడున్న గోవు, దధీచి శరీరాన్ని నాకింది. వెంటనే ఆయన శరీరంలో రక్తమాంసాలు మాయమై, కేవలం అస్థికలు మాత్రమే మిగిలాయి. వాటిని తీసుకువెళ్లి, ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేయించి, వృత్తాసురుడిని సంహరించాడు. తనను అవమానించిన వారికి బుద్ధిచెప్పడం మాత్రమే కాదు, తనను శరణు కోరిన వారి కోసం, ఏంతటి త్యాగానికైనా సిద్ధపడిన మహార్షి, దధీచి. లోక కల్యాణం కోసం, ప్రాణాలను సైతం త్యజించిన దధీచి జీవితం, నేటికీ స్ఫూర్తిదాదయకం.
🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏
Post a Comment